- ఫ్లోరైడ్ భూతంతో దశాబ్దాలుగా మునుగోడు పోరాటం
- తాగునీటి గండం కొంత తీరినా.. సాగునీటి సమస్యకు పరిష్కారం ఏదీ?
- భూగర్భ జలాలే దిక్కుగా మారడంతో ఫ్లోరోసిస్ ముప్పు కొనసాగింపు
- ఏదుల–పోతిరెడ్డిపల్లి మధ్య పనుల జాప్యంతో డిండి కోసం ఎదురుచూపులు
- హెడ్ వర్క్స్, భూసేకరణ, బ్యారేజీ పనులకు ఇకనైనా వేగం పెంచాలన్న డిమాండ్
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: ఫ్లోరైడ్ మహమ్మారితో దశాబ్దాలుగా పోరాడుతున్న మునుగోడుకు ఇప్పుడు కావాల్సింది మరో హామీ కాదు.. సురక్షిత సాగునీరు. తాగునీటి సమస్యను కొంతవరకు అధిగమించినా, సాగునీటి కోసం మాత్రం ఇప్పటికీ భూగర్భ జలాలపైనే ఆధారపడాల్సిన పరిస్థితి కొనసాగుతోంది. ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతంలో ఈ పరిస్థితి కేవలం వ్యవసాయ సమస్యగా కాకుండా ప్రజారోగ్య సమస్యగా మారింది. భూగర్భ జలాల స్థానంలో సురక్షిత ఉపరితల జలాలు పొలాలకు చేరితేనే ఈ విషవలయాన్ని ఛేదించే అవకాశం ఉంటుంది. అందుకే మునుగోడు చూపంతా ఇప్పుడు డిండి ఎత్తిపోతల పథకంపైనే.
ఇంటికి నీరు వచ్చింది.. పొలానికి ఎప్పుడు?
మిషన్ భగీరథ ద్వారా సురక్షిత తాగునీరు అందడంతో మునుగోడు ప్రజలకు కొంత ఊరట లభించింది. కానీ అసలు సమస్యలో మరో కీలక భాగం మాత్రం అలాగే ఉంది. సాగునీటి కోసం బోర్లు, బావులు, భూగర్భ జలాలపైనే రైతులు ఆధారపడుతున్నారు. ఫ్లోరైడ్ కలిగిన భూగర్భ జలాలతో పంటలు పండించే పరిస్థితి కొనసాగుతోంది.
ఇంట్లో తాగే నీరు మారింది.. పొలంలో పారే నీరు మాత్రం మారలేదు.
ఇదే మునుగోడు సమస్యలోని అసలు విషాదం. పొలానికి సురక్షిత నీరు రాకపోతే భూగర్భ జలాలపై ఆధారపడటం తప్పదు. ఆ ఆధారపడటమే ఫ్లోరైడ్ సమస్యను కొనసాగించే ప్రమాదాన్ని పెంచుతోంది.
అందుకే.. డిండి కదలాలి
మునుగోడుకు డిండి ఎత్తిపోతల పథకం కేవలం సాగునీటి ప్రాజెక్టు కాదు. ఫ్లోరైడ్ సమస్యకు దీర్ఘకాలిక పరిష్కారంలో కీలకమైన ప్రాజెక్టు. సురక్షిత ఉపరితల జలాలు పొలాలకు చేరితే భూగర్భ జలాలపై ఆధారపడే పరిస్థితి తగ్గుతుంది. రైతులకు సాగునీరు అందడంతో పాటు ఫ్లోరైడ్ ఉన్న నీటి వినియోగాన్ని తగ్గించే అవకాశం ఏర్పడుతుంది. అందుకే “ఆరోగ్య సమస్యకు ఇంజనీరింగ్ పరిష్కారం” అనే భావన డిండి పథకానికి సరిపోతుంది. ఆరోగ్యం, వ్యవసాయం, నీరు.. మునుగోడులో ఇవి మూడు వేర్వేరు సమస్యలు కాదు. ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న అంశాలు.
దిశ దొరికింది.. అడుగులు ఎందుకు నెమ్మదించాయి?
డిండి పథకంలో నీటి మూలాధారం విషయంలో చాలాకాలం అనిశ్చితి కొనసాగింది. అయితే 2023 తర్వాత ఏదుల రిజర్వాయర్ నుంచి నీటిని తీసుకునే దిశగా నిర్ణయం వచ్చింది. అంచనాలు సిద్ధమయ్యాయి. టెండర్లు పిలిచారు. ఒప్పందాలు కూడా కుదిరాయి. దీంతో ప్రాజెక్టుకు మళ్లీ స్పష్టమైన దిశ ఏర్పడింది. అయితే ఇంతవరకు వచ్చిన పురోగతి తర్వాత ఇప్పుడు అసలు ప్రశ్న పనుల వేగంపైనే. మూలాధారం ఖరారైంది.. టెండర్లు పూర్తయ్యాయి.. ఒప్పందాలు జరిగాయి.. మరి హెడ్ వర్క్స్ పనులు ఎందుకు వేగం పుంజుకోవడం లేదు?
ఏదుల–పోతిరెడ్డిపల్లి మధ్య ఏం జరుగుతోంది?
ఏదుల రిజర్వాయర్ నుంచి ప్రతిపాదిత పోతిరెడ్డిపల్లి బ్యారేజీ వరకు చేపట్టాల్సిన పనులు డిండి పథకంలో అత్యంత కీలకమైన దశ. కాలువ, సొరంగం, హెడ్ వర్క్స్ పనులు ముందుకు సాగాల్సి ఉంది. కానీ ఏదుల నుంచి పోతిరెడ్డిపల్లి వరకు భూసేకరణే ప్రధాన అడ్డంకిగా మారింది. ఇప్పటివరకు ఒక్క ఎకరం కూడా భూసేకరణ జరగలేదన్న అంశాన్ని నివేదిక ప్రస్తావిస్తోంది. భూసేకరణ లేకుండా హెడ్ వర్క్స్ ఎలా మొదలవుతాయి? పనులు ఎప్పుడు పూర్తవుతాయి? రైతుల పొలాలకు నీరు ఎప్పుడు చేరుతుంది? అన్న ప్రశ్నలు మునుగోడు ప్రజలను వెంటాడుతున్నాయి.
పోతిరెడ్డిపల్లి బ్యారేజీకి మోక్షమెప్పుడు?
దుందుభి (డిండి) నదిపై పోతిరెడ్డిపల్లి వద్ద ప్రతిపాదించిన బ్యారేజీ హెడ్ వర్క్స్ లో కీలకమైన భాగం. దీనికి వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని నివేదిక సూచిస్తోంది.ఈ పనులు ముందుకు సాగితే శ్రీశైలం జలాశయం నుంచి డిండి ఎత్తిపోతల పథకంలోని చివరి జలాశయమైన శివన్నగూడెం వరకు కృష్ణా జలాలు చేరే మార్గం సుగమమవుతుందని పేర్కొంది. అంటే.. పోతిరెడ్డిపల్లి వద్ద అడుగు పడితేనే డిండి ప్రయాణం మరింత ముందుకు సాగే పరిస్థితి.
ఎఫ్ ఎస్ ఎల్ ఖరారు కాకపోతే ముందడుగు ఎలా?
ఏదుల జలాశయం నుంచి డిండి కాలువకు సంబంధించిన ఫుల్ సప్లై లెవెల్ (FSL) కూడా కీలక సాంకేతిక అంశం. ప్రవాహం, పంపింగ్, లెవెల్స్, నిర్మాణ సరళి వంటి అంశాలు దీనిపై ఆధారపడతాయి. అందుకే సాంకేతిక నిర్ణయాలు వేగంగా పూర్తి చేసి, వాటిని పనులుగా మార్చాల్సిన అవసరం ఉంది. ఫైళ్లలో నిర్ణయాలు.. కాగితాలపై టెండర్లు.. ఒప్పందాలతో ప్రాజెక్టు ముందుకు వెళ్లదు. నేలమీద హెడ్ వర్క్స్ కనిపించాలి.. కాలువలో నీరు పారాలి.
డిండి ఆలస్యమైతే.. మునుగోడు నిరీక్షణే
మునుగోడు ప్రజల సమస్యను కేవలం ఎకరాలకు నీరు అందించాల్సిన అంశంగా చూడలేం. భారీ, మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టు లేకపోవడంతో భూగర్భ జలాలపై ఆధారపడే పరిస్థితి ఏర్పడింది. ఇదే పరిస్థితి ఫ్లోరైడ్ సమస్యతో ముడిపడుతోంది.