- నిరసనల పేరుతో నిప్పురాజేస్తున్న నేతలు
- ప్రజావ్యతిరేక విధానాల పేరుతో హద్దులు దాటుతున్న ప్రతిపక్షాలు
- రోడ్లపై నిరసనలు.. మంత్రి ఇంటిపై దాడులు
- సహనం కోల్పోతున్న అధికార పార్టీ నేతలు
- సీఎం వేదికపైనే ఘర్షణలు.. నేతల ఇళ్లలోకి చొరబాట్లు
- శాంతిభద్రతలను కాపాడటంలో విఫలమవుతున్న పోలీసులు
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: ప్రజా సమస్యలపై పోరాడాల్సిన రాజకీయ పార్టీలు ఆందోళనల పేరుతో క్రమంగా హద్దులు దాటి ప్రవర్తిస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య పెరుగుతున్న రాజకీయ వైరం ప్రజాస్వామ్య నిరసనల పరిధిని దాటి ఘర్షణలకు దారితీస్తోంది. రోడ్లపై నిరసనలతో మొదలైన ఉద్రిక్తతలు మంత్రుల ఇళ్లపై దాడులు, ముఖ్యమంత్రి పాల్గొనే వేధికల వద్ద ఘర్షణలు, చివరకు నేతల ఇళ్లలోకి చొరబడి దాడులు చేసే స్థాయికి చేరుతున్నాయి. ప్రజా సమస్యలపై ఆందోళనలు చేయడం ప్రతిపక్షాల ప్రజాస్వామ్య హక్కు అయినప్పటికీ అదే సమయంలో నిరసనలు హింసాత్మకంగా మారడం, వ్యక్తిగత దాడులకు దారితీయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు అధికారపార్టీ నేతలు సైతం సహనం కోల్పోయి ప్రతిదాడులకు దిగుతుండటంతో నల్లగొండలో రాజకీయాలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి.
ప్రజా పోరాటమా.. రాజకీయ ప్రతీకారమా?
ప్రభుత్వ వ్యతిరేక విధానాల పేరుతో బీఆర్ఎస్, బీజేపీ, సీపీఎం చేస్తున్న పోరాటాలు పక్కదారి పడుతున్నాయనే చర్చ ప్రజల్లో సాగుతోంది. ప్రజా సమస్యలను పక్కన పెట్టి రాజకీయంగా సంచలనం సృష్టించాలనే ఉద్దేశంతోనే ఆందోళనలు చేస్తున్నారని అధికార పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న పరిణామాలు తీవ్ర వివాదాస్పదంగా మారుతున్నాయి. కొద్దిపాటి అవకాశం దొరికినా బీఆర్ఎస్, బీజేపీ, సీపీఎం పార్టీలు వదిలిపెట్టకుండా ఆందోళనలకు దిగుతున్నాయని అధికార పార్టీ నేతలు అంటున్నారు. ఈ మూడు పార్టీలు ఏకమై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని రాజకీయంగా దెబ్బతీయాలనే వ్యూహంలో భాగంగానే వరుస ఆందోళనలు చేస్తున్నారనే అభిప్రాయం అధికార పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. మూడు పార్టీల సమన్వయం అధికార పార్టీకి రాజకీయంగా తలనొప్పిగా మారిందనే చర్చ కూడా సాగుతోంది. చిన్న అవకాశం లభించినా రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపడుతూ రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నారని అధికార పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. ఇందులో భాగంగానే నల్లగొండ లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిర్వహించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కార్యక్రమానికి వ్యతిరేకంగా సీపీఎం చేపట్టిన ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. సీపీఎం నేతల అరెస్టుకు మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి మద్దతు తెలపడంతో వ్యవహారం మరింత రాజకీయ రంగు పులుముకుంది. అంతకుముందు నల్లగొండ–మర్రిగూడ బైపాస్ వద్ద నిర్మించిన ఫ్లైఓవర్ బ్రిడ్జిని ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి చింతపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్కడ ఆయన దీక్ష చేపట్టడం కూడా అధికార పార్టీ నేతలను ఇబ్బందుల్లోకి నెట్టింది. ఇదిలా ఉండగానే అదే మర్రిగూడ జంక్షన్ వద్ద అంబేద్కర్, జగ్జీవన్రామ్ విగ్రహాల తొలగింపును వ్యతిరేకిస్తూ దళిత సంఘాలు ఆందోళనలకు దిగడం పరిస్థితిని మరింత తీవ్రం చేసింది.
పార్టీ ఆఫీసుల పైన దాడులకు ప్రతీకారం..
నల్లగొండలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య గొడవలు రెండేళ్ల క్రితమే మొదలయ్యాయి. బీఆర్ఎస్ జిల్లా పార్టీ ఆఫీసును ధ్వంసం చేసేందుకు మంత్రి కోమటిరెడ్డి చేసిన ప్రయత్నాలు అగ్గిరాజేశాయి. అప్పట్లో మొదలైన ఇరువర్గాల మధ్య విభేదాలు కొనసాగుతూనే వచ్చాయి. మళ్లీ బుర్రి శ్రీనివాస్రెడ్డి మున్సిపల్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన అనంతరం కమిషనర్ను కలిసేందుకు వెళ్లిన మాజీ ఎమ్మెల్యే, మాజీ మున్సిపల్ చైర్మన్లతో మున్సిపల్ కార్యాలయంలోనే ఘర్షణ పడ్డారు. ఆ తర్వాత మాజీ ఎమ్మెల్యే బర్త్ డే సందర్భంగా నల్లగొండలో ఇష్టం వచ్చినట్టు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం పట్ల మంత్రి కోమటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలో ఇరువర్గాల మధ్య ఫ్లెక్సీల గొడవ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. గతేడాది వినాయక చవితి సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసినందుకు నిరసనగా మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి మద్ధతు తెలపడం కూడా అప్పట్లో సంచలనమైంది. మళ్లీ తాజాగా వర్షిత్ రెడ్డి ఇంటి పైన కాంగ్రెస్ లీడర్లు దాడులు చేయడాన్ని మాజీ ఎమ్మెల్యే ఖండించడం, వర్షిత్ తల్లిని పరామర్శించేందుకు వెళ్లడం వంటి పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి.
నల్లగొండలో దాడుల కల్చర్ మళ్లీ మొదలు..
ప్రశాంతంగా ఉన్న నల్లగొండలో మళ్లీ దాడుల సంస్కృతి మొదలు కావడం పట్టణ ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. టీడీపీలో ఉన్నప్పుడు కంచర్ల భూపాల్ రెడ్డి టీడీపీ జిల్లా పార్టీ ఆఫీసుకు నిప్పుంటించారు. మళ్లీ రెండేళ్ల క్రితం నల్లగొండ మున్సిపల్ ఆఫీసులోనే కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గీయులు పూలకుండీలతో దాడులు చేసుకున్నారు. ఇటీవల నల్లగొండలో జరిగిన సీఎం రేవంత్ సభ వేధిక పైనే సీఎం సెక్యూరిటీ సిబ్బందితో బుర్రి శ్రీనివాస్ రెడ్డి, గుమ్మల మోహన్ రెడ్డి తదితరులు గొడవ పడటం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇప్పుడు తాజాగా బీజేపీ, కాంగ్రెస్ మధ్య వైరం పరాకష్టకు చేరింది. నిజానికి వర్షిత్ రెడ్డి నిరసన కార్యక్రమం అదుపు తప్పిందని సొంత పార్టీ నాయకులే చెప్తున్నారు. మొదట బస్టాండ్ సమీపంలోని సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద ప్లాన్ చేసిన కార్యక్రమం ఆ తర్వాత క్లాక్ టవర్ వద్దకు, మళ్లీ అక్కడ కాదని ఎన్టీఆర్ విగ్రహం వద్దకు చేరుకున్న బీజేపీ శ్రేణులు, క్రమంగా శ్రీనగర్ కాలనీలోని మంత్రి ఇంటి పైన దాడి చేయడం సంచలనమైంది. వర్షిత్ రెడ్డి వైఖరిని గమనించిన పార్టీ సీనియర్లు మంత్రి ఆఫీసుకు రాకుండానే మెల్లగా జారుకున్నారు. కానీ వర్షిత్, ఆయనతో పాటు వచ్చిన కొంత మంది కలిసి మంత్రి ఇంటి పైన దాడి చేయడంతో వివాదం ముదిరింది. దీనికి కౌంటర్ గా మేయర్ భర్త, మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి తదితరులు వర్షిత్ ఇంట్లోకి చొరబడి దాడులు చేశారు. అక్కడి నుంచి బీజేపీ ఆఫీసుకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఇంత గందరగోళం జరుగుతున్నప్పటికీ పోలీసులు మాత్రం ఇరువర్గీయులను కంట్రోల్ చేయలేకపోవడం విమర్శలకు తావిస్తోంది. ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న నిరసన కార్యక్రమాలను తీవ్రతను పోలీసులు ముందుగానే పసిగట్టకపోవడం, ఆందోళనలు ఆకస్మికంగా తీవ్ర రూపం దాల్చుస్తుండటంతో పట్టణంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోంది.