Breaking News: ఢిల్లీలో సైబర్ ముఠా గుట్టురట్టు.. 21 మంది తెలుగు మహిళా టెలికాలర్ల అరెస్ట్..

హైదరాబాద్/ఢిల్లీ, ఏపీబీ న్యూస్: అమాయక ప్రజలను తక్కువ వడ్డీకే రుణాలు ఇప్పిస్తామని నమ్మించి రకరకాల ఛార్జీల పేరిట రూ.కోట్లలో బురిడీ కొట్టిస్తున్న భారీ సైబర్ మోసాల నెట్వర్క్ను తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు ఛేదించారు. దేశ రాజధాని ఢిల్లీలోని శివ మార్కెట్ ప్రాంతం కేంద్రంగా నడుస్తున్న మూడు మోసపూరిత ఫేక్ కాల్ సెంటర్లపై ఏకకాలంలో దాడి చేసిన పోలీసులు, అందులో పనిచేస్తున్న 21 మంది మహిళా టెలికాలర్లతో పాటు ఒక బ్యాంకు ఖాతాదారుడిని అదుపులోకి తీసుకున్నారు.

ఈ ముఠాకు తెలంగాణ వ్యాప్తంగా నమోదైన ఏకంగా 22 సైబర్ క్రైమ్ కేసుల్లో ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

సూత్రధారులు పరారీ: ఉత్తరాదికి చెందిన లలిత్ సింగ్, కులదీప్ సింగ్, అనిల్ అనే ముగ్గురు ప్రధాన నిర్వాహకులు ఈ మూడు నకిలీ కాల్ సెంటర్లను ఏర్పాటు చేశారు. పోలీసులు దాడులు జరిపే సమయానికి వీరిద్దరూ పరారవ్వగా, గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

మోసం: బజాజ్ ఫైనాన్స్ ప్రతినిధులుగా నటించేందుకు వీరికి ముందుగానే ప్రత్యేక స్క్రిప్ట్ అందించేవారు. ఆ స్క్రిప్ట్ ప్రకారం లోన్ మంజూరైందని నమ్మించి.. ప్రాసెసింగ్ ఫీజులు, ఇన్సూరెన్స్ ఛార్జీలు, జీఎస్టీ, వెరిఫికేషన్ రుసుముల పేరిట అమాయకుల నుంచి విడతల వారీగా బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు జమ చేయించుకుని మోసగించేవారు.

ఈ మోసపూరిత కాల్ సెంటర్లలో పనిచేస్తూ అరెస్ట్ అయిన 21 మంది మహిళలు తెలంగాణకు చెందినవారు కావడం గమనార్హం. జగిత్యాల జిల్లా కోరుట్ల, హైదరాబాద్లోని సైదాబాద్, బోరబండ మరియు మహబూబ్నగర్ జిల్లాలకు చెందిన మహిళలను టెలికాలర్లుగా నియమించుకుని, స్థానిక భాషలో మాట్లాడిస్తూ తెలుగు ప్రజలను సులభంగా బురిడీ కొట్టించారు.

అరెస్టయిన నిందితుల నుంచి కీలక డాక్యుమెంట్లు, మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రుణాల పేరిట వచ్చే అనుమానాస్పద ఫోన్ కాల్స్, వాట్సాప్ మెసేజ్లను నమ్మి ముందస్తుగా ఎలాంటి రుసుములు చెల్లించవద్దని, సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేయాలని సైబర్ క్రైమ్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.

Share
Share