APB News Exclusive: వరుణయాగం వేధికగా కాంగ్రెస్‌ లుకలుకలు!

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నాగార్జునసాగర్ తీరంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన వరుణయాగం ఆధ్యాత్మిక కార్యక్రమం కంటే రాజకీయ చర్చలకు ఎక్కువగా వేదికైనట్లు కనిపించింది. రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని, ఎలినినో ప్రభావం తగ్గాలని సంకల్పంతో చేపట్టిన ఈ యాగం కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమీకరణాలను మరోసారి వెలుగులోకి తెచ్చిందనే అభిప్రాయం నేతలు, కార్యకర్తలు, మీడియా వర్గాల్లో వినిపించింది.

ఢిల్లీ పర్యటన సందర్భంగా కేంద్ర జలవనరుల శాఖ మంత్రితో సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ సమావేశమైనప్పుడు దేశవ్యాప్తంగా ఎలినినో ప్రభావం ఉందని, వర్షాల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఆ వ్యాఖ్యలనే ప్రేరణగా తీసుకుని సాగర్లో వరుణయాగం నిర్వహిస్తే ప్రజల్లో సానుకూల సందేశం వెళ్తుందని, వర్షాలు కురిస్తే ప్రభుత్వానికి రాజకీయంగా కూడా మేలు జరుగుతుందని భావించి ఈ కార్యక్రమం చేపట్టినట్లు చర్చ సాగింది.

పూర్ణాహుతి కార్యక్రమానికి విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసినప్పటికీ, కేబినెట్లోని పలువురు కీలక మంత్రులు హాజరుకాకపోవడం ప్రధాన చర్చనీయాంశమైంది. ఇరిగేషన్ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, రోడ్లు, భవనాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తదితరులు పాల్గొన్నారు. అయితే జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సహా మరికొందరు మంత్రులు దూరంగా ఉండటం రాజకీయ సంకేతాలుగా విశ్లేషిస్తున్నారు. జిల్లాలో ఎలాంటి కార్యక్రమాలు జరిగిన పొంగులేటి, తుమ్మల రావడం సహజంగా కనిపిస్తుంది. కానీ వరుణ యాగానికి వాళ్లద్దరు రాకపోవడం పైగా వ్యవసాయశాఖ మంత్రి గైర్హాజరవడం చర్చకు దారితీసింది.

ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు, మంత్రులను ఆహ్వానించే విషయంలో సరైన ప్రోటోకాల్ పాటించలేదనే అభిప్రాయం బలంగా వినిపించింది. జిల్లా ఎమ్మెల్యేలను పిలిచే బాధ్యతను నాగార్జునసాగర్ ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి కి అప్పగించారని, ఖమ్మం జిల్లా మంత్రులకు వారి పీఏల ద్వారా ఫోన్లు చేయించారనే ప్రచారం సాగింది. ఈ తీరుతో కొందరు మంత్రులు తీవ్ర అసంతృప్తికి గురై కార్యక్రమానికి రాలేదని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరిగింది. మంత్రి కోమటిరెడ్డికి సైతం పిలుపు అందలేదని, జిల్లా మంత్రి కావడంతో ఆయన తప్పనిసరిగా హాజరుకావాల్సి వచ్చిందని అక్కడకు వచ్చిన మీడియా ప్రతినిధులతో పలువురు ఎమ్మెల్యేలు చర్చించుకోవడం గమనార్హం.

మాజీ సీఎం కేసీఆర్ చండీయాగం నిర్వహించినప్పుడు రాష్ట్రవ్యాప్తంగా భారీ స్పందన లభించిందని గుర్తుచేసుకుంటూ, సీఎం నిర్వహించిన వరుణ యాగానికి సీనియర్ నేత కె. జానారెడ్డికి తొలుత ఆహ్వానం వెళ్లలేదనే వార్త మరింత ఆసక్తిని రేకెత్తించింది. జానారెడ్డి మొదట రావడానికి నిరాకరించారని, అనంతరం సీఎం స్వయంగా ఆహ్వానించడంతోనే హాజరయ్యారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఇదే అంశం సాగర్ వేదికపై చర్చకు దారితీసింది.

ఆధ్యాత్మిక కార్యక్రమం జరుగుతుండగానే రాజకీయ సమీకరణాలపై నేతలు చర్చించుకోవడం కొసమెరుపైంది. జానారెడ్డికి ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలపై అక్కడే చర్చ నడిచినట్లు సమాచారం. అదే సమయంలో గుత్తా అమిత్రెడ్డి భవిష్యత్తులో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు కూడా చర్చకు వచ్చాయి. అమిత్రెడ్డి పోటీకి గుత్తా సుఖేందర్రెడ్డి సానుకూలంగా లేరని, ఈ విషయాన్ని ఇప్పటికే ప్రభుత్వ పెద్దలకు తెలియజేశారనే ప్రచారం మరోసారి వినిపించడం ఆసక్తిని పెంచింది. వర్షాల కోసం నిర్వహించిన వరుణయాగం చివరికి కాంగ్రెస్ అంతర్గత సంబంధాలు, ఆహ్వానాల రాజకీయాలు, భవిష్యత్ పదవుల సమీకరణాలపై చర్చలకు వేదిక కావడం గమనార్హం. ఆధ్యాత్మిక కార్యక్రమంగా ప్రారంభమైన ఈ వేడుక, సాగర్ తీరంలో కాంగ్రెస్ రాజకీయాల అసలు ఉష్ణోగ్రతను బయటపెట్టిందనే అభిప్రాయం అక్కడి వర్గాల్లో వ్యక్తమైంది.

Share
Share