- Twitter.now పేరుతో కొత్త ప్లాట్ఫామ్ ప్రారంభం..
- ఆపరేషన్ బ్లూబర్డ్ పేరుతో పాత ట్విట్టర్ బ్రాండ్ పునరుద్ధరణ..
- లీగల్ పోరాటంలో కోర్టు కీలక వ్యాఖ్యల ఆధారంగా సేవలు ప్రారంభం
వాషింగ్టన్ / టెక్ డెస్క్ ఏపీబీ న్యూస్: సోషల్ మీడియా ప్రపంచంలో అత్యంత ఆదరణ పొందిన ‘ట్విట్టర్’ (Twitter) బ్రాండ్ మళ్లీ తిరిగొచ్చింది. ఎలాన్ మస్క్ 2022లో ట్విట్టర్ను కొనుగోలు చేసి దాని పేరును ‘X‘ గా మార్చిన విషయం తెలిసిందే. అయితే, పాత ట్విట్టర్ అనుభవాన్ని, దాని అసలైన పేరును తిరిగి ప్రజలకు అందించేందుకు ‘ఆపరేషన్ బ్లూబర్డ్’ (Operation Bluebird) అనే వర్జీనియా ఆధారిత స్టార్టప్ సంస్థ ముందుకు వచ్చింది. ఈ సంస్థ తాజాగా ‘Twitter.now‘ పేరుతో సరికొత్త సోషల్ మీడియా ప్లాట్ఫామ్ను అధికారికంగా ప్రారంభించింది.
ట్విట్టర్ మాజీ జనరల్ కౌన్సెల్ స్టీఫెన్ కోట్స్ నాయకత్వంలో ఈ ఆపరేషన్ బ్లూబర్డ్ ప్రారంభమైంది.
‘X Corp’తో లీగల్ పోరాటం.. కోర్టు సంచలన వ్యాఖ్యలు
పాత ట్విట్టర్ బ్రాండ్ పేరు, ‘ట్వీట్’ (Tweet) అనే పదం, మరియు ప్రతిష్టాత్మకమైన బ్లూ బర్డ్ (నీలిరంగు పక్షి) లోగో హక్కులపై ఎలాన్ మస్క్కు చెందిన ‘X Corp’ డెలావేర్ ఫెడరల్ కోర్టులో ఆపరేషన్ బ్లూబర్డ్పై పిటిషన్ దాఖలు చేసింది.
అయితే, 2022లో ట్విట్టర్ను కొనుగోలు చేసి ‘X’ గా మార్చినప్పుడే మస్క్ కంపెనీ ఈ ట్రేడ్మార్క్ హక్కులను వదులుకుందని (Abandoned) ఆపరేషన్ బ్లూబర్డ్ వాదించింది. 2026 ఏప్రిల్లో జరిగిన విచారణలో అమెరికా డిస్ట్రిక్ట్ కోర్టు న్యాయమూర్తి కోల్మ్ కానోలీ స్పందిస్తూ.. ‘Tweet’ అనే పదంపై IP హక్కులను X Corp వదులుకున్నట్లే కనిపిస్తోందని ప్రాథమికంగా వ్యాఖ్యానించారు. ఈ తీర్పును ఆధారంగా చేసుకుని ఆపరేషన్ బ్లూబర్డ్ ‘Twitter.now’ను మార్కెట్లోకి తీసుకొచ్చింది.
Twitter.now ప్రధాన ముఖ్యాంశాలు:
పాత ట్విట్టర్ లుక్ & ఫీచర్లు: ఈ కొత్త ప్లాట్ఫామ్ పాత ట్విట్టర్ అనుభవాన్ని అందిస్తుంది. ఇందులో రిప్లైలు, రీట్వీట్లు వంటి క్లాసిక్ ఫీచర్లు పునరుద్ధరించబడ్డాయి.
విశ్వసనీయతకు ప్రాధాన్యం: “X వదిలేసిన పేరును ఆపరేషన్ బ్లూబర్డ్ అందుకుంది. నమ్మకంతో twitter.now ను మీ బ్రౌజర్లో రీబిల్డ్ చేస్తున్నాం. మేము X కాదు, X Corpతో మాకు సంబంధం లేదు” అని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.
‘Vera’ ఫ్యాక్ట్-చెకింగ్ సిస్టమ్: ఫేక్ న్యూస్, అబద్ధాల ప్రచారాన్ని అడ్డుకట్ట వేసేందుకు ‘Vera’ అనే ఆటోమేటెడ్ రియల్ టైమ్ ఫ్యాక్ట్-చెకింగ్ సిస్టమ్ను పరిచయం చేశారు. స్వేచ్ఛా వ్యక్తీకరణకు భంగం కలగకుండా ఇది నిజాన్ని నిర్ధారిస్తుంది. ప్రస్తుతం కోర్టులో తుది తీర్పు రావాల్సి ఉన్నప్పటికీ, ఎలాన్ మస్క్ తీసుకున్న రీబ్రాండింగ్ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రారంభమైన ఈ Twitter.now సోషల్ మీడియా రంగంలో సరికొత్త యుద్ధానికి తెరలేపింది.