- కేఆర్ఎంబీకి ఏపీ ప్రభుత్వం లేఖ..
- అక్టోబర్ 1న జరగనున్న KRMB భేటీ అజెండాలో తెలంగాణ ఇరిగేషన్ ప్రాజెక్టులు..
- కృష్ణా నీటి పంపిణీపై సీఎం చంద్రబాబు సర్కార్ పెట్టిన కొర్రీలు..
హైదరాబాద్, ఏపీబీ న్యూస్: తెలంగాణ రాష్ట్ర నీటి అవసరాలను తీర్చే ప్రాజెక్టులను లక్ష్యంగా చేసుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (KRMB) కు లేఖ రాయడం తీవ్ర దుమారం రేపుతోంది. తెలంగాణ ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని తక్షణమే అడ్డుకోవాలని, రాబోయే అక్టోబర్ 1వ తేదీన హైదరాబాద్లో జరగనున్న కేఆర్ఎంబీ ముఖ్య సమావేశం అజెండాలో ఈ అంశాలను చేర్చాలని ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఏపీ ప్రభుత్వం కృష్ణా జలాల్లో తెలంగాణకు రావలసిన వాటాలను అడ్డుకునేందుకు కుట్ర పన్నుతోందని తెలంగాణ ఉద్యమ సమూహాలు, ప్రజాప్రతినిధులు ఆరోపిస్తున్నారు.
నిలిపివేయాలని లేఖలో పేర్కొన్న ప్రధాన ప్రాజెక్టులు:
ఏపీ ప్రభుత్వం తన లేఖ ద్వారా తెలంగాణలోని పలు కీలక సాగునీటి మరియు ఎత్తిపోతల పథకాలను నిలిపివేయాలని డిమాండ్ చేసింది.
ఏపీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసిన తెలంగాణ ప్రాజెక్టులు:
పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు: ఈ బృహత్తర ఎత్తిపోతల పథకం నిర్మాణాన్ని తక్షణమే నిలిపివేయాలి.
ఎత్తిపోతల పథకాలు: కల్వకుర్తి ఎత్తిపోతల, అచ్చంపేట ఎత్తిపోతల, మక్తల్–నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకాలను అడ్డుకోవాలి.
రిజర్వాయర్ల సామర్థ్యం: జవహర్ నెట్టెంపాడు పథకంలోని రేలంపాడు రిజర్వాయర్ సామర్థ్యం తగ్గించడం, గూడెందొడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ సామర్థ్యం పెంచడాన్ని అడ్డుకోవాలి.
ఇతర ప్రాజెక్టులు: పులిచింతల బ్యాక్వాటర్పై నిర్మిస్తున్న రాజీవ్ గాంధీ ఎత్తిపోతల పథకం (బుద్ధమాధవరం), జాన్పహాడ్, బెట్టెతాండా, నక్కగూడెం మరియు ముక్త్యాల పథకాలను అపాలని లేఖలో పేర్కొన్నారు.
512 : 299 టీఎంసీల పాత నిష్పత్తిలోనే నీటి పంపిణీ!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన 811 టీఎంసీల కృష్ణా నదీ జలాల్లో పాత తాత్కాలిక నిష్పత్తి ప్రకారమే ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు పంచుకునేలా ఆదేశాలు జారీ చేయాలని ఏపీ ప్రభుత్వం కేఆర్ఎంబీ బోర్డును కోరింది.
అనుమతులు లేని ప్రాజెక్టుల ద్వారా తెలంగాణ అదనంగా కృష్ణా నీటిని మళ్లిస్తోందని, తగిన అనుమతులు వచ్చేవరకు ఈ పనులను నిలిపివేయాలని లేఖలో కోరారు. అక్టోబర్ 1న జరగబోయే కేఆర్ఎంబీ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం ఏపీ లేఖను ఏవిధంగా తిప్పికొడుతుందోనని ఉత్కంఠ నెలకొంది.