Breaking News: కొండమల్లేపల్లి లో ప్రైవేట్ స్కూల్ నిర్వాహకురాలు దారుణ హత్య.. ఇంట్లో రక్తపు మడుగులో మృతదేహం..

దేవరకొండ, ఏపీబీ న్యూస్: కొండమల్లేపల్లి పట్టణంలో బుధవారం ఓ మహిళ హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. దేవరకొండ డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని జేబీ కాలనీలో నివాసం ఉంటున్న రూపారెడ్డి (48) మృతదేహం ఇంట్లో రక్తపు మడుగులో కనిపించింది.

రూపారెడ్డి గత ఇరవై ఐదేళ్లుగా నాగార్జున గ్రామర్ హైస్కూల్ నిర్వహణలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. భర్త రాజేందర్ రెడ్డి వ్యాపార కారణాలతో, కుమారుడు అభిరామ్ చదువుల నిమిత్తం హైదరాబాద్లో ఉంటుండగా, ఆమె కొండమల్లేపల్లికి వచ్చి పాఠశాల పనులు చూసుకుంటూ ఉండేవారని పోలీసులు తెలిపారు.

మూడు రోజుల సెలవుల అనంతరం మంగళవారం హైదరాబాద్ నుంచి వచ్చిన రూపారెడ్డి సాయంత్రం ఇంటికి చేరుకున్నారు. రాత్రి ఆమెతో ఫోన్లో మాట్లాడేందుకు భర్త ప్రయత్నించగా ఫోన్ స్విచ్ ఆఫ్గా వచ్చింది. దీంతో బుధవారం ఉదయం పై అంతస్తులో నివసిస్తున్న అద్దెదారులను ఇంటిని పరిశీలించమని కోరారు. వారు ఇంట్లోకి వెళ్లి చూడగా రూపారెడ్డి మృతదేహం కనిపించడంతో కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారం అందించారు.

సంఘటన స్థలానికి చేరుకున్న కొండమల్లేపల్లి, గుడిపల్లి, గుర్రంపోడు, చింతపల్లి పోలీసు అధికారులు క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సహాయంతో విచారణ ప్రారంభించారు. మృతదేహంపై కత్తిపోట్ల గాయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆమె మొబైల్ ఫోన్ కనిపించకపోవడంతో దానిని నిందితులు తీసుకెళ్లి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. హత్యకు గల కారణాలపై పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఆస్తి వివాదాలు, కుటుంబ సంబంధాలు, వ్యక్తిగత విభేదాలు తదితర అంశాలను పరిశీలిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. సీసీటీవీ దృశ్యాలు, కాల్ డేటా రికార్డులు, పోస్టుమార్టం నివేదిక ఆధారంగా విచారణ కొనసాగుతోందని, నిందితుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. త్వరలోనే కేసును ఛేదిస్తామని డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు.

Share
Share