- కార్పోరేటర్ల మాటకూ నో.. పైరవీలకూ చెక్..
- రోడ్లపై మాంసం విక్రయాలకు బ్రేక్..
- ప్రభుత్వ ఆసుపత్రిలో వ్యర్థాల సేకరణపై కొర్రీలు
- పరిపాలనలో భర్తల జోక్యంపై అసంతృప్తి..
- ఆరు నెలలైనా అభివృద్ధి పనులకు నిధుల్లేవంటూ కార్పొరేటర్ల ఆవేదన
- జనరల్ ఫండ్ టెండర్ల వ్యవహారంలో కొత్త కమిషనర్ రాకతో మరింత టెన్షన్
- ‘డైనమిక్ ఆఫీసర్’ అంటూ మంత్రి కోమటిరెడ్డి ప్రశంసలు
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్లో కొత్త కమిషనర్ వంశీకృష్ణ పనితీరు ఇప్పుడు రాజకీయ, అధికార వర్గాల్లో హాట్టాపిక్గా మారింది. కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన నెల రోజుల వ్యవధిలోనే పట్టణంలో పేరుకు పోయిన కొన్ని ప్రధాన సమస్యలపై దృష్టి సారించడం, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వ్యవహారాలపై కఠినంగా వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఫుట్పాత్ల ఆక్రమణలు, రోడ్లపై మాంసం విక్రయాలు, చెత్త సేకరణ, కార్యాలయంలో సిబ్బంది క్రమశిక్షణ, పరిపాలనా వ్యవహారాల్లో రాజకీయ జోక్యం వంటి అంశాల్లో కమిషనర్ తనదైన శైలిని ప్రదర్శిస్తున్నారని కార్పొరేటర్లు, రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
మేయర్ మాటకూ వెనక్కి తగ్గరా?
కొత్త కమిషనర్ వ్యవహారశైలిపై కార్పొరేటర్లలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఆయనను గతంలో పనిచేసిన కమిషనర్ రమణా చారి శిష్యుడిగా పేర్కొంటుండగా.. మరికొందరు మాత్రం వంశీకృష్ణ ఎవరి ఒత్తిళ్లకూ తలొగ్గకుండా విధి నిర్వహణలో ముక్కుసూటిగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. మేయర్తో పాటు పలువురు కార్పొరేటర్లు చెప్పిన విషయాలను కూడా పరిపాలనా నిర్ణయాల్లో పరిగణనలోకి తీసుకోవడం లేదనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. అయితే అధికారికంగా మాత్రం కమిషనర్ తన నిర్ణయాలను నిబంధనల ప్రకారమే తీసుకుంటున్నారనే వాదన వినిపిస్తోంది. ఇటీవల సావర్కర్ నగర్ వద్ద జరిగిన కార్యక్రమంలో మంత్రి వెంకటరెడ్డి, మేయర్, కార్పోరేటర్లు హాజరుకాగా, అదే ప్రోగ్రాంకు వచ్చిన డెప్యూటీ మేయర్ కు కుర్చీ లేకపోవడం గురించి చర్చకు వచ్చింది. మున్సిపల్ అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదనే అక్కడే అధికారుల పైన సీరియస్ అయినట్టు తెలిసింది.
ఫుట్‌పాత్‌పై మాంసం.. ‘నో ఛాన్స్’
పట్టణంలోని ఫుట్పాత్లు, రోడ్ల పక్కన మాంసం విక్రయించే దుకాణాలపై కమిషనర్ దృష్టి సారించడం ప్రస్తుతం ప్రధాన చర్చగా మారింది. రోడ్లపై మాంసం విక్రయించడంతో పాటు అక్కడే జంతువులను వధించడాన్ని అనుమతించబోమని, వ్యాపారులు సొంతంగా దుకాణాలు ఏర్పాటు చేసుకుని నిబంధనలకు అనుగుణంగా వ్యాపారం చేసుకోవాలని కమిషనర్ హెచ్చరించినట్లు సమాచారం. హెచ్చరికలను పాటించని కొన్ని విక్రయ కేంద్రాల వస్తుసామగ్రిని సీజ్ చేసినట్లు తెలిసింది. దీంతో మాంసం వ్యాపారులు కొందరు కార్పొరేటర్లను ఆశ్రయించినట్లు సమాచారం. విషయం కమిషనర్ దృష్టికి వెళ్లినప్పటికీ.. నిబంధనల ఉల్లంఘన విషయంలో వెనక్కి తగ్గేందుకు ఆయన సుముఖంగా లేరనే చర్చ జరుగుతోంది.
జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి చెత్తపై ‘నో’..
నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి వ్యర్థాల సేకరణ విషయంలోనూ కమిషనర్ నిర్ణయం వివాదానికి దారితీసినట్లు తెలుస్తోంది. సాధారణ మున్సిపల్ చెత్తతో పాటు ఆసుపత్రుల్లో ఉత్పత్తయ్యే బయోమెడికల్ వ్యర్థాలను కలిపి తరలించడానికి వీల్లేదనే నిబంధనల నేపథ్యంలో.. ఆసుపత్రి నుంచి మెడికల్ వ్యర్థాలను మున్సిపల్ సిబ్బంది సేకరించకూడదని కమిషనర్ సూచించినట్లు సమాచారం. సిరంజీలు, గ్లూకోజ్ బాటిళ్లు, శస్త్రచికిత్సలకు సంబంధించిన వ్యర్థాలు తదితర బయోమెడికల్ వ్యర్థాలను ప్రత్యేక వ్యవస్థ ద్వారా సేకరించి, శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అదే సమయంలో ప్రభుత్వ ఆసుపత్రి నుంచి మున్సిపల్ పన్ను వసూళ్ల అంశం కూడా ఈ వివాదంలో ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. కమిషనర్ నిర్ణయంపై మేయర్ జోక్యం చేసుకున్నప్పటికీ వినిపించుకోలేదని తెలిసింది. దీంతో కొందరు కార్పొరేటర్లు జిల్లా కలెక్టర్ను ఆశ్రయించగా ఆసుపత్రి నుంచి మళ్లీ వ్యర్థాల సేకరణ ప్రారంభమైందనే చర్చ జరుగుతోంది.
చిన్న తప్పుకూ చోటులేదా?
జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ విషయంలోనూ కమిషనర్ కఠినంగా వ్యవహరిస్తున్నారని కార్పొరేటర్లు చెబుతున్నారు. దరఖాస్తుల్లో నిబంధనలకు విరుద్ధంగా ఏ చిన్న లోపం కనిపించినా వాటిని తిరస్కరిస్తున్నారని, దీంతో కొంతమంది సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వారి వాదన. అయితే అధికారుల వాదన మాత్రం.. జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ అత్యంత కీలకమైన ప్రక్రియ కావడంతో నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సిందేనని అంటోంది.
మున్సిపల్ ఆఫీసులో పైరవీలకు చెక్!
మున్సిపల్ కార్యాలయంలో సాధారణ పరిపాలనా వ్యవహారాల్లో కార్పొరేటర్లు, పైరవీకారుల జోక్యం ఎక్కువైందనే ఆరోపణలు గతంలోనూ ఉన్నాయి. చిన్నచిన్న పనులకు కూడా రాజకీయ సిఫారసులు తీసుకురావడం, అధికారులపై ఒత్తిడి తీసుకురావడం వంటి పరిణామాలను అడ్డుకునే ప్రయత్నం కమిషనర్ చేస్తున్నారని సమాచారం. దీంతో ఇంతకాలం మున్సిపల్ కార్యాలయంలో సులభంగా సాగిన కొన్ని పైరవీలకు ఇప్పుడు బ్రేక్ పడిందనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ విభాగంలో అవినీతి ఆరోపణలు ఎప్పటి నుంచో వినిపిస్తున్న నేపథ్యంలో.. ఈ విభాగంపైనా కమిషనర్ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
భర్తల పెత్తనం పైన కమిషనర్ గుస్సా..?
కొత్త కమిషనర్ కఠినంగా వ్యవహారిస్తున్న నేపథ్యంలో కార్పోరేటర్లు సైతం ఆచితూచి వ్యవహారిస్తున్నారు. ముఖ్యంగా మహిళా కార్పోరేటర్ల భర్తలు మరింత అప్రమత్తంగా వ్యవహారించాల్సి వస్తోంది. డివిజన్లలో సమస్యల గురించి, పనులు, పైరవీల కోసం మహిళా కార్పోరేటర్ల బదులు వాళ్ల భర్తలు జోక్యం చేసుకోవడం కమిషనర్ కు అస్సలు నచ్చడం లేదని సమాచారం. మున్సిపల్ సిబ్బంది, పరిపాలన వ్యవహారాల్లో భర్తలు జోక్యం మితిమీరిపోయిందని, కమిషనర్ తో సహా, ఆఫీసులోని సిబ్బందికి కార్పోరేటర్ల భర్తలు ఫోన్లు చేయడం ఇబ్బందికరంగా మారింది. కమిషనర్ వ్యవహారాల్లోనూ ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవడంతో పాలనపరమైన చిక్కులు వస్తున్నాయని చెప్తున్నారు. గతంలో అధికారులను సంప్రదించి తమ డివిజన్ల సమస్యలు, వ్యక్తిగత అభ్యర్థనలు పరిష్కరించుకునే అవకాశం ఉండేదని.. ఇప్పుడు ప్రతి అంశం నిబంధనల పరిధిలోనే ఉండటంతో రాజకీయ సిఫారసులకు అంతగా అవకాశం లేకుండా పోయిందని కొందరు కార్పొరేటర్లు ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నట్లు సమాచారం.
కౌన్సిల్ మీటింగ్‌కు బ్రేక్ ఎందుకు?
కార్పొరేషన్ పాలకవర్గం ఏర్పడిన తర్వాత వరుసగా నెలవారీ సమావేశాలు నిర్వహిస్తూ వచ్చినప్పటికీ.. గత నెల సమావేశం జరగకపోవడం కూడా చర్చనీయాంశంగా మారింది. గత సమావేశంలో కొందరు కార్పొరేటర్లు బహిరంగంగా వాగ్వాదానికి దిగిన దృశ్యాలు మీడియాలో వైరల్ కావడంతో కార్పొరేషన్ ప్రతిష్ట దెబ్బతిన్నదనే అభిప్రాయం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో ఇకపై ప్రతి నెలా కాకుండా రెండు, మూడు నెలలకు ఒకసారి సమావేశం నిర్వహించే ఆలోచన ఉందనే ప్రచారం జరుగుతోంది.
‘నయాపైసా ఆదాయం లేదు’.. కార్పొరేటర్ల ఆవేదన
మరోవైపు పాలకవర్గం ఏర్పడి ఆరు నెలలు గడుస్తున్నా తమ డివిజన్లలో అభివృద్ధి పనుల కోసం తగిన నిధులు అందడం లేదని పలువురు కార్పొరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్లగొండలో సుమారు రూ.2 వేల కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెబుతున్నప్పటికీ.. ఆ అభివృద్ధి పనుల్లో తమ డివిజన్ల కు దక్కుతున్న వాటా ఏమిటో స్పష్టంగా తెలియడం లేదని కొందరు కార్పొరేటర్లు అంటున్నారు. ఆరు నెలల కాలంలో జనరల్ ఫండ్ కింద డివిజన్ కు రూ.10 లక్షల మేర కేటాయింపులు జరిగినప్పటికీ.. వాటికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ ముందుకు సాగకపోవడంతో పనులు ప్రారంభం కాలేదనే అసంతృప్తి వారిలో ఉంది.
26 డివిజన్లలో టెండర్లు ఆగమాగం?
దాదాపు 26 డివిజన్లకు సంబంధించిన పనుల్లో సింగిల్ టెండర్లు దాఖలైనట్లు కార్పొరేటర్లు చెబుతున్నారు. కొన్ని డివిజన్ల పనులకు సూర్యాపేట కు చెందిన కాంట్రాక్టర్లు టెండర్లు దాఖలు చేశారని, దీంతో స్థానికంగా తమకు పనులు దక్కే అవకాశం తగ్గుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. కాంట్రాక్టర్లతో చర్చించి పోటీ నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్న సమయంలోనే కొత్త కమిషనర్ బాధ్యతలు స్వీకరించడంతో టెండర్ల వ్యవహారం మరింత క్లిష్టంగా మారిందనే చర్చ కూడా ఉంది.
‘డైనమిక్ ఆఫీసర్’ అంటూ మంత్రి ప్రశంసలు
ఇక కమిషనర్ వంశీకృష్ణ పనితీరుపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సానుకూలంగా స్పందించడం కూడా రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంచింది. ఇటీల నల్లగొండ పర్యటనలో భాగంగా వంశీ కృష్ణను డైనమిక్ ఆఫీసర్గా మంత్రి అభివర్ణించినట్లు తెలిసింది. ఈ పరిణామాల నేపథ్యంలో కమిషనర్ వైఖరి ఏరకంగా ఉంటుదనేది ప్రశ్నార్ధకమే. నల్లగొండ మున్సిపల్ కమిషనర్ల పనితీరు పైన గతంలోనే అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. రమణాచారి ఆధ్వర్యంలోనే నల్లగొండ పట్టణ రూపురేఖలు కాస్తంతా మారాయి. మళ్లీ వంశీకృష్ణ అదే దూకుడును ప్రదర్శిస్తున్న నేపథ్యంలో కార్పోరేటర్ల నుంచి సహకారం ఏవిధంగా ఉంటదనేది వేచిచూడాల్సిందే.