- 12 ఏళ్ల పాత పట్టు నిలబెట్టుకునేందుకు కొత్త సమీకరణాలు
- ఫైనాన్షియర్లు.. రియల్టర్లు.. కాంట్రాక్టర్లు.. రిటైర్డ్ ఉద్యోగులతో ప్యానల్
- క్లబ్లో చోటు దక్కని వారికి రెడ్క్రాస్లో అవకాశం..
- పాత వ్యూహాన్నే ఇక్కడా అమలు చేస్తున్నారనే ఆరోపణలు
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నల్లగొండలోని ప్రతిష్టాత్మక రెడ్క్రాస్ సొసైటీపై ఆధిపత్యం కోసం కొత్త సమీకరణాలు తెరపైకి వచ్చాయి. కొన్నేళ్లుగా నల్లగొండ క్లబ్ వ్యవహారాల్లో ఆధిపత్యం ప్రదర్శిస్తున్న వర్గమే తాజాగా రెడ్క్రాస్ సొసైటీని సైతం తమ గుప్పిట్లో పెట్టుకునేందుకు పావులు కదుపుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా విందులు, వినోదాల్లో ఉండే బిగ్షాట్స్, నల్లగొండలో ఫైనాన్స్ వ్యాపారాలు నిర్వహిస్తున్న బడా ఫైనాన్షియర్లు, వందల కోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్న రియల్టర్లు, విద్యుత్ శాఖలో భారీ పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు, వారి అనుబంధంగా ఉన్న కొందరు రిటైర్డ్ ఉద్యోగులు ఒకే వేదికపైకి వచ్చి రెడ్క్రాస్ ఎన్నికల్లో ప్యానల్గా బరిలోకి దిగడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటివరకు రెడ్క్రాస్ సొసైటీలో దాదాపు 12 ఏళ్లుగా పెద్దగా ఎన్నికల సందడి లేకుండా కొనసాగిన పాలకవర్గానికి తొలిసారి ఎన్నికల సవాల్ ఎదురైంది. దీంతో పాత ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడమే లక్ష్యంగా వ్యూహాత్మకంగా అభ్యర్థుల ఎంపిక, సమీకరణాలు సాగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.
క్లబ్ తర్వాత.. రెడ్క్రాస్!
నల్లగొండ క్లబ్ ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాన్నే ఇప్పుడు రెడ్క్రాస్ ఎన్నికల్లోనూ అమలు చేస్తున్నారనే ఆరోపణలు ప్రత్యర్థి వర్గాల నుంచి వస్తున్నాయి. క్లబ్లో కీలకంగా వ్యవహరించినవారితో పాటు క్లబ్ మాజీ కార్యవర్గ సభ్యులు, క్లబ్ సభ్యత్వం ఉన్న మరికొందరిని సమన్వయం చేసి రెడ్క్రాస్ ఎన్నికల బరిలోకి దింపినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే నల్లగొండ క్లబ్, రెడ్క్రాస్ సొసైటీల్లో కీలక పదవుల్లో ఉన్న అమరేందర్ రెడ్డి మరోసారి రెడ్క్రాస్పై ఆధిపత్యం కొనసాగించేందుకు తనకు అనుకూలంగా ఉన్న వర్గాలను ఏకం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. 15 మంది అభ్యర్థులతో ప్యానల్ను ఏర్పాటు చేయడం వెనుక పక్కా వ్యూహం ఉందని ప్రత్యర్థి వర్గాలు అంటున్నాయి. ఈ 15 మందిలో ఏడుగురు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కాగా.. మిగిలిన ఎనిమిది మంది ఇతర సామాజిక వర్గాలకు చెందినవారిగా ఉన్నారు. అన్ని వర్గాలను కలుపుకొన్నట్లు కనిపించేలా అభ్యర్థుల ఎంపిక చేసినప్పటికీ, కీలక నిర్ణయాల్లో మాత్రం పాత వర్గానికే పట్టం కట్టేలా సమీకరణాలు రూపొందించారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఫైనాన్షియర్లు.. రియల్టర్లు.. కాంట్రాక్టర్లు
ఈసారి రెడ్క్రాస్ ఎన్నికల బరిలోకి దిగిన ప్యానల్లో వివిధ రంగాల్లో ఆర్థికంగా, సామాజికంగా ప్రభావం ఉన్న వ్యక్తులు ఉండటం చర్చకు దారితీసింది. ఫైనాన్స్ వ్యాపారాలు నిర్వహించే వారు, రియల్ ఎస్టేట్లో పెద్ద మొత్తంలో వ్యాపారం చేస్తున్న వారు, విద్యుత్ శాఖలో భారీ కాంట్రాక్టులు నిర్వహిస్తున్న వారు, రిటైర్డ్ ఉద్యోగులు ఇలా భిన్న రంగాలకు చెందిన వారిని ఒకే ప్యానల్లోకి తీసుకొచ్చినట్లు ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్ కేంద్రంగా ఉంటూ నల్లగొండలోని వివిధ వ్యవహారాల్లో ప్రభావం చూపుతున్న బిగ్షాట్స్తో పాటు, స్థానికంగా ఆర్థిక బలం ఉన్న వ్యాపార వర్గాలను సైతం ఈ సమీకరణంలో భాగస్వామ్యం చేశారనే చర్చ జరుగుతోంది. ఆర్థికంగా, సామాజికంగా బలమైన వర్గాలను ఒకే గొడుగు కిందకు తీసుకురావడం వెనుక రెడ్క్రాస్ ఎన్నికలను సాధారణ ఎన్నికలుగా కాకుండా ప్రభావ ప్రతిష్టల పోరుగా మార్చే ప్రయత్నం ఉందా? అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.

క్లబ్లో చోటు దక్కని వారికి ‘రెడ్క్రాస్’ ఎర?
ఇటీవలే నల్లగొండ క్లబ్ కార్యవర్గ ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో కార్యవర్గంలో చోటు దక్కని కొందరిని రెడ్క్రాస్ సొసైటీ ద్వారా తమవైపు తిప్పుకునే ప్రయత్నం జరిగిందనే ఆరోపణలు ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్నాయి. క్లబ్ కార్యవర్గంలో వరుసగా రెండుసార్లు అవకాశం దక్కని కొందరు సభ్యులను సైతం రెడ్క్రాస్ ఎన్నికల్లోకి తీసుకురావడం వెనుక ఇదే వ్యూహమని ప్రత్యర్థి వర్గాలు అంటున్నాయి. ఒకవైపు క్లబ్ పదవుల్లో అవకాశం రాక అసంతృప్తిగా ఉన్న వారిని దగ్గరకు తీసుకోవడం.. మరోవైపు వారికి రెడ్క్రాస్లో స్థానం కల్పించే హామీ ఇవ్వడం ద్వారా ఎన్నికల సమీకరణాలను తమకు అనుకూలంగా మార్చుకున్నారనే విమర్శలు ఉన్నాయి. అదే సమయంలో అమరేందర్ రెడ్డిని వ్యతిరేకించే వర్గాలకు చెందిన కొందరిని కూడా ప్యానల్లోకి తీసుకోవడం వెనుక వ్యూహాత్మకమైన రాజకీయమే ఉందనే చర్చ సాగుతోంది. ఒకే వ్యక్తి వరుసగా క్లబ్, రెడ్క్రాస్ వంటి సంస్థల్లో కీలక పదవులు చేపడుతున్నారనే విమర్శలు రాకుండా అసంతృప్త వర్గాలకు కూడా ప్రాతినిధ్యం కల్పించినట్లు కనిపించేలా అభ్యర్థుల ఎంపిక జరిగిందని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు.
ముందే సమీకరణం.. తర్వాత పదవి?
ఎన్నికల్లో ప్యానల్ విజయం సాధించిన అనంతరం కీలక పదవుల పంపకంలో ఎలాంటి ప్రతిఘటన లేకుండా ఉండేలా అభ్యర్థుల ఎంపికలోనే జాగ్రత్తలు తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా భవిష్యత్లో చైర్మన్ పదవిపై ఎలాంటి పోటీ లేకుండా ముందుగానే అనుకూల వర్గాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చారని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. రెడ్క్రాస్ చైర్మన్, సెక్రటరీ వంటి కీలక పదవుల్లో గత కొన్నేళ్లుగా ఒకే వర్గం ప్రాధాన్యం కొనసాగుతోందనే ఆరోపణల నేపథ్యంలో.. ఈసారి అభ్యర్థుల ఎంపికపై ప్రత్యేకంగా చర్చ జరుగుతోంది.
12 ఏళ్ల తర్వాత.. తొలిసారి ఎన్నికల పరీక్ష
రెడ్క్రాస్ సొసైటీలో దాదాపు 12 ఏళ్లుగా ఎన్నికలు నిర్వహించకుండా పాలకవర్గం కొనసాగిందనే విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు ఎన్నికలు అనివార్యం కావడంతో పాత పాలకవర్గం తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల పరీక్షను ఎదుర్కొంటోంది. ఇదే సమయంలో రెడ్క్రాస్ కార్యకలాపాలపై గతంలో రాష్ట్ర గవర్నర్ స్థాయిలో అసంతృప్తి వ్యక్తమైన నేపథ్యంలో, క్లబ్తో అనుబంధం ఉన్న వర్గాలు తమ బలాన్ని చాటుకునేందుకు రెడ్క్రాస్ ఎన్నికలను వేదికగా ఉపయోగించుకుంటున్నాయనే చర్చ కూడా సాగుతోంది. అయితే క్లబ్ ఎన్నికల్లో తమకు అనుకూలంగా పనిచేసిన సమీకరణాలను రెడ్క్రాస్ లోనూ పునరావృతం చేయడం ద్వారా పాత ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలను సంబంధిత వర్గాలు ఎలా సమర్థించుకుంటాయన్నది ఆసక్తికరంగా మారింది.
సేవా సంస్థపై ఆధిపత్య పోరేనా?
రెడ్క్రాస్ సొసైటీ లక్ష్యం సేవా కార్యక్రమాలు, రక్తదానం, విపత్తుల సమయంలో సహాయం, వైద్య సేవలు, సామాజిక సేవ వంటి కార్యక్రమాలతో ప్రజలకు చేరువ కావాల్సిన సంస్థలో రాజకీయ, వ్యాపార, వ్యక్తిగత సమీకరణాలకు ఎంతవరకు చోటుండాలన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. 12 ఏళ్లుగా కొనసాగుతున్న పాత పాలకవర్గం.. దానికి అనుబంధంగా ఉన్న క్లబ్ వర్గాలు.. ఆర్థికంగా బలమైన ఫైనాన్షియర్లు, రియల్టర్లు, కాంట్రాక్టర్లు.. మరోవైపు కొత్తగా అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వర్గాలు.. ఇలా అనేక సమీకరణాల మధ్య ఈసారి రెడ్క్రాస్ ఎన్నికలు జరుగుతున్నాయి.