- శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే పీడీ యాక్ట్ తప్పదు..
- వినాయక చవితి ఉత్సవాల వేళ నల్గొండ సబ్ డివిజన్ పోలీసుల భారీ కౌన్సెలింగ్..
- 125 మందిపై రూ.2 లక్షలతో బైండ్ ఓవర్ కేసులు..
నల్గొండ, ఏపీబీ న్యూస్: రాబోయే వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో నల్గొండ పట్టణంతో పాటు సబ్ డివిజన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రజల ప్రశాంతతకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారైనా సహించేది లేదని, అవసరమైతే కఠినమైన పీడీ యాక్ట్ (PD Act) ప్రయోగిస్తామని నల్గొండ డీఎస్పీ కె. శివరాం రెడ్డి హెచ్చరించారు.
బుధవారం నల్గొండ సబ్ డివిజన్ పోలీస్ కార్యాలయంలో రౌడీ షీటర్లకు ప్రత్యేక కౌన్సెలింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నల్గొండ టౌన్ పరిధిలోని 75 మందితో పాటు మొత్తం సబ్ డివిజన్ పరిధిలోని 150 మంది రౌడీ షీటర్లు హాజరయ్యారు.
125 మందిపై బైండ్ ఓవర్ – రూ. 2 లక్షల జరిమానా నిబంధన!
ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడూతూ, ఉత్సవాల సమయంలో గొడవలు, అల్లర్లు, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని స్పష్టం చేశారు.
పోలీస్ శాఖ తీసుకున్న కీలక చర్యలు & హెచ్చరికలు:
బైండ్ ఓవర్ చర్యలు: ఇప్పటికే సబ్ డివిజన్ పరిధిలోని 125 మంది రౌడీ షీటర్లపై పటిష్టమైన బైండ్ ఓవర్ కేసులు నమోదు చేశారు.
రూ. 2 లక్షల బాండ్: సంబంధిత తహసీల్దార్ (MRO)ల సమక్షంలో రూ. 2 లక్షల నగదు పూచీకత్తు మరియు 6 నెలల కాలపరిమితితో బైండ్ ఓవర్ చర్యలు పూర్తి చేశారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే జైలుకే: బైండ్ ఓవర్ నిబంధనలను ఉల్లంఘించి మళ్లీ గొడవల్లో జోక్యం చేసుకుంటే భారీ జరిమానాతో పాటు నేరుగా జైలుకు పంపుతామని హెచ్చరించారు.
గస్తీ & నిరంతర నిఘా: రౌడీ షీటర్ల రోజువారీ కదలికలు, ప్రవర్తనపై స్పెషల్ టీమ్స్ ద్వారా పోలీసులు నిరంతరం నిఘా ఉంచుతారని స్పష్టం చేశారు.

“నేర స్వభావం వీడి.. సమాజంలో గౌరవంగా జీవించండి”
గతంలో చేసిన నేరాలను, చెడు మార్గాలను పూర్తిగా విడిచిపెట్టి సాధారణ పౌరులుగా ప్రశాంతంగా జీవించాలని రౌడీ షీటర్లకు డీఎస్పీ శివరాం రెడ్డి హితవు పలికారు. చట్టానికి సహకరిస్తూ, కుటుంబంతో కలిసి గౌరవప్రదమైన జీవితాన్ని గడిపితే పోలీసు శాఖ నుంచి ఎలాంటి ఇబ్బంది ఉండదని, అలా కాకుండా ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని తేల్చి చెప్పారు. ఈ కౌన్సెలింగ్ కార్యక్రమంలో నల్గొండ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి, టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఆదిరెడ్డి, ఎస్ఐలు సైదాబాబు, శివప్రసాద్, ముత్తయ్యతో పాటు పోలీస్ సిబ్బంది షకీల్, శంకర్, అంజయ్య, బాలకోటి తదితరులు పాల్గొన్నారు.