Breaking News: స్టేట్ పర్మిషన్‌తో సీబీఎస్ఈ పాఠాలు.. ‘శ్లోకా ది గ్లోబల్ స్కూల్’ నిర్వాహకంపై తల్లిదండ్రుల ఆగ్రహం..

హైదరాబాద్ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: విద్యాబుద్ధులు నేర్పించాల్సిన పాఠశాలలు క్రమంగా దారి తప్పి కోట్లాది రూపాయలు కొల్లగొట్టే వ్యాపార సామ్రాజ్యాలుగా మారుతున్నాయి. తెలంగాణలో, ముఖ్యంగా రాజధాని హైదరాబాద్లో ప్రభుత్వ పర్మిషన్లు సరిగా లేకుండానే కార్పొరేట్ హంగులతో పెద్ద పెద్ద భవంతులు కట్టి, విద్యను వ్యాపారంగా మలుచుకుంటున్న బడా బాబుల వైపు విద్యాశాఖ అధికారులు కన్నెత్తి కూడా చూడటం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, గ్లోబల్ కరికులం పేరుతో నగరంలో పుట్టగొడుగుల్లా వెలుస్తున్న ప్రైవేటు పాఠశాలలు తల్లిదండ్రుల నుంచి లక్షలాది రూపాయల ఫీజులు వసూలు చేస్తూ నిలువునా దోచుకుంటున్నాయి.

హైదరాబాద్ నగరంలో ‘శ్లోకా’ అనే బ్రాండ్ నేమ్తో అనేక స్కూళ్లు వెలిసాయి. అందులో నాగోల్ మెట్రో స్టేషన్, ఇన్నర్ రింగ్ రోడ్డు సమీపంలో ఉన్న ‘శ్లోకా ది గ్లోబల్ స్కూల్’ (Sloka The Global School) నిర్వాహకంపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఈ పాఠశాలకు కేవలం రాష్ట్ర ప్రభుత్వ (State Board) అనుమతి మాత్రమే ఉంది. కానీ, సీబీఎస్ఈ (CBSE) సిలబస్ చెప్తున్నామంటూ అడ్మిషన్ల సమయంలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ తల్లిదండ్రుల వద్ద నుంచి లక్షల్లో ఫీజులు దండుకుంటున్నారు.

సాధారణంగా సీబీఎస్ఈ కరికులం నడపాలంటే అధిక అర్హతలు (High Qualified Teachers) ఉన్న ఉపాధ్యాయులు, దానికి తగ్గ మౌలిక వసతులు ఉండాలి. కానీ స్టేట్ బోర్డు అనుమతులతో నడిచే ఈ పాఠశాలలో సరైన ప్రమాణాలు లేవని, వెబ్సైట్(https://slokaschools.com/sloka-nagole/)లో ఒకలా చూపిస్తూ ప్రాక్టికల్గా మరొకలా నడిపిస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

సిలబస్ పేరుతో మోసం: స్టేట్ పర్మిషన్తో నడుస్తూ సీబీఎస్ఈ అని చెప్పి లక్షల్లో ఫీజుల వసూలు.

భారీగా హిడెన్ ఛార్జీలు: ట్యూషన్ ఫీజుతో పాటు యూనిఫామ్లు, పుస్తకాలు, ట్రాన్స్పోర్ట్ పేరుతో వేలల్లో అదనపు బాదుడు.

బోధనా ప్రమాణాల్లో శూన్యం: బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ భేషుగ్గా ఉన్నా, అర్హత కలిగిన టీచర్లు లేక పడిపోతున్న విద్యా ప్రమాణాలు.

నిబంధనల ఉల్లంఘన: ప్రభుత్వ నిబంధనల ప్రకారం వెబ్సైట్లో ఉద్యోగులు, సదుపాయాల సమగ్ర వివరాలు పొందుపరచడంలో విఫలం.

“నాగోల్ మెట్రోకు దగ్గరగా ఉండటం, స్కూల్ సొంత బిల్డింగ్ అని చెప్పడంతో పిల్లలకు మంచి కేరింగ్ తీసుకొని ఉన్నత విద్యనందిస్తారని ఆశతో మా పిల్లల్ని ఇక్కడ చేర్పించాము. కానీ చేర్పించిన తర్వాత తెలిసింది.. ఎక్కడా లేని విధంగా అత్యధిక ధరలతో యూనిఫామ్లు, బుక్స్, అడ్మిషన్ ఫీజులు, హిడెన్ ఫీజులంటూ డబ్బులు వసూలు చేస్తూనే ఉన్నారు. కానీ ఇక్కడ చదువు మాత్రం ఆమడ దూరంలో ఉంది. ఎన్నో ఆశలతో జాయిన్ చేసిన మా పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందేమోనని భయపడుతున్నాం. విద్యాశాఖ అధికారులు స్పందించి న్యాయం చేయాలి” అని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ అక్రమాలపై విద్యాశాఖ అధికారి (MEO) రామారావు స్పందిస్తూ.. “సదరు ప్రైవేట్ స్కూలుపై ఇప్పటికే మాకు ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై యాజమాన్యానికి సమాచారం ఇచ్చాం. పర్మిషన్ కోసం అప్లై చేశామని, త్వరలో వస్తుందని వారు తెలిపారు. మరోసారి పాఠశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి (Follow-up), నిబంధనలు ఉల్లంఘిస్తే తగు కఠిన చర్యలు తీసుకుంటాం” అని తెలిపారు.

విద్యాశాఖ అధికారులు తక్షణమే స్పందించి తనిఖీలు చేపట్టి, విద్యను వ్యాపారంగా మార్చిన ఇటువంటి సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Share
Share