- రూ.5 వేల నుంచి రూ.3 లక్షలకు చేరిన సభ్యత్వ రుసుం
- హైదరాబాద్ క్లబ్‌ల్లో సౌకర్యాల వినియోగమే అసలు ఆకర్షణా?
- ‘క్వాలిటీ మెంబర్స్’ పేరుతో కొత్త సభ్యత్వాలకు కళ్లెం
- ఎన్నికల్లో ఒక వర్గం ఆధిపత్యానికి ఇదే వ్యూహమా?
- ఒకప్పుడు క్రీడలు, కుటుంబ వినోదానికి కేంద్రం..
- ఇప్పుడు పేకాటకే పరిమితమైందన్న విమర్శలు
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నల్లగొండ క్లబ్ లో సభ్యత్వం అంటే స్థానికంగా సౌకర్యాలు వినియోగించుకోవడమే అనుకుంటే పొరపడినట్టే..! ఇక్కడ క్లబ్లో సభ్యత్వం పొందుతున్న కొందరు.. ఆ సభ్యత్వాన్ని అడ్డుపెట్టుకుని హైదరాబాద్‌లోని ఖరీదైన క్లబ్‌లలో విందులు, వినోదాలు, విలాసాలకు తెరతీస్తున్నారన్న చర్చ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. నల్లగొండలో సభ్యత్వం ఎందుకు? హైదరాబాద్‌లో జల్సాలు ఎలా? అన్న ప్రశ్నలకు సమాధానం వెతికితే.. అసలు కథ వేరే ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా క్లబ్ సభ్యత్వం అంటే అక్కడి సౌకర్యాలను వినియోగించుకోవడం. కానీ ఇక్కడ వ్యవహారం అందుకు భిన్నంగా కనిపిస్తోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నల్లగొండ క్లబ్ పేరుతో సభ్యత్వం.. హైదరాబాద్ క్లబ్‌లలో హంగామా.. ఈ రెండింటి మధ్య ఉన్న సంబంధమే ఇప్పుడు అసలు ప్రశ్నగా మారింది. సభ్యత్వాల మంజూరు, వాటి ఆధారంగా లభిస్తున్న ప్రయోజనాలు, వాటిని ఎవరు ఎలా వినియోగిస్తున్నారు అన్న అంశాలపై సమగ్రంగా ఆరా తీస్తే మరిన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
పేకాట కేంద్రంగా మారిన నల్లగొండ క్లబ్..
రూ.5 వేలతో మొదలైన నల్లగొండ క్లబ్ సభ్యత్వ రుసుం ఇప్పుడు ఏకంగా రూ.3 లక్షలకు చేరింది. ఇంత భారీగా సభ్యత్వ రుసుం పెరగడం వెనక అసలు కారణం వేరే ఉందనే టాక్ వినిపిస్తోంది. నల్లగొండ పట్టణ ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన క్లబ్.. అతి తక్కువ కాలంలోనే సామాన్యులు, ఎగువ మధ్యతరగతి కుటుంబాలు సైతం అందుకోలేని స్థాయిలో ఖరీదైన క్లబ్‌గా మారిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే సభ్యత్వ రుసుం పెరిగిన స్థాయిలో క్లబ్లో అందుతున్న సేవలు, సౌకర్యాలు మాత్రం కనిపించడం లేదనే అసంతృప్తి సభ్యుల్లో ఉంది. క్లబ్ కార్యవర్గానికి ఎన్నికలు జరిగే రెండేళ్లకోసారి సభ్యత్వ రుసుం భారీగా పెంచుతున్నారు. ఇలా సభ్యత్వ రుసుంను అందనంత స్థాయికి పెంచడం వెనక స్థానికుల ప్రయోజనాల కంటే హైదరాబాద్‌లో స్థిరపడిన నల్లగొండకు చెందిన బిగ్షాట్స్ ప్రయోజనాలే లక్ష్యంగా ఉన్నాయని, అది కూడా ఒక వర్గం ప్రయోజనం ఆశించే జరుగుతోందని తెలిసింది. ఒకప్పుడు నల్లగొండ క్లబ్ అంటేనే హోదా కు ప్రతీకగా ఉండేది. జడ్జిలు, కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులు, వ్యాపారవేత్తలు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో వచ్చేవారు. క్లబ్ ప్రాంగణం నిత్యం సందడిగా కనిపించేది. టెన్నిస్ కోర్టు, బాస్కెట్‌బాల్ వంటి క్రీడా సదుపాయాలు ఉండటంతో కుటుంబ సభ్యులతో కలిసి గడిపేందుకు అనువైన వాతావరణం ఉండేదని సీనియర్ సిటిజన్లు గుర్తుచేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని వారు చెబుతున్నారు. ఒకప్పుడు క్రీడలు, కుటుంబ వినోదానికి కేంద్రంగా ఉన్న క్లబ్లో ప్రస్తుతం పేకాటే ప్రధాన కార్యకలాపంగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. గత వైభవానికి గుర్తుగా ఉన్న అనేక సదుపాయాలు, క్రీడా వాతావరణం కనుమరుగయ్యాయని సీనియర్ సిటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్‌లో జల్సాల కోసమే సభ్యత్వ రుసుం పెంపు..?
నల్లగొండ క్లబ్లో ప్రస్తుతం 865 మంది సభ్యులు ఉండగా.. వీరిలో సగాని కిపైగా హైదరాబాద్‌లో స్థిరపడినవారేనని క్లబ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నల్లగొండ క్లబ్ సభ్యత్వం కలిగి ఉన్న వారికి హైదరాబాద్‌లోని పలు ప్రముఖ క్లబ్లలోనూ సౌకర్యాలు వినియోగించుకునే అవకాశం ఉండటమే ఇందుకు ప్రధాన ఆకర్షణగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నల్లగొండలో సభ్యత్వం.. హైదరాబాద్‌లో విలాసాలు అన్నట్లుగా వ్యవహారం సాగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. నల్లగొండ క్లబ్‌కు హైదరాబాద్‌లోని జింఖానా క్లబ్, ఫిల్మ్‌నగర్ క్లబ్, ఎమ్మెల్యే క్లబ్, సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న స్పోర్ట్స్ క్లబ్ తదితర క్లబ్‌లతో అనుసంధానం ఉంది. ఆయా క్లబ్‌లలో సభ్యత్వం పొందాలంటే భారీగా రుసుం చెల్లించాల్సి ఉంటుంది. అలాంటి ఖరీదైన క్లబ్‌లలో నేరుగా సభ్యత్వం తీసుకోకుండానే.. నల్లగొండ క్లబ్ సభ్యత్వం ద్వారా అక్కడి సౌకర్యాలను వినియోగించుకునే అవకాశం లభించడం పలువురికి ఆకర్షణగా మారిందని తెలుస్తోంది. నల్లగొండ క్లబ్ సభ్యులకు హైదరాబాద్‌లోని అనుబంధ క్లబ్‌లలో వారానికి ఐదు రోజుల వరకు ప్రవేశం, అక్కడి సౌకర్యాలను వినియోగించుకునే అవకాశం ఉన్నట్లు క్లబ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి విందులు, వినోదాలు, క్రీడా సౌకర్యాలను ఆస్వాదించేందుకు వీలు కలుగుతోందని పేర్కొంటున్నారు. అంటే.. హైదరాబాద్ క్లబ్‌లలో లక్షల రూపాయలు వెచ్చించి సభ్యత్వం పొందాల్సిన అవసరం లేకుండానే.. నల్లగొండ క్లబ్ సభ్యత్వం ద్వారా అక్కడి సౌకర్యాలను వినియోగించుకునే వెసులుబాటు లభిస్తోందన్నమాట. ఇదే నల్లగొండ క్లబ్ సభ్యత్వం పెంపుకు ప్రధాన కారణమని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ నుంచి నల్లగొండ క్లబ్ సభ్యత్వ రుసుంను ఏకంగా రూ.3 లక్షలకు పెంచడం చర్చనీ యాంశంగా మారింది. స్థానికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకే సభ్యత్వ రుసుం పెంచారా? లేక హైదరాబాద్‌లోని ఖరీదైన క్లబ్‌ల సౌకర్యాలను అందిపుచ్చుకునే వెసులుబాటును దృష్టిలో పెట్టుకునే ఈ పెంపు జరిగిందా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
క్వాలిటీ మెంబర్స్ కే మెంబర్షిప్ అంట..
క్లబ్లో ఎవరు పడితే వాళ్లు సభ్యత్వం అడగకుండా ఉండేందుకే రుసుం పెంచినట్లు కార్యవర్గ సభ్యులు గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు. సభ్యత్వ నమోదులో ప్రక్షాళన చేయడం.. కేవలం ‘క్వాలిటీ మెంబర్స్’ కు మాత్రమే అవకాశం కల్పించడమే లక్ష్యమని చెబుతున్నారు. కానీ.. ఈ మాటల వెనక అసలు లెక్కలు వేరే ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. సభ్యత్వ రుసుంను రూ.3 లక్షలకు పెంచడం ద్వారా కొత్త సభ్యుల ప్రవేశాన్ని భారీగా కట్టడి చేశారని, దీంతో ఇప్పటికే ఉన్న సభ్యుల ఆధిపత్యానికి ఎలాంటి ఢోకా లేకుండా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ఒక వర్గానికి చెందిన సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో.. క్లబ్ ఎన్నికల సమయంలో వారి ఓట్లే కీలకంగా మారుతున్నాయని పలువురు సభ్యులు ఆరోపిస్తున్నారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ ఈ ఓటర్లే నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారని, తమకు అనుకూలమైన వారినే కార్యవర్గంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఫలితంగా క్లబ్ పాలనపై ఒక వర్గానిదే క్రమంగా పట్టు పెరిగి.. చివరకు ఏకచత్రాధిపత్యంగా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత కార్యవర్గంలోనూ ఒక వర్గానికి చెందినవారికే ప్రాధాన్యం ఉందని కొందరు సభ్యులు ఆరోపిస్తున్నారు. ‘క్వాలిటీ మెంబర్స్’ పేరుతో చెబుతున్నది నిజంగానే క్లబ్ ప్రమాణాలను పెంచేందుకా? లేక కొత్త సభ్యుల ప్రవేశాన్ని అడ్డుకుని.. ఉన్న సభ్యుల ఆధిపత్యాన్ని శాశ్వతం చేసేందుకా? అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్నగా మారింది.