- నిన్న మధ్యాహ్నం ఏజెండా.. నేడు 3 గంటలకే సమావేశం
- మూడు నెలల తర్వాత కొత్త కమిషనర్ ఆధ్వర్యంలో భేటీ
- 48 వార్డుల్లో చిన్నచిన్న పనులకే రూ. 55లక్షలు
- జేసీబీకి రూ.50 లక్షలు.. ట్రాక్టర్లకు రూ.30 లక్షలు
- మొక్కలు, ట్రీ గార్డులకు రూ.14 లక్షలు.
- డంపింగ్ యార్డుకు రూ.70 లక్షలు
- తాగునీటి, విద్యుత్ పనులకు రూ.50 లక్షలు..
- కొత్త మాస్టర్ ప్లాన్‌కు ఆమోదం
- స్వచ్ఛతపై అవగాహనకు రూ.2.74 లక్షలు
- కళాభారతి లీజు నెలకు రూ.50వేలు
- మిర్యాలగూడ కౌన్సిల్ మీటింగ్ పైనే సర్వత్రా చర్చ
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: మిర్యాలగూడ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నిర్వహణపై కౌన్సిలర్లలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మూడు నెలలుగా కౌన్సిల్ సమావేశం నిర్వహించకుండా.. తాజాగా కొత్త కమిషనర్ బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో హడావుడిగా సమావేశం ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. నిన్న మధ్యాహ్నం కౌన్సిలర్లకు ఏజెండా పంపించి.. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం నిర్వహిస్తున్నట్లు సమాచారం ఇవ్వడంపై పలువురు కౌన్సిలర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇంత తక్కువ వ్యవధిలో ఏజెండా అందించి సమావేశం నిర్వహించాల్సిన అవసరం ఏమొచ్చిందని వారు ప్రశ్నిస్తున్నారు. అత్యవసర అంశాలపై నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి లేకపోయినా.. ఇంత ఆగమేఘాల మీద కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటన్నది అంతుచిక్కడం లేదని కౌన్సిలర్లు పేర్కొంటున్నారు. 15వ ఆర్ధిక సంఘం, మున్సిపల్ సాధారణ నిధుల నుంచి చెల్లింపులు, ఖర్చుల వివరాలను ఏజెండాల్లో పొందుపర్చారు. కౌన్సిల్ ఆమోదంతో నిధుల దండోరా మోగనుంది.
మూడు నెలల తర్వాత సమావేశం
గతంలోనూ మున్సిపాలిటీలో ఇలాంటి హడావుడి నిర్ణయాలు, అనుమానాస్పద లావాదేవీలపై వివాదాలు తలెత్తి ఏసీబీ దాడులకు దారితీసిన విషయాన్ని కొందరు కౌన్సిలర్లు గుర్తు చేస్తున్నారు. దీంతో ప్రస్తుత సమావేశంలో పొందుపరిచిన ఏజెండా అంశాలపై ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. మూడు నెలల విరామం తర్వాత జరుగుతున్న ఈ సమావేశంలో పెద్దగా విధానపరమైన, దీర్ఘకాలిక అభివృద్ధి పనుల కంటే చిన్నచిన్న పనులు, కొనుగోళ్లు, నిర్వహణ ఖర్చులకే ప్రాధాన్యం ఇచ్చినట్లు కనిపిస్తోందని కౌన్సిలర్లు అంటున్నారు.
48 వార్డుల్లో పనులకు లక్షల్లో..
మున్సిపాలిటీలోని 48 వార్డుల్లో సిమెంట్ రోడ్ల ప్యాచ్వర్క్లు, మట్టితోలకం, కల్వర్టుల నిర్మాణం, తాగునీటి పైప్లైన్ మరమ్మతులు, ఇతర చిన్న చితికా పనులకే పెద్ద మొత్తంలో నిధులు కేటాయించినట్లు ఏజెండాలో పేర్కొన్నారు. వార్డుకు సుమారు రూ.లక్ష చొప్పున దాదాపు రూ.49 లక్షలు కేటాయించినట్లు కౌన్సిలర్లు చెబుతున్నారు. అదే సమయంలో 35, 37,17వ వార్డులకు ప్రత్యేకంగా రూ.13 లక్షల చొప్పున కేటాయింపులు చేసినట్లు వారు పేర్కొంటున్నారు. చిన్నపాటి పనుల పేరుతో ఇలా భారీ మొత్తాలు కేటాయించడం వెనుక ఉద్దేశం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.
మొక్కల పేరుతో రూ.14 లక్షలు
హరితహారం కింద కూడా నిధుల కేటాయింపులు చర్చకు దారితీస్తున్నాయి. టౌన్-1లో మొక్కల కొనుగోలుకు రూ.5 లక్షలు, టౌన్-2లో మరో రూ .5 లక్షలు, ట్రీగార్డుల కోసం రూ.4 లక్షలు కేటాయించినట్లు ఏజెండాలో ఉంది. మొత్తంగా రూ.14 లక్షలను మొక్కలు, ట్రీగార్డుల కోసం ఖర్చు చేయనున్నారు. మున్సిపాలిటీలో ఇప్పటికే హరితహారం పేరుతో గతంలో ఖర్చులు జరిగినప్పటికీ.. మళ్లీ ఇంత పెద్ద మొత్తంలో నిధులు కేటాయించడంపై కౌన్సిలర్లు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
ప్లాస్టిక్ నిషేధం అమలుకు బదులు ఫ్లెక్సీలకా?
మున్సిపాలిటీల్లో ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించాల్సిన అధికారులు.. అవగాహన పేరుతో ఫ్లెక్సీలు, వాల్ పెయింటింగ్లు, నేమ్బోర్డులకు నిధులు ఖర్చు చేయడంపై కూడా విమర్శలు వస్తున్నాయి. స్వచ్ఛ భారత్ కింద రూ.2.74 లక్షలు కేటాయింపులు ఉండగా.. SWM Rules–2026 అమలుపై అవగాహనకు రూ.1 లక్ష, డంపింగ్ యార్డు, ఇతర ప్రాంతాల్లో వాల్ పెయింటింగ్, నేమ్బోర్డులకు రూ.1 లక్ష, మోడల్ డస్ట్బిన్ల కోసం రూ. 74 వేలుగా ప్రతిపాదించారు.
జేసీబీకి రూ.50 లక్షలు.. ట్రాక్టర్లకు రూ.30 లక్షలు
మున్సిపాలిటీ అవసరాల కోసం భారీ కొనుగోళ్లకు కూడా ప్రతిపాదనలు పెట్టారు. జేసీబీ కొనుగోలుకు రూ.50 లక్షలు, ట్రాక్టర్ల కొనుగోలుకు రూ. 30 లక్షలు కేటాయించే అంశాలు ఏజెండాలో ఉన్నట్లు కౌన్సిలర్లు చెబుతున్నారు. ఇంత పెద్ద మొత్తంలో యంత్రాలు, వాహనాల కొనుగోలు చేయాల్సిన అవసరం ఏమిటి? వాటి వినియోగం, నిర్వహణ, గతంలో ఉన్న వాహనాల పరిస్థితి వంటి అంశాలపై సమగ్రంగా చర్చించకుండా నిర్ణయం తీసుకోవద్దని కొందరు కౌన్సిలర్లు అంటున్నారు.
బతుకమ్మ ప్రచారానికి రూ.1.50 లక్షలు
బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి ఆటోల్లో ప్రచారం నిర్వహించడం, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం కోసం రూ.1.50 లక్షలు ఖర్చయినట్లు ఏజెండాలో పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారానికి ఇంత మొత్తం ఖర్చు చేయాల్సిన అవసరం ఏమిటన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. మున్సిపాలిటీలో డిమాండ్ నోటీసులు, బిల్లులు తదితరాలను ప్రింటింగ్ చేసేందుకు రూ.లక్ష కేటాయించే అంశం కూడా ఏజెండాలో ఉంది. రోజువారీ పరిపాలనలో భాగంగా ఉండే ఇలాంటి సాధారణ ఖర్చులను కూడా కౌన్సిల్ ముందుకు తీసుకురావడంపై కొందరు కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
కొత్త కమిషనర్ ముందున్న సవాల్
మూడు నెలల విరామం తర్వాత, కొత్త కమిషనర్ ఆధ్వర్యంలో జరుగుతున్న తొలి సమావేశంలోనే పెద్ద మొత్తంలో నిధులకు సంబంధించిన ప్రతిపాదనలు రావడంతో ఈ భేటీపై ఆసక్తి నెలకొంది. ప్రతి అంశాన్ని కౌన్సిలర్లు క్షుణ్ణంగా పరిశీలించి, అవసరం ఉన్న పనులకే నిధులు కేటాయించాలనే డిమాండ్ వినిపిస్తోంది. మున్సిపల్ నిధులు ప్రజల అవసరాల కోసం ఖర్చు చేయాల్సి ఉండగా.. చిన్నచిన్న పనులు, ప్రచార కార్యక్రమాలు, మొక్కలు, ఫ్లెక్సీలు, పరికరాల కొనుగోళ్ల పేరుతో నిధులు విచ్చలవిడిగా ఖర్చు చేయకుండా పారదర్శకత పాటించాలని కౌన్సిలర్లు కోరుతున్నారు. గతంలో జరిగిన పరిణామాలు పునరావృతం కాకుండా ప్రతి రూపాయికి లెక్క ఉండాలని వారు స్పష్టం చేస్తున్నారు.
సాగర్ రోడ్డులో భూముల మార్పిడికి ప్రతిపాదన
పట్టణ ప్రణాళిక విభాగానికి సంబంధించిన ఏజెండాలో సాగర్ రోడ్డులోని సర్వే నంబర్ 838లో ఉన్న రెండు స్థలాలకు సంబంధించి కీలక అంశం పొందుపరిచారు. సుమారు 594.39 చదరపు మీటర్లు, 588.54 చదరపు మీటర్ల విస్తీర్ణం ఉన్న స్థలాలను నివాసయోగ్య భూమి నుంచి వాణిజ్య వినియోగానికి మార్చేందుకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించారు. స్థల పరిశీలన అనంతరం ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపడంతోపాటు కౌన్సిల్ తీర్మానం ఆమోదం కోసం అజెండాలో చేర్చారు.
కొత్త మాస్టర్ ప్లాన్
మిర్యాలగూడ పట్టణానికి ప్రస్తుతం అమలులో ఉన్న 1987 మాస్టర్ ప్లాన్ను సవరించి కొత్త మాస్టర్ ప్లాన్ రూపొందించారు. GIS ఆధారంగా రూపొందించిన ముసాయిదా మాస్టర్ ప్లాన్పై ప్రజాభిప్రాయ సేకరణ, సమావేశాలు నిర్వహించి వచ్చిన సూచనలు, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్నట్లు అజెండాలో పేర్కొన్నారు. కౌన్సిల్ ఆమోదం అనంతరం ముసాయిదా మాస్టర్ ప్లాన్ను ప్రభుత్వ అనుమతి కోసం పంపేందుకు చర్యలు చేపట్టనున్నారు.
డంపింగ్ యార్డుకు రూ.70 లక్షలు
డంపింగ్ యార్డులో మౌలిక సదుపాయాలను మెరుగుపర్చేందుకు భారీగా నిధులు వెచ్చించనున్నారు. 500 కేవీఏ ట్రాన్స్ఫార్మర్ కొనుగోలు, ఎల్టీ నుంచి హెచ్టీకి కరెంట్ లైన్ మార్చేందుకు రూ.50 లక్షలు ఖర్చు చేయాలని ప్రతిపాదించారు. ఈ మొత్తాన్ని మున్సిపల్ జనరల్ ఫండ్స్, 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి వెచ్చించనున్నారు. అదేవిధంగా డంపింగ్ యార్డులో కొత్తగా ఏర్పాటు చేసిన షెడ్కు సంబంధించి అవసరమైన పనులు, మెషినరీ కొనుగోలు తదితరాలకు రూ.20 లక్షలు కేటాయించేందుకు పరిపాలనా అనుమతి కోరారు.
తాగునీటి సరఫరా వ్యవస్థకు
పట్టణంలోని తాగునీటి సరఫరా వ్యవస్థకు సంబంధించిన విద్యుత్ మౌలిక సదుపాయాలను మెరుగుపర్చేందుకు కూడా ప్రతిపాదనలు చేశారు. అవసరమైన మోటార్ల ఏర్పాటు, కేబుల్ వైర్ల పనులకు నిధులు కేటాయించనున్నారు. ముఖ్యంగా 37వ వార్డులో మోటార్ ఏర్పాటు, దానికి విద్యుత్ కేబుల్ వైర్ ఏర్పాటు వంటి పనులకు నిధులు వెచ్చించేందుకు కౌన్సిల్ ఆమోదం కోరారు. 2025, 2026 సంవత్సరాలకు సంబంధించిన కొన్ని వార్డులలో ఆటో డ్రైవర్లకు సంబంధించిన పనులు/సదుపాయాల కోసం రూ. 99 వేల చొప్పున కేటాయింపులు చేశారు.