సాగర్‌ ఎడమ కాలువ రైతుల నోట్లో మట్టి కొట్టి.. నీళ్లను ఆంధ్రకు తరలిస్తున్నారు.. మంత్రులపై జగదీశ్‌ ఫైర్‌

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నాగార్జునసాగర్ నీటి విషయంలో ఉమ్మడి నల్గొండ జిల్లా రైతాంగానికి అన్యాయం జరుగుతోందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి ఆరోపించారు. సాగర్, శ్రీశైలం జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్ వైపు నీటి తరలింపు జరుగుతున్నా జిల్లా మంత్రులు ఉత్తమ్కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పట్టించుకోవడం లేదని తీవ్రస్థాయిలో విమర్శించారు. శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు రైతుల ప్రయోజనాలను పక్కనపెట్టి పదవులను కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నారని జగదీశ్రెడ్డి విమర్శించారు. శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా నీటి తరలింపు జరుగుతున్నా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్కు నీటి తరలింపుపై తాను ఆధారాలతో సహా వివరాలు వెల్లడిస్తున్నా ప్రభుత్వంలో చలనం లేదన్నారు.

నాగార్జునసాగర్లో ప్రస్తుతం 532 అడుగుల నీటిమట్టం ఉందని, సాగు నీటిని విడుదల చేసే అవకాశం ఉన్నప్పటికీ ఎడమ కాల్వకు నీరు ఇవ్వడం లేదని జగదీశ్రెడ్డి ఆరోపించారు. సుమారు 30 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని, దాంతో సాగర్ ఎడమ కాల్వతోపాటు లిఫ్టులకు కూడా నీటిని విడుదల చేయవచ్చన్నారు. ఎడమ కాల్వకు నీరు ఎందుకు విడుదల చేయడం లేదో జిల్లా మంత్రులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ హయాంలో సాగర్లో నీటిమట్టం తక్కువగా ఉన్న సందర్భాల్లోనూ రైతులకు సాగునీరు అందించామని జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. వరుసగా 17 సార్లు సాగునీరు అందించిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. ఎడమ కాల్వ పరిధిలోని లిఫ్టులకు కూడా నీటిని సమృద్ధిగా అందించామని చెప్పారు.

శ్రీశైలానికి వరద వస్తున్నప్పటికీ ఆ నీరు ఎక్కడికి వెళ్తుందో అందరికీ తెలుసని, పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమ ప్రాజెక్టులకు నీటిని తరలిస్తున్నారని జగదీశ్రెడ్డి ఆరోపించారు. ఇప్పటివరకు 148 టీఎంసీల నీటిని పోతిరెడ్డిపాడు ద్వారా తరలించారని ఆయన పేర్కొన్నారు. సాగర్ ఓవర్ఫ్లో అయి సముద్రంలోకి నీరు విడుదల చేసే పరిస్థితుల్లోనే పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని తీసుకెళ్లాలనే నిబంధనలు ఉన్నాయని ఆయన అన్నారు.

సాగర్ తీరంలో యాగం నిర్వహించి ప్రభుత్వం చేతులు దులుపుకుందని జగదీశ్రెడ్డి విమర్శించారు. రైతులకు అవసరమైన సమయంలో సాగునీరు ఇవ్వకుండా కాలయాపన చేస్తూ మభ్యపెడుతున్నారని ఆరోపించారు. పంటలు పండితే బోనస్, యూరియా ఇవ్వాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే సాగునీటి విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు.

సాగర్ ఆయకట్టు రైతులు ఇకనైనా చైతన్యం కావాలని జగదీశ్రెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలను గ్రామాల్లో రైతులు నిలదీసి సాగర్ నీటిపై ప్రశ్నించాలని కోరారు. ‘సాగర్ నీళ్లు మా హక్కు.. నీళ్లు ఎందుకు ఇవ్వరో చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో పంటలు సాగవుతున్నప్పుడు తెలంగాణ రైతులకు సాగునీరు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.

ఉద్యమానికి సిద్ధం సాగర్ ఎడమ కాల్వతోపాటు లిఫ్టులకు వెంటనే నీటిని విడుదల చేయాలని జగదీశ్రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో చర్చించి పార్టీ తరఫున పెద్దఎత్తున పోరాటానికి కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. రైతులకు నీరు సాధించే వరకు అండగా ఉంటామని స్పష్టం చేశారు.

Share
Share