- నల్లగొండలో కాంగ్రెస్ ను దెబ్బతీసేందుకు ‘కారు’ వ్యూహాం
- 2014 ఎన్నికల తర్వాత గెలిచిన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను బీఆర్ఎస్ లోకి చేర్చుకోవడంతో కాంగ్రెస్ కు భారీ దెబ్బ
- అదే ఫార్మూలను మళ్లీ అమలు చేసేందుకు తెరవెనక చర్చలు
- నల్లగొండ, భువనగిరి పార్లమెంట్ పరిధిలోని ఇద్దరు ఎమ్మెల్యేలతో
- బీఆర్ఎస్ హైకమాండ్ రహస్య మంతనాలు?
- వచ్చే ఎన్నికల్లో అధికారం లక్ష్యంగా ఇప్పటి నుంచే ఆపరేషన్ ఆకర్ష్
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో మరోసారి బీఆర్ఎస్ ‘ఆపరేషన్ ఆకర్ష్’ చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ ను బలహీనపర్చే లక్ష్యంతో బీఆర్ఎస్ 2014 ఎన్నికల తర్వాత అమలు చేసిన వ్యూహాన్ని మళ్లీ ప్రయోగించేందుకు సిద్ధమవుతోందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ముఖ్యంగా నల్లగొండ, భువనగిరి పార్లమెంట్ పరిధిలోని ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ హైకమాండ్ తెరవెనుక మంతనాలు జరుపుతోందన్న ప్రచారం ఆసక్తిని రేపుతోంది.
2014 ఫార్ములా మళ్లీ?
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జరిగిన 2014 ఎన్నికలు నల్లగొండ జిల్లా రాజకీయాల్లో కీలక మలుపుగా నిలిచాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున గెలిచిన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అనంతరం బీఆర్ఎస్ లో చేరడంతో జిల్లాలో కాంగ్రెస్ బలహీనపడిన పరిస్థితి ఏర్పడింది. అప్పటి రాజకీయ పరిణామాలు ఇప్పుడు మళ్లీ చర్చనీయాంశంగా మారాయి. అదే తరహా వ్యూహాన్ని మరోసారి అమలు చేసేందుకు బీఆర్ఎస్ తెరవెనుక కసరత్తు ప్రారంభించినట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన మిర్యాలగూడ ఎమ్మెల్యే నలమోతు భాస్కర్రావు, కాంగ్రెస్, సీపీఐ పొత్తులో భాగంగా విజయం సాధించిన దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్, అప్పటి నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు గుత్తా సుఖేందర్రెడ్డి, జడ్పీ చైర్మన్ బాలూనాయక్ తదితరులు తరువాత బీఆర్ఎస్లో చేరిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఐదు అసెంబ్లీ స్థానాలు, సీపీఐ ఒక స్థానం గెలుచుకోగా, రెండు పార్లమెంట్ స్థానాల్లో భువనగిరి బీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్లగా నల్లగొండ కాంగ్రెస్ గెలిచింది. అయితే ఎన్నికల అనంతరం కీలక నేతలు పార్టీ మారిపోవడంతో జిల్లాలో కాంగ్రెస్కు భారీ దెబ్బ తగిలింది. ఈ ప్రభావం 2018 ఎన్నికల వరకూ కొనసాగింది. మునుగోడు, నకరేకల్, హుజూర్నగర్ మినహా జిల్లాలోని మిగతా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది.
2014లో పార్టీ మారిన నలమోతు భాస్కర్రావు, రమావత్ రవీంద్రకుమార్లు 2018లో బీఆర్ఎస్ అభ్యర్థులుగా పోటీ చేసి విజయం సాధించారు. గుత్తా సుఖేందర్రెడ్డికి ఎమ్మెల్సీ పదవి లభించింది. దీంతో బీఆర్ఎస్ జిల్లాలో మరింత బలపడగా కాంగ్రెస్ పునరుద్ధరణకు కష్టతర పరిస్థితులు ఎదురయ్యాయి. ఇప్పుడు మళ్లీ అదే తరహా ఫార్మూలాను అమలు చేసేందుకు బీఆర్ఎస్ హైకమాండ్ ప్రయత్నాలు ప్రారంభించినట్టు సమాచారం. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ఇప్పటి నుంచే రాజకీయ సమీకరణాలపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి జిల్లాలో గ్రూపు రాజకీయాల కారణంగా అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలను లక్ష్యంగా చేసుకుని బీఆర్ఎస్ పెద్దలు చర్చలు జరుపుతున్నట్టు ప్రచారం సాగుతోంది.
ప్రభుత్వం పైన వ్యతిరేకతే కారణమా..?
ప్రస్తుత ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని, ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే ఎన్నికల్లో రాజకీయ భవిష్యత్తు ఇబ్బందుల్లో పడొచ్చని భావిస్తున్న కొందరు ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ నాయకత్వం సంప్రదింపులు జరుపుతున్నట్టు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ వ్యవహారాన్ని అత్యంత గోప్యంగా ఉంచడమేగాక, పార్టీలోని పలువురు కీలక నేతలకు కూడా తెలియనివ్వకుండా చర్చలు కొనసాగిస్తున్నట్టు సమాచారం. ఇదే సమయంలో సంబంధిత ఎమ్మెల్యేలు తమ రాజకీయ భవిష్యత్తుపై అంతర్గతంగా సర్వేలు నిర్వహించుకుంటున్నట్టు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వ పని తీరుపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందన్న సంకేతాలు ఆ సర్వేల్లో వెలుగు చూసిన నేపథ్యంలో, భవిష్యత్ రాజకీయ సమీకరణాలపై ఇప్పటి నుంచే అప్రమత్తంగా ఉండాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.
బీఆర్ఎస్లో మార్పులు అనివార్యం..?
ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్లో వచ్చే ఎన్నికల నాటికి కొన్ని మార్పులు, చేర్పులు తప్పవని పార్టీ సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు. మొత్తం నాలుగు నుంచి ఐదు నియోజకవర్గాల్లో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 2024 పార్లమెంట్ ఎన్నికల సమయంలో భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఆశించారనే ప్రచారం అప్పట్లో సాగింది. అంతకుముందు కాంగ్రెస్లో గ్రూపు రాజకీయాలు భరించలేక కుంభం అనిల్కుమార్రెడ్డి బీఆర్ఎస్లో చేరిన విషయం తెలిసిందే. అనంతరం సీఎం రేవంత్రెడ్డి జోక్యంతో ఆయన తిరిగి కాంగ్రెస్లో చేరి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మిర్యాలగూడలో మాజీ ఎమ్మెల్యే నలమోతు భాస్కర్రావు వయోభారంతో క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుని తన కుమారుడు సిద్ధార్థను రాజకీయ రంగ ప్రవేశం చేయించాలని భావిస్తున్నట్టు సమాచారం.
హుజూర్నగర్లో కూడా బీఆర్ఎస్ నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి తిరిగి బీఆర్ఎస్లో చేరేందుకు తనకు సన్నిహితంగా ఉన్న కొందరు మాజీ ఎమ్మెల్యేలతో మంతనాలు జరుపుతున్నప్పటికీ, ఆ ప్రతిపాదన హైకమాండ్ స్థాయిలో ముందుకు సాగలేదని తెలిసింది. జిల్లాలో చోటుచేసుకుంటున్న ఈ రాజకీయ సమీకరణాలన్నింటినీ తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నంలో భాగంగానే ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ నాయకత్వం సంప్రదింపులు జరుపుతున్నట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.