నాగార్జునసాగర్ తీరాన ఘనంగా వరుణ మహాయాగం

నల్లగొండ ప్రతి నిధి, ఏపీబీ న్యూస్: రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలు సుభిక్షంగా జీవించాలని ఆకాంక్షిస్తూ నాగార్జునసాగర్ వద్ద కృష్ణా నది తీరాన రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన వరుణ మహాయాగం సోమవారం వైభవంగా ముగిసింది. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థాన అర్చకుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ యాగంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొని పూర్ణాహుతి నిర్వహించారు.

ఉదయం 4.05 గంటలకు నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు యాగాన్ని ప్రారంభించారు. కృష్ణా నది ఒడ్డున ఏర్పాటు చేసిన యాగశాలలో 108 మంది రుత్వికులు వేదమంత్రాల నడుమ గోపూజ నిర్వహించి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అనంతరం పుణ్యాహవాచనం, అంకురార్పణం, ఋష్యశృంగ పూజ, యాగ ప్రదక్షిణ తదితర వైదిక కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించడంతో సాగర్ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయాయి.

మధ్యాహ్నం అనంతరం జరిగిన పూర్ణాహుతి కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు హాజరయ్యారు. సాగర్కు చేరుకున్న ముఖ్యమంత్రికి మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి కె. జానారెడ్డి, జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవార్ తదితరులు స్వాగతం పలికారు. అర్చకులు పూర్ణకుంభంతో సీఎం దంపతులను యాగశాలకు ఆహ్వానించారు. ప్రత్యేక పూజల అనంతరం పూర్ణాహుతితో యాగం ముగిసింది.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో సమృద్ధిగా వర్షాలు కురవాలని ప్రార్థించారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ సహా రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులు నిండాలని, చెరువులు, కుంటలు జలకళతో కళకళలాడాలని ఆకాంక్షించారు. భూగర్భ జలాలు పెరిగి రైతులకు మేలు జరగాలని, పంటలు పుష్కలంగా పండాలని కోరుకున్నారు.

నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రైతు సంక్షేమం దృష్ట్యా వరుణ యాగం నిర్వహించినట్లు తెలిపారు. ఈ వానాకాలంలో వర్షాల పంపిణీ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో సాగునీటి అవసరాలపై ప్రభావం పడే అవకాశముందని పేర్కొన్నారు. ప్రభుత్వం శాస్త్రీయ ప్రణాళికలతో పాటు ఆధ్యాత్మిక సంప్రదాయాలకు కూడా ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. ప్రతి టీఎంసీ నీటిని పొదుపుగా వినియోగిస్తూ రైతులకు సాగునీటి భరోసా కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రైతు కమిషన్ ప్రతినిధులు, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Share
Share