- హైదరాబాద్-వరంగల్ NH-163 ఆరు లైన్ల విస్తరణ..
- హైదరాబాద్-చెన్నై బుల్లెట్ రైలు అలైన్మెంట్లో నకిరేకల్ చేర్చాలని వినతి
న్యూఢిల్లీ/భువనగిరి, ఏపీబీ న్యూస్: భువనగిరి పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని కీలకమైన రోడ్డు భద్రతా పనులు, రహదారుల మౌలిక వసతులు మరియు రైల్వే ప్రాజెక్టులను వేగవంతం చేయాలని కోరుతూ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి న్యూఢిల్లీలో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మరియు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్లను వేర్వేరుగా కలిసి వినతిపత్రాలు సమర్పించారు.
మంత్రి నితిన్ గడ్కరీతో జరిగిన సమావేశంలో ఎంపీ చామల మాట్లాడుతూ.. హైదరాబాద్-వరంగల్ మధ్య ఉన్న NH-163 జాతీయ రహదారిని ఆరు లైన్ల రహదారిగా అప్గ్రేడ్ చేయడం అత్యంత ప్రాధాన్యత కలిగిన డిమాండ్గా వివరించారు. ఈ కారిడార్లో వేగంగా పెరుగుతున్న జనాభా, పారిశ్రామిక రవాణా మరియు ట్రాఫిక్ ఒత్తిడిని దృష్టిలో ఉంచుకుని తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి అందించిన ప్రధాన విజ్ఞప్తులు:
NH-163 భద్రతా చర్యలు: అనంతారం క్రాస్ రోడ్డు, ప్రభుత్వ ఐటీఐ కాలేజ్-రామకృష్ణపురం క్రాస్ రోడ్డు, స్వర్ణగిరి ఆలయం, సింగన్నగూడెం క్రాస్ రోడ్డు వద్ద వెహిక్యులర్ అండర్పాస్లు, సర్వీసు రోడ్ల నిర్మాణం చేపట్ట్చాలి.
ఎయిమ్స్ ఫ్లైఓవర్ & పగిడిపల్లి: బీబీనగర్ ఎయిమ్స్ (AIIMS) వద్ద మంజూరైన 6-లైన్ల ఫ్లైఓవర్ పనులను వెంటనే ప్రారంభించాలని మరియు పగిడిపల్లి 12వ వార్డులో పెండింగ్ డ్రైనేజీ పనులను పూర్తి చేయాలని కోరారు.
నకిరేకల్ NH-565 పరిధి: నకిరేకల్-తాటికల్ రోడ్డు విస్తరణతో పాటు చందంపల్లి వద్ద లూప్ ఫోర్, పద్మనగర్, ఇనుపముల వద్ద ఫ్లైఓవర్లు, కోర్లపహాడ్, కేతేపల్లి, చీకటిగూడెం, వట్టిమర్తి, పిట్టంపల్లి వద్ద అండర్పాస్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
పెద్ద అంబర్పేట్ వద్ద ఫుట్ఓవర్ బ్రిడ్జి: NH-365 (హైదరాబాద్-విజయవాడ) పై లక్ష్మారెడ్డి పల్లెం వద్ద గల హనుమాన్ ఆలయం వద్ద పండుగల సమయంలో తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నందున తక్షణమే ఫుట్ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని విన్నవించారు.
బుల్లెట్ రైలు కారిడార్లో నకిరేకల్:
అనంతరం కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసిన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రతిపాదిత హైదరాబాద్-చెన్నై హై-స్పీడ్ (బుల్లెట్) రైలు కారిడార్ను కొత్త గ్రీన్ ఫీల్డ్ మార్గంలో కాకుండా ఇప్పటికే ఉన్న NH-65 కారిడార్ మీదుగా మళ్లించాలని కోరారు. దీని ద్వారా నకిరేకల్ అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు భువనగిరి పార్లమెంట్ పరిధిలోని ప్రధాన పట్టణాలు, వాణిజ్య కేంద్రాలకు అత్యుత్తమ కనెక్టివిటీ అందుతుందని వివరించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీలు మల్లు రవి (నాగర్కర్నూల్), సురేష్ షెట్కర్ (జహీరాబాద్), గడ్డం వంశీకృష్ణ (పెద్దపల్లి) తదితరులు పాల్గొన్నారు.