Breaking News: ముప్పారంలో సంపూర్ణ మద్యం నిషేధం..

నల్లగొండ/ముప్పారం, ఏపీబీ న్యూస్: గ్రామంలో శాంతిభద్రతలను పరిరక్షించడంతో పాటు కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు నల్లగొండ జిల్లా నిడమానూరు మండలం ముప్పారం గ్రామ పంచాయతీ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామంలో అక్రమంగా సాగుతున్న మద్యం విక్రయాలను, బెల్టు షాపులను అరికట్టేందుకు సెప్టెంబర్ 1 నుంచి మద్యం విక్రయాలను పూర్తిగా నిషేధిస్తూ గ్రామపంచాయతీ పాలకవర్గం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది.

ఈ సంచలన నిర్ణయానికి సంబంధించిన వివరాలను గ్రామ సర్పంచ్ అల్లంపల్లి రోజా కృష్ణ మీడియాకు వెల్లడించారు.

సెప్టెంబర్ 1 నుంచి సంపూర్ణ నిషేధం: ముప్పారం గ్రామ పంచాయతీ పరిధిలో ఎలాంటి మద్యం అమ్మకాలు, బెల్టు షాపుల నిర్వహణ సాగడానికి వీల్లేదని తీర్మానించారు.

రూ.50 వేల జరిమానా & చట్టపరమైన చర్యలు: పంచాయతీ నిబంధనలను ఉల్లంఘించి ఎవరైనా అక్రమంగా మద్యం విక్రయిస్తే వారిపై రూ.50,000 జరిమానా విధించడంతో పాటు, పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ద్వారా చట్టపరమైన కేసులు నమోదు చేయిస్తామని హెచ్చరించారు.

గ్రామంలో రహస్యంగా మద్యం విక్రయించే వారిని గుర్తించి గ్రామ పంచాయతీకి లేదా అధికారులకు సమాచారం అందించిన వారికి ప్రత్యేక బహుమతి అందజేస్తామని ప్రకటించారు.

గ్రామ అభివృద్ధి, ప్రజారోగ్యమే ధ్యేయంగా తీసుకున్న ఈ నిర్ణయానికి గ్రామస్థులందరూ సహకరించాలని పాలకవర్గం కోరింది. ఈ సమావేశంలో ఉపసర్పంచ్ గణపూరం కొండల్, వార్డు సభ్యులు మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

Share
Share