Breaking News: భావన ఆరోపణలన్నీ అవాస్తవం.. ఆమె ఇప్పటికీ మా ఉద్యోగే.. టెక్ మహీంద్రా సంచలన ప్రకటన

హైదరాబాద్ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: హైదరాబాద్లోని ప్రముఖ ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రా (Tech Mahindra) క్యాంపస్ ఎదుట సంస్థ ఉద్యోగిని ఆర్. భావన చేపట్టిన నిరసన మరియు ఆరోపణలపై కంపెనీ యాజమాన్యం అధికారికంగా స్పష్టతనిచ్చింది. భావన చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమని, ఆమెను ఉద్యోగం నుంచి తొలగించలేదని, ఇప్పటికీ ఆమె కంపెనీలో క్రియాశీలక ఉద్యోగిగానే కొనసాగుతున్నారని యాజమాన్యం స్పష్టం చేసింది.

కేవలం మూడు రోజులు సెలవు తీసుకున్నందుకే ఉద్యోగం నుంచి తొలగించారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని, అసంపూర్తి సమాచారంతో ముగింపునకు రావద్దని కోరింది.

టెక్ మహీంద్రా తెలిపిన వివరాల ప్రకారం.. భావన 2026 మార్చి 26న కంపెనీలో చేరారు. తనను ఆకస్మికంగా ఉద్యోగం నుంచి తొలగించారంటూ జూలై 23న ఆమె కంపెనీ క్యాంపస్ వెలుపల బహిరంగ నిరసన చేపట్టారు.

ఉద్యోగంలోనే కొనసాగింపు: భావన ఇప్పటికీ క్రియాశీలక ఉద్యోగిగానే ఉన్నారు. జూలై 23నే ఈ విషయాన్ని ఆమెకు అధికారికంగా తెలియజేయడం జరిగిందని, జూలై నెలకు సంబంధించిన జీతం కూడా యథావిధిగా ప్రాసెస్ అయిందని కంపెనీ తెలిపింది.

27 రోజులు గైర్హాజరు: మార్చి 26న విధుల్లో చేరినప్పటి నుంచి జూలై 22 వరకు (నాలుగు నెలల కాలంలో) వారాంతాలు, సెలవు దినాలు కాకుండా ఆమె మొత్తం 27 రోజులు సెలవులో ఉన్నారు. ఇందులో 12 రోజులు ముందస్తు సమాచారంతో, 15 రోజులు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా గైర్హాజరయ్యారు. వ్యక్తిగత అత్యవసర పరిస్థితుల దృష్ట్యా కంపెనీ ఆమెకు సహకరించిందని పేర్కొంది.

వైద్య పత్రాల సమర్పణ: జూలైలో గైర్హాజరైన తర్వాత ఆఫీస్కు వచ్చి అవసరమైన వైద్య ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలని కోరినప్పటికీ స్పందించలేదు. విధులకు హాజరుకాకపోవడంతో ఉద్యోగం నుంచి వైదొలగాలని జూలై 22న సమాచారం పంపినప్పటికీ, ఆ నిర్ణయాన్ని అమలు చేయలేదని సంస్థ స్పష్టం చేసింది.

సమస్యలను అంతర్గతంగా పరిష్కరించుకునే మార్గాలు ఉన్నప్పటికీ, భావన విధుల్లో చేరడానికి సిద్ధంగా లేరని, కంపెనీ నుంచి ఆర్థిక పరిహారం (సెటిల్మెంట్) ఆశిస్తూ సోషల్ మీడియా ద్వారా ఒత్తిడి తెచ్చేందుకు నిరసన చేపట్టారని తెలిపింది.

ఉద్యోగులకు సురక్షితమైన, గౌరవప్రదమైన పని వాతావరణాన్ని అందించడానికి తమ సంస్థ కట్టుబడి ఉందని, ఈ సమస్యను తగిన అంతర్గత మరియు బాహ్య ప్రక్రియల ద్వారా సమగ్రంగా పరిశీలించి న్యాయబద్ధంగా పరిష్కరిస్తామని టెక్ మహీంద్రా స్పష్టం చేసింది.

Share
Share