APB News Exclusive: ఎపిసోడ్ -2: నల్లగొండ క్లబ్ కు రాజకీయ రంగు!

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నల్లగొండ క్లబ్ వ్యవహారాలకు క్రమంగా రాజకీయ రంగు పులుముకుందనే చర్చ సభ్యుల్లో సాగుతోంది. గత కొన్నేళ్లుగా క్లబ్పై ఒకే వర్గం ఆధిపత్యం కొనసాగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతి రెండేళ్లకోసారి జరిగే కార్యవర్గ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమని కొందరు సభ్యులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం సుమారు 800 మంది సభ్యులు ఉండగా.. వారిలో సగానికి పైగా ఒకే సామాజికవర్గానికి చెందినవారే ఉన్నారనే చర్చ ఉంది. వీరిలో పలువురు పరస్పరం బంధువులు, స్నేహితులు కావడంతో పాటు రాజకీయంగా పరిచయాలు ఉన్నవారే ఎక్కువగా ఉన్నారనే విమర్శలు ఉన్నాయి. దీంతో ఎన్నికల సమయంలో మరో వర్గం నుంచి అభ్యర్థులు పోటీ చేసినప్పటికీ, ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుత కార్యవర్గంలో బీసీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కార్యదర్శిగా ఉన్నప్పటికీ.. వాస్తవ పెత్తనం మాత్రం వైస్ చైర్మన్దేననే విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా కార్యవర్గంలో మెజార్టీ సభ్యులు ఒకే సామాజికవర్గానికి చెందినవారుగా ఉండటం కూడా చర్చకు దారితీస్తోంది.

క్లబ్ కార్యవర్గంపై మరో ప్రధాన విమర్శ కూడా ఉంది. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే.. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులతో సన్నిహిత సంబంధాలు కొనసాగించడం క్లబ్ కార్యవర్గానికి ఆనవాయితీగా మారిందనే ఆరోపణలు ఉన్నాయి. అధికార వ్యవస్థతో సత్సంబంధాలు కొనసాగించడం వరకు పరిమితమైతే అభ్యంతరం లేకపోయినా.. అవి క్లబ్ నిర్ణయాలు, పదవుల విషయంలో ప్రభావం చూపుతున్నాయా? అన్న ప్రశ్నలు సభ్యుల్లో వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత వైస్ చైర్మన్కు గతంలో బీఆర్ఎస్ రాజకీయాలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే విషయం కూడా ఇప్పుడు చర్చకు వస్తోంది. ఒక దశలో నల్లగొండ మున్సిపల్ చైర్మన్ పదవికి పోటీ చేసేందుకు ఆయన సిద్ధమైనట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరిగింది. అప్పట్లో ప్రస్తుత మేయర్ బుర్రి చైతన్య భర్త బుర్రి శ్రీనివాస్రెడ్డిపై కౌన్సిలర్గా పోటీ చేయాలని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి ప్రతిపాదించినప్పటికీ.. శ్రీనివాస్రెడ్డితో ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగా ఆయన వెనక్కి తగ్గారనే చర్చ కూడా ఉంది.

ప్రస్తుతం రెడ్క్రాస్ చైర్మన్గా కూడా వ్యవహరిస్తున్న ఆయన పదవిపై గతంలోనూ వివాదం నెలకొన్నట్లు రాజకీయ వర్గాలు గుర్తుచేస్తున్నాయి. గతంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి హయాంలో రెడ్క్రాస్ చైర్మన్గా ఉన్న మున్సిపల్ మాజీ చైర్మన్ పుల్లెంల వెంకట నారాయణ గౌడ్ను తప్పించి, తనకు ఆ పదవి దక్కేలా చేసుకున్నారనే ఆరోపణలు అప్పట్లో వినిపించాయి. అయితే ఈ వ్యవహారం నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని, అప్పటి బీఆర్ఎస్ అధికారాన్ని అడ్డంపెట్టుకుని జిల్లా ఉన్నతాధికారుల అండదండలతో రెడ్క్రాస్ పదవిని దక్కించుకున్నారనే విమర్శలు కూడా వచ్చాయి. ఈ పరిణామాలతో తీవ్ర మనస్తాపానికి గురైన వెంకట నారాయణ గౌడ్ రెడ్క్రాస్ కార్యాలయం వద్ద కుప్పకూలిపడిపోయిన ఘటన అప్పట్లో నల్లగొండలో తీవ్ర చర్చకు దారితీసిందని పలువురు గుర్తుచేస్తున్నారు.

ఇప్పుడు మరోసారి అదే వ్యవహారం తెరపైకి వస్తోంది. దాదాపు పదేళ్ల విరామం తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ.. అదే వ్యక్తికి రెడ్క్రాస్ చైర్మన్ పదవితో పాటు క్లబ్ కార్యదర్శి పదవిలోనూ కాంగ్రెస్ నేతల మద్దతు లభించడం చర్చనీయాంశంగా మారిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఒకవైపు మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డిని పదవి నుంచి తప్పించి ఆ స్థానాన్ని కాంగ్రెస్ నేతలు కైవసం చేసుకున్నారని రాజకీయ ప్రత్యర్థులు ఆరోపిస్తుండగా.. మరోవైపు రెడ్క్రాస్, నల్లగొండ క్లబ్ వ్యవహారాల్లో మాత్రం ఇదే వర్గానికి ఎందుకు ప్రాధాన్యం ఇస్తున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

క్లబ్ ఎన్నికల్లో కుల సమీకరణాలే ప్రధాన అస్త్రంగా మారుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా క్లబ్ కార్యదర్శి, వైస్ చైర్మన్ వంటి కీలక పదవులకు పోటీ చేసే ఆశావహులు తమ వర్గానికి చెందిన సభ్యుల మద్దతును కూడగట్టుకుంటే గెలుపు సులభమవుతుందనే అభిప్రాయం ఉంది. క్లబ్లో సుమారు 800 మంది సభ్యులు ఉండగా.. వారిలో సగానికి పైగా ఒకే సామాజికవర్గానికి చెందినవారేననే చర్చ ఉంది. అంతేకాకుండా ఆ వర్గంలోని పలువురు సభ్యులు పరస్పరం బంధువులు, స్నేహితులు కావడంతో పాటు రాజకీయంగా కూడా సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారనే విమర్శలు ఉన్నాయి. వీరిలో చాలామంది హైదరాబాద్లో స్థిరపడినప్పటికీ.. క్లబ్ ఎన్నికల సమయంలో మాత్రం తమ ఓటు హక్కును వినియోగించేందుకు చురుకుగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. క్లబ్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని భావించే అభ్యర్థులు సభ్యులందరినీ కలుపుకొని ప్రచారం చేయడం కంటే.. తమకు అనుకూలంగా ఉన్న వర్గం సభ్యులతోనే వ్యక్తిగతంగా సంప్రదింపులు జరుపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అందరినీ కలుపుకొని బహిరంగంగా ప్రచారం నిర్వహిస్తే అంతర్గత సమీకరణాలు, ముందస్తు అవగాహనలు బయటపడే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతోనే కొందరు అభ్యర్థులు ఒంటరిగా ప్రచారం సాగిస్తున్నారనే చర్చ కూడా ఉంది. ఇక సగానికి పైగా సభ్యులు తమకు సన్నిహితులుగా ఉండటంతో కొత్తగా ఎన్నికల బరిలోకి దిగే అభ్యర్థులకు ఆ వర్గం నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు లభించడం లేదనే విమర్శలు ఉన్నాయి. 

రెండేళ్ల పదవీ కాలం ఇట్టే ముగిసిపోతుందని భావించి ఇక నుంచి క్లబ్ కార్యవర్గం పదవీ కాలాన్ని మూడేళ్లకు పొడగించారు. ఈ మేరకు ఇటీవల జరిగిన జనరల్ బాడీలో తీర్మానం చేశారు. రెండేళ్లలో కార్యవర్గ మీటింగ్ లు, జనరల్ బాడీ సమావేశాలు పెట్టేందుకు సమయం కుదరడం లేదు. తరచూ వాయిదాలు వేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. దీంతో అందరి ఆమోదం మేరకే క్లబ్ కార్యవర్గాన్ని మూడేళ్లకు పొడగించడం జరిగింది.

Share
Share