- కాంగ్రెస్ను కబ్జా చేయాలని చూస్తే ఊరుకోం..
- ఇతర పార్టీల నేతలను చేర్చుకోవచ్చు కానీ ఇంట్లోకి వచ్చి మమ్మల్ని వెళ్లగొడతామంటే ఊరుకునేది లేదని హెచ్చరిక
మునుగోడు/నల్లగొండ, ఏపీబీ న్యూస్: దివంగత మహానేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్ ఆశయాల సాధనే లక్ష్యంగా తాను రాజకీయాల్లో కొనసాగుతున్నానని, తెలంగాణలో రాజశేఖర్ రెడ్డికి నేటికీ లక్షలాది మంది అభిమానులు ఉన్నారని ఆయన స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా పార్టీలో మారుతున్న పరిణామాలు, కొత్తగా చేరుతున్న నేతల తీరుపై రాజగోపాల్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైఎస్సార్ వర్ధంతి వేదికగా రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల ముఖ్యాంశాలు:
వైఎస్సార్ స్ఫూర్తితోనే రాజకీయం: “ఎవరెన్ని కుట్రలు చేసినా మేమంతా వైఎస్సార్ శిష్యులం. ఆయనను ఎప్పటికీ మరవం. వైఎస్సార్ ఇచ్చే స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చాను. రాబోయేది వైఎస్సార్ యుగమే.”
సిఎం పదవిపై ఆసక్తికర వ్యాఖ్యలు: “నన్ను సీఎంగా చూడాలని కొందరు అంటున్నారు. దానికి సమయం, సందర్భం వచ్చినప్పుడు ఆ పదవికి బ్రహ్మదేవుడు కూడా అడ్డుపడలేడు.”

పార్టీ కబ్జాయత్నాలపై హెచ్చరిక: “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ఇతర పార్టీల నేతలను చేర్చుకోవడం మంచిదే. కానీ, కొత్తవాళ్లు వచ్చి పార్టీని కబ్జా చేయాలని చూస్తే రాజగోపాల్ రెడ్డి ఊరుకోడు. మా ఇంట్లోకి వచ్చి మమ్మల్నే వెళ్లగొడతాం అంటే అస్సలు ఊరుకునే ప్రసక్తే లేదు.”
కార్యకర్తలకు అభయం:
నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు ఎలాంటి అన్యాయం జరగనివ్వనని, వారి తరుపున రాజగోపాల్ రెడ్డి నిరంతరం పోరాడుతారని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చి వైఎస్సార్ రాజ్యాన్ని పునరుద్ధరిస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో తెలంగాణ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసుకుంటామని, నిజమైన కాంగ్రెస్ వాదుల హక్కుల కోసం తాను ఎల్లప్పుడూ ముందుంటానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.