- పదేళ్ల తర్వాత ఎన్నికల సందడి..
- ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2,048 మంది ఓటర్లు
- ఒకప్పుడు 3 వేలకుపైగా ఉన్న కార్మికులు
- ఎలక్ట్రిక్ బస్సులు, ఔట్సోర్సింగ్తో సంఘాల ప్రభావానికి గండి
- ఆరు సంఘాలు రెండు ఐక్యకూటములుగా పోరు..
- అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మద్దతుతో హోరాహోరీ ప్రచారం
నల్గొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: పదేళ్ల విరామం తర్వాత ఆర్టీసీలో కార్మిక సంఘాల ఎన్నికల సందడి మొదలైంది. ఒకప్పుడు కార్మికుల హక్కులు, సమస్యలపై గట్టిగా గొంతెత్తిన యూనియన్లు.. కాలక్రమంలో ప్రైవేటీకరణ, ఔట్సోర్సింగ్, ఎలక్ట్రిక్ బస్సుల రాకతో తమ బలాన్ని కోల్పోయాయి. గతంలో మూడు వేలకుపైగా ఉన్న ఓటర్ల సంఖ్య ప్రస్తుతం ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఏడు డిపోలు, ఆర్ఎం కార్యాలయం పరిధిలో కలిపి 2,048కు పడిపోయింది. దీంతో ఈసారి జరుగుతున్న ఎన్నికలు యూనియన్ల బలాబలాలకు మాత్రమే కాకుండా.. ఆర్టీసీలో మారుతున్న కార్మిక స్వరూపానికి కూడా అద్దం పడుతున్నాయి. ఈ నెల 9న జరగనున్న ఎన్నికలకు మూడు రోజులే గడువు ఉండటంతో డిపోల పరిధిలో ప్రచారం మరింత వేడెక్కింది. ఆరు ప్రధాన కార్మిక సంఘాలు విడివిడిగా పోటీ చేస్తే ఓట్లు చీలిపోయే అవకాశం ఉందని భావించి రెండు ఐక్యకూటములుగా బరిలోకి దిగాయి. దీంతో ప్రధాన పోటీ ఈ రెండు కూటముల మధ్యనే నెలకొంది.
తగ్గిన కార్మిక బలం.. పెరిగిన ప్రైవేటు ప్రభావం
గత ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుతం యూనియన్ల ఓటర్ల సంఖ్య గణనీయంగా తగ్గింది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణలో ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు విధానం పెరగడం రెగ్యులర్ కార్మికుల సంఖ్యపై ప్రభావం చూపింది. ఉమ్మడి జిల్లాలో కార్మిక సంఘాలకు గట్టి పట్టున్న నల్లగొండ, మిర్యాలగూడ, సూర్యాపేట డిపోల్లోనూ ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. డీలక్స్ బస్సుల్లో ఎక్కువగా ఔట్సోర్సింగ్ సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా.. ఎక్స్ప్రెస్ బస్సుల్లో డ్రైవర్లు ప్రైవేటు సిబ్బంది, కండక్టర్లు రెగ్యులర్ ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. దీంతో గతంలో యూనియన్లకు వెన్నుదన్నుగా నిలిచిన రెగ్యులర్ కార్మికుల సంఖ్య తగ్గి.. సంఘాల ప్రభావం కూడా బలహీనపడినట్లు కార్మిక వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఆరు సంఘాలు.. రెండు కూటములు
యూనియన్ల బలం తగ్గిన నేపథ్యంలో ఓట్లు చీలిపోకుండా ఆరు సంఘాలు రెండు కూటములుగా ఏర్పడ్డాయి. అధికార కాంగ్రెస్కు మద్దతుగా ఉన్న కూటమిలో టీడబ్ల్యూయూ, ఎస్డబ్ల్యూఎఫ్, ఐఎన్టీయూసీ కలిసి పోటీ చేస్తున్నాయి. మరోవైపు ఈయూ, టీఎంయూ, ఎన్ఎంయూ కూటమిగా ఏర్పడి బరిలో నిలిచాయి. వీటికి సీపీఐ, బీఆర్ఎస్ మద్దతు ప్రకటించాయి. ఏడు డిపోల పరిధిలో మొత్తం తొమ్మిది కార్మిక సంఘాలు పోటీలో ఉన్నప్పటికీ.. ప్రధాన పోటీ మాత్రం ఈ రెండు ఐక్యకూటముల మధ్యనే కొనసాగుతోంది.
ఉధృతంగా ప్రచారం.. రంగంలోకి రాజకీయ నేతలు
కార్మిక సంఘాల ఎన్నికల ప్రచారానికి రాజకీయ నేతలు రంగంలోకి దిగారు. రెండు కూటములకు ఆయా రాజకీయ పార్టీలు బహిరంగంగా మద్దతు ప్రకటించడంతో డిపోల పరిధిలో ప్రచారం ఊపందుకుంది. కార్మికులతో సమావేశాలు, మహాసభలు నిర్వహిస్తూ నాయకులు తమ కూటమికి మద్దతు కూడగడుతున్నారు. కాంగ్రెస్ మద్దతు కూటమి తరఫున మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు ప్రచారంలో పాల్గొంటున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ రీజియన్ స్థాయి మహాసభలకు హాజరవుతుండగా.. పీసీసీ నియమించిన ఎన్నికల ఇన్చార్జిలు బొంతు రామ్మోహన్, ఎమ్మెల్సీ శంకర్నాయక్ తదితరులు ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు ప్రతిపక్ష కూటమికి మద్దతుగా సీపీఐ ఎమ్మెల్సీ నెల్లి కంటి సత్యం, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులు ప్రచారంలో పాల్గొంటున్నారు.
‘విలీనం’.. ‘ఉద్యోగ భద్రత’ చుట్టూ ప్రచారం
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని అశ్వత్థామరెడ్డి కూటమి ప్రచారం చేస్తోంది. కార్మికుల సమస్యలకు ప్రభుత్వమే శాశ్వత పరిష్కారం చూపగలదని వివరిస్తోంది. మరోవైపు ఎంప్లాయీస్ యూనియన్ కూటమి డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్లకు సంపూర్ణ ఉద్యోగ భద్రత కల్పిస్తామని ప్రచారం చేస్తోంది. 2025 వేతన సవరణను మాస్టర్ స్కేల్లో చేర్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తోంది. దీంతో ఈ ఎన్నికల్లో కార్మికుల ప్రధాన చర్చాంశాలుగా ఉద్యోగ భద్రత, వేతన సవరణ, ఆర్టీసీ భవిష్యత్, ఔట్సోర్సింగ్ విధానం నిలుస్తున్నాయి.
ఎవరి బలం ఎంత?
పదేళ్ల తర్వాత ఎన్నికలు జరుగుతుండటంతో రెండు కూటములు రీజియన్లో పట్టు సాధించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఓటర్లకు ఫోన్లు చేయడం, డిపోల వారీగా సమావేశాలు నిర్వహించడం, స్థానిక స్థాయిలో మద్దతు కూడగట్టడం వంటి కార్యక్రమాలతో ప్రచారం హోరెత్తుతోంది. అధికార పక్ష కూటమి మిర్యాలగూడ, సూర్యాపేట, కోదాడ, యాదగిరిగుట్ట, దేవరకొండ డిపోల్లో తమకు బలమైన మద్దతు ఉందని చెబుతోంది. ప్రతిపక్ష కూటమి మాత్రం నల్లగొండ, కోదాడ, మిర్యాలగూడ, నార్కట్పల్లి డిపోల్లో తమ బలం ఎక్కువగా ఉందని ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే ఓటర్ల సంఖ్య గతంతో పోలిస్తే భారీగా తగ్గడం, కొత్తగా ఏర్పడిన కూటముల మధ్య ఓట్ల సమీకరణం ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. డిపోల వారీగా ఉన్న బలాబలాలు చివరి మూడు రోజుల్లో ఎంతవరకు మారతాయన్నదే కీలకం. అంతిమంగా ఎవరి బలం ఎంత.. ఎవరి వెంటే కార్మికులు నిలిచారన్నది ఈ నెల 9న జరిగే ఎన్నికల ఫలితాలతో తేలనుంది.
డిపోల వారీగా ఓటర్ల సంఖ్య
| క్రమ సంఖ్య | డిపో పేరు | ఓటర్ల సంఖ్య |
| 1 | నల్లగొండ | 321 |
| 2 | సూర్యాపేట | 313 |
| 3 | మిర్యాలగూడ | 301 |
| 4 | నార్కట్పల్లి | 121 |
| 5 | కోదాడ | 261 |
| 6 | దేవరకొండ | 365 |
| 7 | యాదగిరిగుట్ట | 339 |
| 8 | ఆర్ఎం కార్యాలయం | 27 |
| మొత్తం ఓటర్లు: | 2,048 |