పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క కొత్త రేషన్ కార్డూ ఇవ్వలేదు: మంత్రి ఉత్తమ్

హైదరాబాద్, ఏపీబీ న్యూస్: తెలంగాణలో గత పదేళ్ల బీఆర్ఎస్ (అప్పటి టీఆర్ఎస్) పాలనలో ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా మంజూరు చేయకుండా పేద, మధ్యతరగతి కుటుంబాలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని రాష్ట్ర నీటిపారుదల, ఆహార మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన విమర్శలు చేశారు. కొత్తగా వివాహాలై కుటుంబాలు ఏర్పడినప్పటికీ, అర్హులైన లక్షలాది మంది దరఖాస్తులు చేసుకున్నప్పటికీ గత ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు.

హైదరాబాద్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆహార భద్రతకు అత్యున్నత ప్రాధాన్యమిచ్చామని స్పష్టం చేశారు.

గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి స్వస్తి పలుకుతూ పౌరసరఫరాల శాఖ ద్వారా అత్యంత పారదర్శకంగా కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసినట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.

కొత్త కార్డుల మంజూరు: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏకంగా 16,32,810 కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసింది. దీని ద్వారా కొత్తగా 61,09,544 మందికి ఆహార భద్రత లభించింది.

మొత్తం లబ్ధిదారులు: పాత, కొత్తవి కలిపి ప్రస్తుతం తెలంగాణలో మొత్తం 1,06,28,092 రేషన్ కార్డులు ఉండగా, వీటి ద్వారా 3,42,57,109 మంది ప్రజలకు ఉచిత బియ్యం అందుతోంది.

ఉచిత సన్నబియ్యం పంపిణీ: దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి వ్యక్తికి నెలకు 6 కిలోల చొప్పున నాణ్యమైన సన్నబియ్యాన్ని ఉచితంగా అందిస్తున్నాం. ఇందుకోసం నెలకు 2.16 లక్షల మెట్రిక్ టన్నుల సన్నబియ్యాన్ని ప్రభుత్వం సరఫరా చేస్తోంది.

తన సొంత నియోజకవర్గమైన హుజూర్నగర్తో పాటు పరిసర ప్రాంతాల్లో లబ్ధిదారులకు ఉచిత రేషన్ కార్డులు, రూ.8.90 కోట్ల విలువైన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల కోసం రెండు రోజుల పాటు మంత్రి పర్యటించనున్నారు.

సెప్టెంబర్ 27 (ఆదివారం): నేరేడుచర్ల, పాలకీడు, గరిడేపల్లి మండలాల లబ్ధిదారులకు రేషన్ కార్డులు పంపిణీ చేస్తారు. ముసిఒడ్డు సింగారం–రోళ్లవారిగూడెం బీటీ రోడ్డు (₹1.80 కోట్లు), మేళ్లచెరువులో నాగార్జునసాగర్ కాలువపై 3 వంతెనలు (₹3 కోట్లు), కందిబండ వద్ద వంతెన (₹2.80 కోట్లు) సహా పలు పంచాయతీ, విలేజ్ ఆర్గనైజేషన్ భవనాలను ప్రారంభిస్తారు. హుజూర్నగర్లో సీఎంఆర్ఎఫ్ (CMRF) చెక్కులను అందజేస్తారు.

సెప్టెంబర్ 28 (సోమవారం): గరిడేపల్లి మండలం కొండాయిగూడెం, రెగ్యులగడ్డ తండాలలో ఎస్హెచ్జీ, పంచాయతీ భవనాలను ప్రారంభించిన అనంతరం మిర్యాలగూడ పట్టణంలో అర్హులకు రేషన్ కార్డులు పంపిణీ చేస్తారు.

పర్యటన ముగింపులో సూర్యాపేటకు చేరుకుని, కేంద్ర ఎన్నికల సంఘం (ECI) మరియు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వ్యవహార శైలికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న నిరసన కార్యక్రమంలో పాల్గొంటానని మంత్రి తెలిపారు. రాజ్యాంగ సంస్థలు అధికార పార్టీలకు అనుకూలంగా ఉండకుండా, ప్రజాస్వామ్యబద్ధంగా, పారదర్శకంగా వ్యవహరించాలని ఆయన డిమాండ్ చేశారు.

Share
Share