తుపాకీ మోతల మధ్య ఆనంద్‌ని చూశాను.. సీనియర్ జర్నలిస్ట్ ఎమోషనల్ పోస్ట్..

హైదరాబాద్, ఏపీబీ న్యూస్: ఒక అధికారికి హోదా, కుర్చీ కంటే ఆయన బాధ్యత నిర్వర్తించిన తీరే కాలక్రమేణా గురుతుండిపోతుందని నిరూపించే ఒక ఆసక్తికర సంఘటన సోషల్ మీడియా వేదికగా వెలుగులోకి వచ్చింది. 23 ఏళ్ల క్రితం హైదరాబాద్ నగరంలో చెలరేగిన అల్లర్ల సమక్షంలో, తుపాకీ పట్టుకుని ముందుండి నడిచిన నాటి సెంట్రల్ జోన్ డీసీపీ, ఇప్పటి తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ (CV Anand) ధైర్యసాహసాలను సీనియర్ క్రైమ్ జర్నలిస్ట్ సత్యనారాయణ వేముల సోషల్ మీడియాలో గుర్తుచేసుకున్నారు.

ఈ భావోద్వేగ కథనంపై స్వయంగా డీజీపీ సీవీ ఆనంద్ స్పందిస్తూ ఆనాటి సవాలుతో కూడిన రోజులను నెమరువేసుకున్నారు.

సీనియర్ జర్నలిస్ట్ సత్యనారాయణ వేముల రాసిన కథనం ప్రకారం.. అది 2003వ సంవత్సరం. మహమ్మద్ గౌస్ మృతి అనంతరం మల్లేపల్లి నుంచి అఘాపుర వైపు అంతిమయాత్ర సాగుతోంది. అప్పటి వెస్ట్ జోన్ డీసీపీ అంజనా సిన్హా బృందంతో పాటు ఆంధ్రభూమి క్రైమ్ రిపోర్టర్గా సత్యనారాయణ వేముల ఆ ఊరేగింపును కవర్ చేస్తున్నారు. అంతలోనే అఘాపుర బ్యాంకు వద్ద ఒక్కసారిగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. రాళ్లు, అరుపులు, మంటలతో పరిస్థితి అల్లకల్లోలంగా మారింది.

అల్లరి మూకల దాడి మధ్య మీడియా ప్రతినిధులు, పోలీసు బృందం చిక్కుకుపోగా, ఎదురుగా పొగ, మంటల మధ్య నుంచి చేతిలో పిస్టల్ పట్టుకుని నాటి సెంట్రల్ జోన్ డీసీపీ సీవీ ఆనంద్ తన బృందంతో రంగంలోకి దిగారు.

ముందుండి నడిచిన అధికారి: సీవీ ఆనంద్ తన సిబ్బందిని ముందు పంపి వెనుక నిలబడలేదు. తానే ముందుండి పిస్టల్తో ఫైరింగ్ చేస్తూ రోడ్డును క్లియర్ చేసుకుంటూ వచ్చారు.

భారీ ప్రమాదం తప్పింది: ఒకవేళ ఆనంద్ రావడం కాస్త ఆలస్యమై ఉంటే డీసీపీ అంజనా సిన్హా బృందంతో పాటు జర్నలిస్టులు తీవ్రంగా గాయపడేవారమని వెల్లడి.

అధికారి అంటే వైర్లెస్ ఆర్డర్లు ఇవ్వడమే కాదు: అవసరమైనప్పుడు సిబ్బంది కంటే ముందు అడుగు వేసి ప్రాణాలకు తెగించేవాడే నిజమైన పోలీస్ అధికారి అని చాటిచెప్పిన ఘటన.

జర్నలిస్ట్ పోస్ట్పై తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ స్పందిస్తూ ఆ జ్ఞాపకాలను పంచుకున్నారు.

“ఈ కథనాన్ని సోషల్ మీడియాలో చూసిన వెంటనే, ఆ రోజు జరిగిన సంఘటన నాకు స్పష్టంగా గుర్తుకొచ్చింది. 100 మందికి పైగా ఆందోళనకారులు నన్ను, నా చిన్న బృందం పైన రాళ్లు రువ్వుతుంటే, అందరినీ రక్షించేందుకు నేను నా పిస్టల్తో కాల్పులు జరిపాను. ఆ తర్వాత కూడా వారిని మల్లేపల్లి చుట్టుపక్కల వీధుల్లో వెంబడించడం ప్రారంభించాను. 2000 నుంచి 2004 మధ్యకాలంలో మేము ఎదుర్కొన్న శాంతిభద్రతల సవాళ్లు, పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి హైదరాబాద్ సిటీ పోలీస్ చేసిన కృషి గుర్తుకొచ్చాయి. ఆ రోజు నేను కాల్పులు జరుపుతున్న దృశ్యాలను ఒక ఫోటోగ్రాఫర్ చిత్రీకరించగా ఆ ఫోటోలు మరుసటి రోజు పత్రికల్లో వచ్చాయి.. ఆ ఫోటోలను ఆర్కైవ్స్లో వెతికి చూస్తాను!”

కాలం మారినా, హోదాలు మారినా 23 ఏళ్ల క్రితం నాటి ఆ సంఘటన, ఒక ప్రజాధికారి యొక్క తెగువ ఇప్పటికీ నిలిచిపోవడం విశేషం. ప్రస్తుతం ఈ సోషల్ మీడియా సంభాషణ నెట్టింట బాగా వైరల్ అవుతోంది.

Share
Share