APB News Exclusive: సర్వోత్తమ వర్సెస్ దామన్న టీమ్!

సూర్యాపేట ప్రతినిధి, ఏపీబీ న్యూస్: సూర్యాపేట జిల్లా కాంగ్రెస్లో వర్గ విభేదాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్రెడ్డి వర్గానికి, ఆయన కుమారుడు సర్వోత్తమ రెడ్డి వర్గానికి మధ్య దూరం పెరుగుతున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు నియోజకవర్గంలోని ఇతర వర్గాలతో సాగిన ఆధిపత్య పోరు.. తాజాగా దామోదర్రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉన్న నేతలతోనూ సర్వోత్తమ రెడ్డికి విభేదాలు తలెత్తిన నేపథ్యంలో పార్టీలో చర్చకు దారితీస్తోంది.

దామోదర్రెడ్డి కుటుంబంతో సన్నిహితంగా మెలిగిన మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, పోతూ భాస్కర్ కొంతకాలంగా సర్వోత్తమ రెడ్డికి దూరంగా ఉంటున్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో ఇప్పటి వరకు దామన్న వెంట ఉన్న సీనియర్ నేతలు ఒకవైపు.. సర్వోత్తమరెడ్డితో కలిసి పనిచేస్తున్న యువత, కొత్త నాయకత్వం మరోవైపు అన్నట్లుగా పరిస్థితులు మారుతున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

సర్వోత్తమరెడ్డి తన రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తనకంటూ ప్రత్యేకంగా కేడర్ను, రాజకీయ ఇమేజ్ను నిర్మించుకునే ప్రయత్నం చేస్తున్నారనే ప్రచారం కూడా సాగుతోంది. దామోదర్రెడ్డితో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న సీనియర్లపై ఆధారపడకుండా కొత్త తరాన్ని తనవైపు తీసుకురావాలనే ఆలోచనలో ఆయన ఉన్నట్లు అనుచర వర్గాలు పేర్కొంటున్నాయి.

దామన్న వర్గంపై వస్తున్న విమర్శలు తన రాజకీయ ఎదుగుదలకు ప్రతికూలంగా మారుతున్నాయని సర్వోత్తమరెడ్డి భావిస్తున్నట్లు కాంగ్రెస్లోని కొన్ని వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా మున్సిపల్ రాజకీయాలతో పాటు నియోజకవర్గ పార్టీ వ్యవహారాల్లో సీనియర్ల జోక్యం అధికంగా ఉందనే అభిప్రాయం సర్వోత్తమ వర్గంలో ఉన్నట్లు తెలుస్తోంది.

పాత తరం నేతలు పూర్తిగా తమ వెంట ఉండటంతో కొత్త నాయకత్వం, యువత తనతో కలిసేందుకు కొంత వెనుకంజ వేస్తున్నారనే భావన కూడా సర్వోత్తమరెడ్డి వర్గంలో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే దామన్నకు అత్యంత సన్నిహితంగా ఉన్న కొందరు నేతలను దూరంగా ఉంచి తనకంటూ ప్రత్యేక రాజకీయ గుర్తింపు తెచ్చుకునే దిశగా అడుగులు వేస్తున్నారనే చర్చ కొనసాగుతోంది.

ఇరువర్గాల మధ్య దూరం పెరుగుతున్న విషయం అధిష్ఠానం దృష్టికి వెళ్లినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి జోక్యం చేసుకుని ఇరువర్గాల నేతల మధ్య సర్దుబాటుకు ప్రయత్నించినట్లు సమాచారం. అయితే ఈ ప్రయత్నాలు ఎంతవరకు ఫలించాయనే దానిపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సర్వోత్తమరెడ్డి మాత్రం కొన్ని విషయాల్లో వెనక్కి తగ్గేందుకు సుముఖంగా లేరనే ప్రచారం కూడా ఉంది.

ఇటీవల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సర్వోత్తమరెడ్డి పేరు తెరపైకి వచ్చిన నేపథ్యంలో ఈ పరిణామాలకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. ఎన్నికల సమయంలో నియోజకవర్గంలోని పార్టీ కేడర్ సమన్వయం కీలకంగా మారే అవకాశం ఉండటంతో దామన్న సన్నిహితుల సహకారం కూడా అవసరమేనని కాంగ్రెస్లోని కొందరు సీనియర్లు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం.

మరోవైపు, తనకంటూ ప్రత్యేక రాజకీయ పునాది ఏర్పాటు చేసుకోవాలనే సర్వోత్తమరెడ్డి ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయన్నది ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారింది. తండ్రి రాజకీయ అనుభవం, సీనియర్ల బలం ఒకవైపు.. కొత్త తరాన్ని తనవైపు తిప్పుకునే ప్రయత్నం మరోవైపు సాగుతున్న నేపథ్యంలో పేట కాంగ్రెస్లో రాబోయే రోజుల్లో పరిణామాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది.

సర్వోత్తమ రెడ్డి నీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించిన ఆయనకు దమన్న వర్గం విషెస్ చెప్పక పోవడం చర్చనీయాంశంగా మారింది. దమన్న చనిపోయాక ఆయన కుటుంబానికి పార్టీ లో ప్రభుత్వం లో సముచిత స్థానం కల్పిస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చిన నేపథ్యం లో తొలిసారిగా ప్రజా క్షేత్రంలో అడుగుపెడుతున్న సర్వోత్తమకు సొంత ఇంటి నుంచే ప్రతికూల పరిస్థితి ఎదుర్కోవడం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందని పార్టీ క్యాడర్ ఆందోళన చెందుతోంది.

Share
Share