- బీఆర్ఎస్, బీజేపీలు కరువుపై రాక్షసానందం పొందుతున్నాయి.. త్వ
- రలోనే తెలంగాణలో 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తాం..
నల్గొండ, ఏపీబీ న్యూస్: రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం భవిష్యత్తులో ఎంతటి కరువు వచ్చినా ప్రజలు, రైతాంగానికి 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యంగా పనిచేస్తోందని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. శుక్రవారం నల్గొండ పర్యటనలో భాగంగా ఇందిరాభవన్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్, బీజేపీ నాయకుల తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
ఎల్ నినో ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా కరువు పరిస్థితులు ఏర్పడటంతో రాష్ట్రంలో బోరు బావుల కింద వ్యవసాయం పెరిగి విద్యుత్ వినియోగం దాదాపు 20,000 మెగావాట్లకు చేరిందని వివరించారు. కరువు వచ్చి ప్రజలు అల్లాడుతుంటే ప్రతిపక్షాలు రాక్షసానందం పొందుతున్నాయని మండిపడ్డారు.
కేటీఆర్‌కు మంత్రి కోమటిరెడ్డి సూటి ప్రశ్న!
మాజీ మంత్రి కేటీఆర్ను లక్ష్యంగా చేసుకుని కోమటిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. “అమెరికాలో ఐదేళ్ళు ఉద్యోగం చేస్తే 3 ఫైవ్స్టార్ హోటళ్లు, 100 ఎకరాల్లో ఫాంహౌస్లు ఎలా వస్తాయి కేటీఆర్?” అని ప్రశ్నించారు. ఇప్పటికైనా స్టార్ హోటల్, ఫాం హౌస్ కల్చర్ను పక్కన పెట్టి, అక్రమ ఆస్తులను అమ్మి ప్రజలకు సేవ చేస్తూ సామాన్యులుగా బయటకు రావాలని హితవు పలికారు.
మంత్రి కోమటిరెడ్డి కామెంట్స్ – ప్రధాన ముఖ్యాంశాలు:
విద్యుత్ లక్ష్యం: నిలిచిపోయిన యాదాద్రి పవర్ ప్లాంట్ను అందుబాటులోకి తెచ్చామని, త్వరలోనే రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ అందిస్తామని స్పష్టం చేశారు.
నల్గొండపై వివక్ష: ప్రత్యేక తెలంగాణ కోసం తాను రాజీనామా చేసినందుకు గతంలో కిరణ్ కుమార్ రెడ్డి, కేసీఆర్లు నల్గొండ నియోజకవర్గానికి నిధులు ఇవ్వకుండా కక్ష సాధించారని ఆరోపించారు.
5,000 ఇందిరమ్మ ఇండ్లు: నల్గొండ నియోజకవర్గానికి అదనంగా 5,000 ఇందిరమ్మ ఇళ్లను కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరినట్లు తెలిపారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం: రాబోయే రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలతో పాటు, ఖైరతాబాద్ ఉపఎన్నిక వచ్చినా కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
బిఆర్ఎస్ కల్లిబొల్లి మాటలను ప్రజలు నమ్మరు!
గత ప్రభుత్వ హయాంలో 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని చెప్పి ప్రజలను మోసం చేశారని, తానే స్వయంగా సబ్ స్టేషన్కు వెళ్లి లాగ్బుక్ పరిశీలించి ఆ అబద్ధాలను బట్టబయలు చేశానని గుర్తుచేశారు. నైనీ కోల్ మైన్ స్కామ్పై ప్రధాని మోదీకి విచారణ జరిపించాలని కోరినట్లు చెప్పారు. బిఆర్ఎస్, బీజేపీ ఎన్ని కల్లిబొల్లి మాటలు చెప్పినా ప్రజలు నమ్మరని, రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు.