- స్థానికేతరులకు సభ్యత్వం కల్పించారన్న ఆరోపణలు
- క్లబ్ బైలాకు విరుద్ధంగా వందల మందికి చోటు.. ఎన్నికల వేళే ప్రత్యక్షం?
- ఒకే వర్గం ఆధిపత్యం కోసమే ముందస్తు వ్యూహమా?
- రూ.25 వేల సభ్యత్వాలపై విచారణకు డిమాండ్
- సభ్యత్వాలపై జిల్లా కలెక్టర్ సమగ్ర దర్యాప్తు చేయాలంటున్న సభ్యులు
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నల్లగొండ క్లబ్లో అసలు బలం ఎవరిది? సభ్యత్వాల సంఖ్యలోనా.. లేక తెరవెనుక ఉన్న ‘బినామీ’ సభ్యుల బలంలోనా? ఎన్నికలు వచ్చినప్పుడే ప్రత్యక్షమయ్యే సభ్యులు ఎవరు? స్థానికేతరులకు సభ్యత్వాలు ఇచ్చి.. వారికి నల్లగొండ చిరునామాలు ఎలా వచ్చాయి? ఒకే వర్గానికి చెందిన వందల మందికి ఏళ్ల క్రితమే సభ్యత్వాలు కల్పించడం వెనుక అసలు వ్యూహమేంటి? ఇప్పుడు ఇవే ప్రశ్నలు నల్లగొండ క్లబ్ వ్యవహారంలో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. సాధారణ ఎన్నికల్లో బోగస్ ఓటర్లు, వలస ఓటర్ల వ్యవహారం తరచూ వివాదాస్పదమవుతుంటుంది. నల్లగొండ క్లబ్ ఎన్నికల్లోనూ దాదాపు అలాంటి పరిస్థితులే ఉన్నాయన్న ఆరోపణలు తాజాగా తెర పైకి వస్తున్నాయి. క్లబ్‌పై తమ ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు కొన్నేళ్ల క్రితమే సమీప బంధువులు, ఒకే సామాజికవర్గానికి చెందిన వందల మందిని సభ్యులుగా చేర్చుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
చిరునామా నల్లగొండ.. నివాసం ఎక్కడ?
క్లబ్ బైలా ప్రకారం నల్లగొండకు చెందిన స్థానికులకే సభ్యత్వం కల్పించాల్సి ఉంటుందని సభ్యులు చెబుతున్నారు. అయితే ఆ నిబంధనను పక్కనబెట్టి.. నల్లగొండలో నివాసం లేని పలువురికి సభ్యత్వాలు కల్పించారన్న ఆరోపణలు ఉన్నాయి. వారి చిరునామాలు మాత్రం నల్లగొండవే. వాస్తవంగా వారు నల్లగొండలో నివసిస్తున్నారా? క్లబ్ కార్యకలాపాల్లో ఎంతవరకు పాల్గొంటున్నారు? సభ్యత్వం తీసుకున్న తర్వాత సాధారణ రోజుల్లో క్లబ్‌కు వస్తున్నారా? లేక ఎన్నికల సమయంలో మాత్రమే కనిపిస్తున్నారా? అన్న అంశాలపై సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉందని పలువురు సీనియర్ సభ్యులు, సీనియర్ సిటిజన్లు కోరుతున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న సభ్యుల్లో కొందరు ఎన్నికల సమయంలో మాత్రమే క్లబ్‌లోకి వచ్చి.. ఒక నిర్దిష్ట ప్యానల్‌కు అనుకూలంగా ఓటు వేసి తిరిగి వెళ్లిపోతున్నారన్న విమర్శలు ఉన్నాయి. నిజంగానే అలా జరుగుతుంటే.. ఇది కేవలం క్లబ్ ఎన్నికల వ్యవహారమేనా? లేక ఇన్నేళ్లుగా ఒక వర్గం ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు రూపొందించిన ముందస్తు వ్యూహమా? అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్నగా మారింది.
రూ.25 వేల సభ్యత్వాల చుట్టూ అనుమానాలు
నల్లగొండ క్లబ్ 1990 దశకంలో ప్రారంభమైనట్టు తెలుస్తోంది. ప్రారంభంలో సభ్యత్వ రుసుము కేవలం రూ.2 వేలుగా ఉండగా.. ఆ తర్వాత రూ.5 వేలకు పెరిగింది. అనంతరం రూ.25 వేలు, రూ.50 వేలు, రూ.లక్ష, రూ.2 లక్షలకు చేరింది. ప్రస్తుతం సభ్యత్వ రుసుము ఏకంగా రూ.3 లక్షలకు చేరింది. క్లబ్ అభివృద్ధి చెందుతున్న దశలో సభ్యత్వాల సంఖ్య పెంచే క్రమంలోనే అసలు అవకతవకలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రూ.25 వేల సభ్యత్వం తీసుకున్న వారి వివరాలను పూర్తిస్థాయిలో పరిశీలిస్తే.. అసలు లెక్క తేలుతుందని ఒక వర్గం వాదిస్తోంది. ప్రస్తుతం క్లబ్లో సుమారు 800 మంది సభ్యులు ఉన్నట్టు చెబుతున్నారు. వీరిలో సగానికి పైగా రూ.25 వేల సభ్యత్వం తీసుకున్నవారే నన్న చర్చ ఉంది. రూ.50 వేల సభ్యత్వం తీసుకోవాలని క్లబ్ కోరిన సమయంలోనే పలువురు వైద్యులు, ఉద్యోగులు వెనుకడుగు వేసిన పరిస్థితి ఉండగా.. అంతకుముందే రూ.25 వేలతో భారీగా సభ్యత్వాలు తీసుకున్న వారి వివరాలపై ఎందుకు సమగ్ర పరిశీలన జరగలేదన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి.
ఇరవై ఏళ్ల క్రితమే ‘ప్లాన్’ జరిగిందా?
క్లబ్‌పై ఒక వర్గం ఆధిపత్యాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతోనే సుమారు రెండు దశాబ్దాల క్రితమే పక్కా ప్రణాళికతో బంధువులు, ఒకే సామాజికవర్గానికి చెందిన వందల మందిని సభ్యులుగా చేర్చారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇది నిజమైతే.. ఆ సభ్యత్వాల వెనుక ఎవరు ఉన్నారు? సభ్యత్వ దరఖాస్తులను ఎవరు సిఫారసు చేశారు? సభ్యుల చిరునామాలను ఎలా నిర్ధారించారు? వారు నిజంగా నల్లగొండలో నివసిస్తున్నారా? సభ్యత్వం తీసుకున్న తర్వాత క్లబ్‌కు ఎంతమేరకు వస్తున్నారు? ఎన్నికల సమయంలో వారి హాజరు ఎలా ఉంటుంది? వంటి ప్రశ్నలకు సమాధానాలు దొరకాల్సి ఉంది. అందుకే సభ్యత్వ రికార్డులు, చిరునామాలు, ఓటింగ్ హాజరు, సభ్యుల వాస్తవ నివాస వివరాలపై సమగ్ర పరిశీలన జరిగితే.. ఇప్పటివరకు తెర వెనుక ఉన్న వ్యవహారం వెలుగులోకి వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఎన్నికలొస్తేనే ‘బినామీ’ బలం బయటకు?
క్లబ్ కార్యవర్గానికి ప్రతి రెండేళ్లకోసారి ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికల్లో బినామీ సభ్యులే కీలకంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ప్రత్యర్థి ప్యానళ్ల నుంచి పోటీ చేసినప్పటికీ.. కీలక పదవుల్లో విజయం సాధించడం ఒకే వర్గానికే పరిమితం అవుతుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా 22 మంది సభ్యులతో కూడిన కార్యవర్గంలో మొత్తం ఒకే ప్యానల్ విజయం సాధించడం వెనుక అసలు లెక్కేంటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో మాత్రమే క్లబ్‌లోకి వచ్చే సభ్యుల ఓటింగ్ సరళిని పరిశీలిస్తే.. ఈ ఆరోపణల్లో వాస్తవమెంత అన్నది తేలుతుందని పలువురు అంటున్నారు. ఎన్నికల రోజున ఓటు వేసిన సభ్యుల జాబితాను, గత కొన్నేళ్లుగా క్లబ్ కార్యకలాపాల్లో వారి పాల్గొనడాన్ని, చిరునామాలను పరిశీలిస్తే అసలు వ్యవహారం బయటపడుతుందన్న డిమాండ్ వినిపిస్తోంది.
బీసీలకు వైస్ చైర్మన్.. ఆ తర్వాత ఏమైంది?
క్లబ్ వైస్ చైర్మన్ పదవిని బీసీలకు ఇవ్వాలన్న డిమాండ్ గతంలో బలంగా వినిపించింది. ఆ నేపథ్యంలో ఆల్ఫా నరసింహాకు ఆ అవకాశం కల్పించినట్టు సభ్యులు గుర్తుచేస్తున్నారు. అయితే ఆ తర్వాత వివిధ కారణాలను చూపిస్తూ ఆయనను పదవి నుంచి తప్పించారని, అప్పటి నుంచి క్లబ్లో ఒకే సామాజికవర్గం ఆధిపత్యం మరింత బలపడిందని కొందరు సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ పరిణామాలపై కూడా సమగ్రంగా పరిశీలన జరగాల్సిన అవసరం ఉందంటున్నారు.
కలెక్టర్ ఆధ్వర్యంలో ‘సోషల్ ఆడిట్’ చేయాలంటూ డిమాండ్
క్లబ్‌కు జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా, జిల్లా ఎస్పీ వైస్ చైర్మన్‌గా ఉన్న నేపథ్యంలో.. సభ్యత్వాలపై వస్తున్న ఆరోపణలను తేలిగ్గా తీసుకోకుండా పూర్తిస్థాయిలో విచారణ చేయాలని సభ్యులు కోరుతున్నారు. ముఖ్యంగా రూ.25 వేల సభ్యత్వం తీసుకున్న వారి నుంచి ప్రారంభించి.. సభ్యుల చిరునామాలు, స్థానికత, సభ్యత్వ దరఖాస్తులు, సిఫారసులు, ఓటింగ్ హాజరు, ఎన్నికల సమయంలో వారి పాల్గొనడం వంటి అంశాలన్నింటినీ పరిశీలించాలని డిమాండ్ చేస్తున్నారు. క్లబ్ సభ్యత్వాలు నిజంగా బైలాకు అనుగుణంగానే ఇచ్చారా? స్థానికేతరులకు నల్లగొండ చిరునామాలతో సభ్యత్వాలు ఎలా దక్కాయి? ఎన్నికల సమయంలో మాత్రమే కనిపించే సభ్యుల సంఖ్య ఎంత? ఒకే ప్యానల్‌కు వరుస విజయాలు దక్కడం వెనుక ఏదైనా ప్రత్యేక సమీకరణ ఉందా? అన్న అంశాలపై విచారణ జరిగితే.. క్లబ్లో ఇన్నాళ్లుగా సాగుతున్న అసలు వ్యవహారం వెలుగులోకి వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.