- ఉమ్మడి నల్లగొండపై సీఎం రేవంత్ ఫోకస్..
- రెండేళ్లుగా సాగిన విమర్శలకు తొలిసారి సొంత పార్టీ నుంచే కౌంటర్
- మైక్ దొరికితే మితిమీరొద్దంటూ ఎమ్మెల్యేల వార్నింగ్..
- పార్టీ, ప్రభుత్వాన్ని బలహీనపరిచేలా వ్యవహరిస్తే కఠిన చర్యలంటూ స్పష్టీకరణ
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్లో అంతర్గత రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇప్పటివరకు ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై పరోక్షంగా, ప్రత్యక్షంగా విమర్శలు చేస్తున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి తొలిసారి సొంత పార్టీ నుంచే గట్టి ఎదురుదాడి ఎదురైంది. రెండేళ్లుగా రాజగోపాల్రెడ్డి ప్రభుత్వ పనితీరు, నిధుల కేటాయింపు, మంత్రుల వ్యవహారశైలిపై ప్రత్యక్షంగా విమర్శలు చేస్తున్నా.. ఉమ్మడి నల్లగొండకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇప్పటివరకు పెద్దగా స్పందించలేదు. తాజాగా ప్రభుత్వ విప్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒకే వేదికపై ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని బలహీనపరిచేలా సొంత పార్టీ నేతలు వ్యవహరించడాన్ని సహించేది లేదని ప్రకటించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
రెండేళ్లుగా రాజగోపాల్ ధిక్కార స్వరం..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజగోపాల్రెడ్డి ప్రభుత్వం తీరుపై పలు సందర్భాల్లో అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాకు నిధుల కేటాయింపు విషయంలో ఆయన పలుమార్లు ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గంతో పాటు జిల్లాకు అభివృద్ధి పనులకు తగినన్ని నిధులు రావడం లేదని, ముఖ్యమంత్రి సొంత జిల్లా, మంత్రుల నియోజకవర్గాలకే నిధులు వెళ్తున్నాయనే విమర్శలు చేశారు. మంత్రి స్థాయి నేతలపైనా రాజగోపాల్ బహిరంగంగానే విమర్శలు చేయడం కాంగ్రెస్లో అప్పుడప్పుడూ చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ వేదికగానూ ప్రభుత్వం పనులు తప్ప నిధులు ఇవ్వడం లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే ఇప్పటివరకు ఈ విమర్శలకు ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల నుంచి పెద్దగా బహిరంగ కౌంటర్ వినిపించలేదు. దీంతో రాజగోపాల్రెడ్డి విమర్శలు ఆయన వ్యక్తిగత అభిప్రాయాలుగానే కొనసాగాయి.
మారిన స్వరం.. పెరిగిన దూకుడు
ఇటీవలి కాలంలో రాజగోపాల్రెడ్డి తన విమర్శల స్వరాన్ని రెట్టింపు చేశారు. తెలంగాణలో తమిళనాడు తరహా రాజకీయాలు రావాల్సిన అవసరం ఉందంటూ చేసిన వ్యాఖ్యలు కూడా రాజకీయంగా చర్చకు దారితీశాయి. ప్రభుత్వంలో అవినీతి జరుగుతోందంటూ ఆరోపణలు చేయడమే కాకుండా.. తాను గెలిపించిన ఒక ఎమ్మెల్యే కులాన్ని అడ్డుపెట్టుకుని అవినీతికి పాల్పడుతున్నారని ఆయన చేసిన వ్యాఖ్యలు సొంత పార్టీ నేతల్లోనూ చర్చకు కారణమయ్యాయి. ‘ఇన్నాళ్లూ సహనంతో ఉన్నాం.. మా సహనాన్ని, ఓపికను చేతగానితనంగా భావించవద్దు’ అంటూ ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకుని కొందరు అభివృద్ధి పేరుతో భారీగా దోచుకుంటున్నారని, పేదల ఇందిరమ్మ ఇళ్లకు మాత్రం అనేక నిబంధనలు పెడుతున్నారని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డిని ఉద్దేశించి చేసిన విమర్శలు కూడా ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారాయి.
టీపీసీసీ నుంచి తొలి వార్నింగ్
రాజగోపాల్రెడ్డి వరుస వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్ గౌడ్ తీవ్రంగా స్పందించడం ఈ పరిణామాల్లో కీలక మలుపుగా మారింది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తే ఎంతటి వారినైనా సహించేది లేదనే సంకేతం ఇచ్చారు. అదే సమయంలో పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉందని, అభిప్రాయాలు చెప్పేందుకు పార్టీ వేదికలు ఉన్నాయని.. అయితే పార్టీ వేదికలను దాటి బహిరంగంగా ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని బలహీనపరిచేలా మాట్లాడటం సరికాదనే అభిప్రాయం కాంగ్రెస్లో బలపడింది.
‘మైక్ దొరికితే మితిమీరొద్దు’.. వేముల వీరేశం
ఈ పరిణామాల మధ్య నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం చేసిన వ్యాఖ్యలు రాజగోపాల్రెడ్డిపై నేరుగా ఎదురుదాడి చేసినట్లుగానే ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉన్నప్పుడు తమ అభిప్రాయాలను పార్టీ వేదికలపై చర్చించుకునే అవకాశం ఉందని ఆయన అన్నారు. అయితే ఆ స్వేచ్ఛ మితిమీరకూడదని, మైక్ దొరికినప్పుడల్లా హద్దులు దాటి మాట్లాడే వైఖరి పార్టీ నిబంధనలకు వ్యతిరేకమని స్పష్టం చేశారు. రాజకీయ కుటుంబానికి చెందినవారు రాజకీయ విలువలు, రాజకీయ పద్ధతులు పాటించాలని.. గౌరవాన్ని కాపాడుకోవాలని సూచించారు.
‘ఎవరైనా సరే.. కఠిన చర్యలు’.. బాలూనాయక్
సీనియర్ ఎమ్మెల్యే బాలూనాయక్ కూడా ఇదే అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రిని బలహీనపరిచేలా ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న కుట్రలను సొంత పార్టీ నేతలు అమలు చేయడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వాన్ని బలహీనపరచాలని ప్రయత్నించే వారు ఎవరైనా సరే కఠిన చర్యలు తీసుకోవాలనే అభిప్రాయానికి వచ్చామని చెప్పారు. ఈ విషయంలో చిన్నారెడ్డి, రాజగోపాల్రెడ్డి, బాలూనాయక్ ఎవరైనా సరే పార్టీ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నట్లు భావించే ఎవరిపైనైనా చర్యలు తీసుకోవాలన్నది ఎమ్మెల్యేల తాజా వైఖరిగా కనిపిస్తోంది. మరో విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య సైతం ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని బలహీనపరిచే ఉద్దేశంతో కొందరు సొంత పార్టీ నేతలే వ్యవహరిస్తున్నారని.. అలాంటి వారిపై పార్టీ కఠిన నిర్ణయాలు తీసుకోవాలని అధిష్ఠానాన్ని కోరనున్నట్లు తెలిపారు.
టార్గెట్ రాజగోపాల్..
తాజాగా ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యల్లో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. వారు నేరుగా రాజగోపాల్రెడ్డి పేరును ప్రస్తావించకపోయినా, వివిధ జిల్లాల్లో కొంతమంది ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని, పార్టీనికి దెబ్బతీయాలని కుట్ర పన్నుతున్నారని ఘాటైన వ్యాఖ్యలు చేయడం వెనక జిల్లా మంత్రుల సహకారం కూడా ఉందని తెలుస్తోంది. గత కొంతకాలంగా ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని బహిరంగంగా విమర్శిస్తున్న నేతల వ్యవహారశైలినే ప్రధానంగా టార్గెట్ చేశారు. ‘ఎవరైనా సరే’, ‘ఎంతటి వారినైనా’, ‘పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తే’ అనే పదాలతో ఎమ్మెల్యేలు చేసిన హెచ్చరికలు వ్యక్తిగతంగా రాజగోపాల్రెడ్డిని లక్ష్యంగా చేసుకున్నారా? లేక ఇటీవల పరిణామాలను కలిపి చూస్తే రాజగోపాల్రెడ్డిపై రాజకీయంగా ఎదురుదాడి మొదలైన సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
ఉమ్మడి నల్లగొండపై రేవంత్ ఫోకస్?
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్కు బలమైన రాజకీయ ప్రాతినిధ్యం ఉన్నప్పటికీ.. పార్టీలోని నేతల మధ్య సమన్వయం, ఆధిపత్య పోరు ఎప్పటికప్పుడు చర్చకు వస్తూనే ఉంది. ఒకవైపు మంత్రులు, మరోవైపు ఎమ్మెల్యేలు.. మరోవైపు రాజగోపాల్రెడ్డి వంటి సీనియర్ నేతల మధ్య భిన్నాభిప్రాయాలు బహిరంగమవుతున్నాయి. ఈ నేపథ్యంలో రేవంత్రెడ్డి ఉమ్మడి నల్లగొండ రాజకీయాలపై మరింత దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు.. ప్రభుత్వంపై సొంత పార్టీ నుంచే వస్తున్న విమర్శలకు చెక్ పెట్టడం, ఎమ్మెల్యేలు-మంత్రుల మధ్య సమన్వయం పెంచడం కూడా అధిష్ఠానానికి కీలకంగా మారింది.
ఇక ‘వన్‌వే’ కాదు.. కౌంటర్ మొదలు
ఇప్పటివరకు రాజగోపాల్రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు చేస్తే.. జిల్లా కాంగ్రెస్ నేతలు ఎక్కువగా మౌనం పాటించారు. దీంతో ఆయన వ్యాఖ్యలకు ప్రత్యక్ష కౌంటర్ లేకుండా పోయేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. వేముల వీరేశం ఘాటు వ్యాఖ్యలు.. బాలూనాయక్ కఠిన చర్యల డిమాండ్.. బీర్ల అయిలయ్య హెచ్చరికలు.. టీపీసీసీ అధ్యక్షుడి క్రమశిక్షణ వార్నింగ్.. ఇవన్నీ కలిపి చూస్తే రాజగోపాల్రెడ్డి విమర్శలకు కాంగ్రెస్లో తొలిసారి రాజకీయ ఎదురుదాడి మొదలైనట్లుగా కనిపిస్తోంది. ఇకపై రాజగోపాల్రెడ్డి చేసే ప్రతి విమర్శకు సొంత పార్టీ నుంచే కౌంటర్ వచ్చే అవకాశముంది.
రేవంత్‌కు ‘రాజగోపాల్’ సవాల్.. పార్టీకి క్రమశిక్షణ పరీక్ష
రాజగోపాల్రెడ్డి వ్యవహారం ఇప్పుడు కేవలం ఒక ఎమ్మెల్యే చేస్తున్న విమర్శల అంశంగా మిగలలేదు. ప్రభుత్వ పనితీరు, నిధుల కేటాయింపు, మంత్రుల వ్యవహారశైలి, పార్టీ క్రమశిక్షణ, ముఖ్యమంత్రి నాయకత్వం వంటి అనేక అంశాలు ఇందులో ముడిపడ్డాయి. రాజగోపాల్రెడ్డి తన విమర్శలను కొనసాగిస్తారా? కాంగ్రెస్ అధిష్ఠానం క్రమశిక్షణ చర్యల దిశగా వెళ్తుందా? ఉమ్మడి నల్లగొండ ఎమ్మెల్యేలు ఇకపై ఆయనకు రాజకీయంగా ఎంత వరకు కౌంటర్ ఇస్తారు? ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ వ్యవహారాన్ని ఎలా చక్కదిద్దుతారు? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇన్నాళ్లూ రాజగోపాల్ వర్సెస్ ప్రభుత్వం అన్నట్లుగా సాగిన రాజకీయం.. ఇప్పుడు రాజగోపాల్ వర్సెస్ సొంత పార్టీ నేతలు అనే కొత్త మలుపు తీసుకున్నట్టుగా కనిపిస్తోంది.