APB News Exclusive: మందలించినందుకు కక్ష.. ప్రిన్సిపల్‌ రూపారెడ్డి హత్య!

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపల్ కల్లు రూపారెడ్డి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గతంలో డబ్బుతో పట్టుబడిన ఇద్దరు పదో తరగతి విద్యార్థులను ప్రిన్సిపల్ వారి తల్లిదండ్రుల సమక్షంలో మందలించడంతో ఆమెపై కక్ష పెంచుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఆ కక్షకు తోడు జల్సాలకు, చెడు వ్యసనాలకు అలవాటుపడిన విద్యార్థులు సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో ప్రిన్సిపల్ వద్ద పెద్ద మొత్తంలో నగదు ఉంటుందని భావించి హత్యకు పథకం రచించినట్లు పోలీసుల విచారణలో తేలింది. గత నెలలో హాస్టల్లో డబ్బుతో పట్టుబడిన విద్యార్థులను రూపారెడ్డి మందలించడంతో ఆ విషయాన్ని మనసులో పెట్టుకున్నారని, అనంతరం ఆమెపై కక్ష పెంచుకున్నారని దర్యాప్తులో తేలింది. సోషల్ మీడియా, యూట్యూబ్లో డబ్బు సులభంగా సంపాదించే మార్గాలను వెతుకుతూ.. హత్యకు సంబంధించి పోలీసులకు ఆధారాలు దొరకకుండా ఎలా వ్యవహరించాలనే దానిపైనా అన్వేషణ చేసినట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. కేసు వివరాలను బుధవారం ఆయన మీడియాకు వివరించారు.

పోలీసుల కథనం ప్రకారం.. ఇద్దరు విద్యార్థులు ఒకే పాఠశాలలో పదో తరగతి చదువుతూ హాస్టల్లో ఒకే గదిలో ఉంటున్నారు. జల్సాలు, చెడు వ్యసనాలకు అలవాటు పడటంతో పాటు తల్లిదండ్రులకు తెలియకుండా సెల్ ఫోన్లు వినియోగిస్తూ సోషల్ మీడియా, యూట్యూబ్లో సులభంగా డబ్బు సంపాదించే మార్గాలను వెతికేవారు. గత నెలలో హాస్టల్లో డబ్బుతో పట్టుబడటంతో రూపారెడ్డి వారి తల్లిదండ్రుల సమక్షంలో మందలించినట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఆమెపై కక్ష పెంచుకున్నారని, ఆమె వద్ద పెద్ద మొత్తంలో నగదు ఉంటుందని భావించి హత్యకు పథకం రచించారని పేర్కొన్నారు. హత్యకు వారం రోజుల ముందు నుంచే రూపారెడ్డి కదలికలను గమనిస్తూ రెక్కీ నిర్వహించినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

హత్య జరిగిన రోజు సాయంత్రం సుమారు 4 గంటలకు పాఠశాల నుంచి ఇంటికి వెళ్లిన విద్యార్థుల్లో ఒకరు బ్యాగులో ఎరుపు రంగు హుడీ, ప్యాంట్ తీసుకుని వచ్చినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఇద్దరూ కొండమల్లేపల్లిలో కత్తి, గ్లౌజులు కొనుగోలు చేశారు. రూపారెడ్డి ఇంటి సమీపంలోని వాటర్ ట్యాంక్ వద్దకు చేరుకుని.. ఒకరు బయట ఎవరైనా వస్తున్నారా అని గమనిస్తుండగా, మరొకరు ఇంటి వెనుక భాగం నుంచి లోపలికి ప్రవేశించారు. అప్పటికే తెరిచి ఉన్న వంటగది మార్గం ద్వారా ఇంట్లోకి వెళ్లి రూపారెడ్డిపై కత్తితో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు.

హత్య అనంతరం బెడ్రూమ్లో ఉన్న సుమారు రూ.2.50 లక్షల నగదును తీసుకుని ఇంటి వెనుక గోడ దూకి నిర్మానుష్య ప్రాంతం నుంచి పారి పోయినట్లు దర్యాప్తులో వెల్లడైంది. కత్తి, గ్లౌజులు, మాస్క్, సెల్ఫోన్ను చెట్ల పొదల్లో పడేసినట్లు పోలీసులు తెలిపారు. కొంతదూరం వెళ్లిన తర్వాత బట్టలు మార్చుకుని ఎరుపు రంగు హుడీని డ్రైనేజీలో పడేసి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు వెల్లడించారు.

ఈ కేసు దర్యాప్తులో కీలక మలుపు ‘బాబు’ అనే ఒక్క మాటతో వచ్చింది. హత్యకు ముందు రూపారెడ్డి తన చిన్నమ్మతో ఫోన్లో మాట్లాడుతున్న సమయంలో చివరిగా ‘బాబు’ అని పలికారు. ఆ తర్వాత ఫోన్ స్విచ్ఆఫ్ కావడంతో.. ఆమె ఎవరిని ఉద్దేశించి ‘బాబు’ అని పిలిచారనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రూపారెడ్డి పాఠశాలలో విద్యార్థులను సాధారణంగా ‘బాబు’ అని పిలిచేవారని గుర్తించిన పోలీసులు దర్యాప్తును విద్యార్థుల వైపు మళ్లించారు. పాఠశాలకు వరుసగా ఆరు రోజులపాటు సెలవులు ఉండటంతో విచారణ ఆలస్యమైంది. స్కూల్ పునఃప్రారంభమైన తర్వాత విద్యార్థులను ఒక్కొక్కరిని విచారించారు.

కేసును ఛేదించేందుకు పోలీసులు శాస్త్రీయ దర్యాప్తును చేపట్టారు. ఫోరెన్సిక్ ఆధారాలు, ఫింగర్ప్రింట్స్, డాగ్ స్క్వాడ్, సీసీ కెమెరాల ఫుటేజీ, సాంకేతిక ఆధారాలను విశ్లేషించారు. నేరస్థలంతో పాటు చుట్టుపక్కల సుమారు 30 కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాలను పరిశీలించారు. సుమారు 70 సీసీ కెమెరాల ఫుటేజీలను రేయింబవళ్లు విశ్లేషించారు. ఐదు ప్రత్యేక బృందాల్లో దాదాపు 40 మంది పోలీసులు పనిచేసి 80 మందికి పైగా అనుమానితులను విచారించారు.  ఈ క్రమంలో రెండు రోజులుగా పాఠశాలకు హాజరుకాని కొందరు విద్యార్థులపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. వారిలో జల్సాలకు అలవాటుపడిన కొందరిని అనుమానించి నిఘా పెట్టారు. సీసీ కెమెరా ఫుటేజీల్లో లభించిన ఆధారాలు అనుమానిత విద్యార్థుల కదలికలతో సరిపోలడంతో పోలీసులు వారిపై దృష్టి కేంద్రీకరించారు.

బుధవారం ఉదయం 11.30 గంటల సమయంలో పెండ్లిపాకల ‘ఎక్స్’(X) రోడ్డు నుంచి మల్లేపల్లి వైపు వస్తున్న ఇద్దరు పదో తరగతి విద్యార్థులను దొనియాల ‘ఎక్స్’(X) రోడ్డు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించి తనిఖీ చేయగా లోదుస్తుల్లో నగదు దాచినట్లు గుర్తించారు. వారి వద్ద నుంచి రూ.1.54 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. అందులో మూడు రూ.500 నోట్లపై రక్తపు మరకలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నగదు ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించగా.. రూపారెడ్డిని హత్య చేసి ఇంట్లోని నగదును అపహరించినట్లు విద్యార్థులు వెల్లడించారని పోలీసులు తెలిపారు.

ఈ కేసులో చట్టంతో సంఘర్షణలో ఉన్న ఇద్దరు బాలురను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

JCL-1: 16 ఏళ్ల పదో తరగతి విద్యార్థి.

JCL-2: 16 ఏళ్ల పదో తరగతి విద్యార్థి.

ఇద్దరూ నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్లోనే చదువుతున్నట్లు ఎస్పీ తెలిపారు. కేసును ఛేదించడంలో దేవరకొండ డీఎస్పీ ఎం.వి. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మల్లేపల్లి సీఐ ఏ. నవీన్ కుమార్, సీసీఎస్ ఇన్స్పెక్టర్ ఎం. జితేందర్ రెడ్డి, ఎస్ఐలు, సీసీఎస్ సిబ్బంది కీలకంగా పనిచేశారు. ప్రత్యేక బృందాల కృషిని జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ అభినందించి రివార్డులు ప్రకటించారు.

Share
Share