- నల్లగొండలో ముదిరిన మెడికల్ కోల్డ్వార్
- పేషెంట్లను తెచ్చినోళ్లకు భారీ ఆఫర్లు
- ఆసుపత్రుల మధ్య ఆధిపత్య పోరు
- కమీషన్ల ఎరతో పేషెంట్లను లాక్కునే ప్రయత్నాలు
- అధికారుల దాడులతో బయటపడుతున్న అక్రమాల గుట్టు
- నల్లగొండలో ఐకాన్ వ్యవహారంతో మరోసారి రచ్చకెక్కిన వివాదం
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: ప్రైవేటు వైద్య రంగంలో పేషెంట్ల కోసం పోటీ తీవ్రంగా మారుతోంది. ఒకప్పుడు వైద్య సేవల నాణ్యత, వైద్యుల నైపుణ్యం, ఆసుపత్రిలోని సదుపాయాల ఆధారంగా పోటీ ఉండేది. ఇప్పుడు పేషెంట్లను ఎవరు తమ ఆసుపత్రికి తీసుకొస్తున్నారు? వారికి ఎంత ప్రోత్సాహకం ఇస్తున్నారు? అన్నదే కీలకంగా మారింది. పేషెంట్లను ఆసుపత్రులకు తీసుకొచ్చే వ్యక్తులు, రిఫరల్ నెట్వర్క్లు, కొందరు వైద్యులు, మధ్యవర్తులకు భారీ కమీషన్లు ఆఫర్ చేస్తున్నారు. పుట్టగొడుగుల్లా పెరుగుతున్న ప్రైవేటు ఆసుపత్రుల మధ్య ఆధిపత్య పోరు రోజురోజుకూ ముదురుతోంది. ఒక ఆసుపత్రి మరో ఆసుపత్రికి పోటీగా కొత్త సదుపాయాలు, ప్రత్యేక వైద్యులు, ప్యాకేజీలు, ఆఫర్లను ప్రకటిస్తుండగా.. పేషెంట్లను తమవైపు తిప్పుకునేందుకు కమీషన్ల వ్యవస్థ కూడా పనిచేస్తోంది. తాజాగా ఐకాన్ ఆసుపత్రిపై అధికారుల దాడులు, తనిఖీల నేపథ్యంలో ఈ వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది.
ఐకాన్‌తో మొదలైన పోటీ?
నల్లగొండలోకి ఐకాన్ ఆసుపత్రి ప్రవేశంతో ప్రైవేటు వైద్య రంగంలో పోటీ మరింత పెరిగిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కార్పొరేట్ తరహా వైద్య సేవలు, ఆధునిక సదుపాయాలు, హైదరాబాద్లో అందే కొన్ని ప్రత్యేక వైద్య సేవలను నల్లగొండలోనే అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయడం, ప్రభుత్వ మెడికల్ కాలేజీ సేవలు కూడా అందుబాటులోకి రావడంతో వైద్య రంగంలో పోటీ తీవ్రంగా మారిందని కొందరు డాక్టర్లు చెబుతున్నారు. అయితే ఐకాన్ ఆసుపత్రి మార్కెట్లోకి వచ్చాక పేషెంట్లను తీసుకొచ్చేవారికి భారీగా కమీషన్లు, ఆఫర్లు ప్రకటించిందన్న ఆరోపణలు పోటీ ఆసుపత్రుల వర్గాల్లో వినిపిస్తున్నాయి. పేషెంట్ను తీసుకొచ్చిన వ్యక్తికి 50 శాతం వరకు కమీషన్ ఇస్తున్నారన్న ఆరోపణలు కూడా ప్రచారంలో ఉన్నాయి.
కోట్లు పెట్టి.. పేషెంట్ల కోసం పోరు
నల్లగొండలో కొత్తగా ఏర్పాటు అవుతున్న ప్రైవేటు ఆసుపత్రుల్లో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. భారీ అంతస్తుల భవనాలు, అత్యాధునిక పరికరాలు, ఐసీయూ(ICU)లు, ఆపరేషన్ థియేటర్లు, ల్యాబ్లు, ప్రత్యేక వైద్య విభాగాలు ఏర్పాటు చేస్తున్నారు. కానీ పెట్టుబడి పెట్టిన తర్వాత పేషెంట్లను రాబట్టడం పెద్ద సవాల్గా మారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కమీషన్లు, రిఫరల్ వ్యవస్థలు పేషెంట్లను ఒక ఆసుపత్రి నుంచి మరో ఆసుపత్రికి మళ్లించే పరిస్థితి తెస్తున్నాయని కొందరు డాక్టర్లు ఆరోపిస్తున్నారు. దీంతో వైద్య సేవలపై పోటీ కాకుండా ‘పేషెంట్ ఎవరిది?’ అన్న పోటీగా మారుతోందని అంటున్నారు.
ఒక డాక్టర్.. నాలుగైదు ఆసుపత్రులు!
నల్లగొండలో మరో విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. సొంతంగా ఆసుపత్రి నిర్వహిస్తున్న కొందరు స్పెషలిస్టులే నగరంలోని ఇతర ఆసుపత్రుల్లో కూడా విజిటింగ్ కన్సల్టెంట్లుగా సేవలు అందిస్తున్నారు. ఒకే డాక్టర్ నాలుగైదు ఆసుపత్రుల్లో విజిటింగ్ డాక్టర్గా ఉండటం ఇక్కడ సాధారణంగా మారిందన్న చర్చ ఉంది. నల్లగొండతో పాటు మిర్యాలగూడ, దేవరకొండకు వెళ్లి కూడా స్పెషలిస్టుల పేరుతో వైద్య సేవలు అందిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దీంతో పేషెంట్కు ఏ ఆసుపత్రిలో ఏ డాక్టర్ అందుబాటులో ఉంటారు? ఒకే డాక్టర్ ఎన్ని ఆసుపత్రుల్లో సేవలు అందిస్తున్నారు? అన్నది కూడా సాధారణ ప్రజలకు అంతుచిక్కని పరిస్థితిగా మారుతోంది.
బోర్డుపై డాక్టర్.. వార్డులో కనిపించడు!
కొన్ని ఆసుపత్రుల్లో బోర్డులపై ప్రముఖ స్పెషలిస్టుల పేర్లు కనిపిస్తున్నా.. అవసరమైన సమయంలో ఆ డాక్టర్లు ఆసుపత్రిలో అందుబాటులో ఉండటం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. విజిటింగ్ డాక్టర్ల వ్యవస్థ పెరగడంతో పేషెంట్లకు అసలు డాక్టర్ ఎవరు? బాధ్యత వహించే వైద్యుడు ఎవరు? అన్న విషయంలో గందరగోళం ఏర్పడుతోందన్న విమర్శలు ఉన్నాయి. ప్రత్యేకించి అత్యవసర పరిస్థితుల్లో డాక్టర్లు అందుబాటులో ఉండటం కీలకం.
కులాల పేరుతో ఆధిపత్యం?
నల్లగొండలో కొన్ని సామాజిక వర్గాల ఆధిపత్యం పెరిగిందన్న చర్చ కూడా డాక్టర్లలో వినిపిస్తోంది. రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య తదితర సామాజిక వర్గాలకు చెందిన పలువురు డాక్టర్లు సిండికేట్ గా మారి ఆసుపత్రులు స్థాపించడం, అదే ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్లు మళ్లీ సొంతంగా ఆసుపత్రులు ఏర్పాటు చేసుకోవడం జరుగుతోందని చెబుతున్నారు. అయితే కులాల ఆధారంగా వైద్య రంగాన్ని విభజించడం సరైనది కాదని మరో వర్గం డాక్టర్లు అంటున్నారు. వైద్య వృత్తితో నేరుగా సంబంధం లేని కొందరు ఫైనాన్షర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా భారీగా పెట్టుబడులు పెట్టి ఆసుపత్రుల నిర్వహణలోకి వస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వీరు వివిధ ప్రాంతాల నుంచి విజిటింగ్ డాక్టర్లను తీసుకొచ్చి వైద్య సేవలు అందిస్తున్నారని చెబుతున్నారు. చైనా, రష్యా, సింగపూర్లో చదివిన మెడిసన్ కు అసలు విలువలేదని, అదంతా బోగస్ అని ప్రచారం కూడా నడుస్తోంది.
గతం నుంచి నేర్వని గుణపాఠం..
ప్రైవేటు ఆసుపత్రుల వ్యవహారంలో కరోనా కాలం ఒక కీలక మలుపుగా నిలిచింది. కరోనా సమయంలో నల్లగొండలోని రివర్ నిమ్స్ ఆసుపత్రిపై కూడా అధిక ఫీజులు, పేషెంట్ల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తు న్నారన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో అప్పటి ఎస్పీ ఏవీ రంగనాథ్ ప్రైవేటు ఆసుపత్రుల వ్యవహారంపై కఠినంగా వ్యవహరించారు. ఆసుపత్రులపై తనిఖీలు నిర్వహించి ఫీజుల వసూళ్లపై దృష్టి సారించారు. దీని తర్వాత ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్సకు సంబంధించిన ఫీజుల వివరాలను నోటీసు బోర్డులపై ప్రదర్శించే విధానం మరింతగా అమల్లోకి వచ్చింది.

అపర్ణ ఆసుపత్రి వ్యవహారం
రెండేళ్ల క్రితం అపర్ణ ఆసుపత్రికి సంబంధించిన రేడియాలజీ వ్యవహారం కూడా అధికారుల తనిఖీలకు దారితీసింది. రేడియాలజీ సేవలకు సంబంధించి అర్హతలు, సర్టిఫికెట్ల విషయంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. రేడియాలజీ సేవలకు సంబంధించిన అంశంలో నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారం వెలుగులోకి వచ్చిందన్న ఆరోపణలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. అనంతరం ఆసుపత్రి పేరు బోర్డులో రేడియాలజీ అనే పదాన్ని తొలగించినప్పటికీ స్కానింగ్ సేవలు కొనసాగుతున్నాయి. ఈ వ్యవహారంపై అధికారులు అప్పట్లో తీసుకున్న చర్యలు, ప్రస్తుతం ఆ ఆసుపత్రిలో పరిస్థితి ఏమిటన్నదీ మరోసారి పరిశీలించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఆర్ఎంపీ(RMP)లపై కూడా ‘వైద్య పోరు’
దేవరకొండ రోడ్డులో ఆర్ఎంపీలు సొంతంగా ఆసుపత్రులు ఏర్పాటు చేసి, విజిటింగ్ డాక్టర్లను తీసుకొచ్చి వైద్య సేవలు అందిస్తున్నారన్న అంశం కూడా గతంలో వివాదంగా మారింది. అర్హతలు, అనుమతులు లేని వారు వైద్య సేవలు అందిస్తున్నారన్న ఆరోపణలతో కొందరు ఆర్ఎంపీలపై పోలీసు కేసులు నమోదయ్యాయి. అయితే ఈ వ్యవహారం వెనుక కూడా ప్రైవేటు ఆసుపత్రుల మధ్య పోటీ ఉందన్న ఆరోపణలు అప్పట్లో వినిపించాయి. ఒక వర్గం మరో వర్గంపై అధికారులకు ఫిర్యాదులు చేయడం, పోలీసు కేసుల వరకు వెళ్లడం వైద్య రంగంలో ‘కోల్డ్వార్’ ను బయటపెట్టిందన్న చర్చ జరిగింది.
ఐకాన్ దాడితో మళ్లీ తెరపైకి ‘కోల్డ్వార్’
తాజాగా ఐకాన్ ఆసుపత్రిపై అధికారుల దాడులు, తనిఖీలు జరగడంతో ప్రైవేటు ఆసుపత్రుల మధ్య ఉన్న పోటీ మరోసారి బహిర్గతమైంది. ఒక ఆసుపత్రిపై వచ్చిన ఆరోపణలపై అధికారులు ఎంత వరకు చర్యలు తీసుకుంటారనేది వేచిచూడాల్సిందే. సాధారణంగా గుండె, న్యూరాలజీ, కిడ్నీ, లివర్ వంటి అత్యంత సున్నితమైన విభాగాల్లో చికిత్స పొందే పేషెంట్లలో మరణాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే చిన్నపిల్లల ఆసుపత్రులు, ఇతర సాధారణ వైద్య విభాగాల్లో చోటుచేసుకునే మరణాలు, చికిత్సకు సంబంధించిన ఫిర్యాదులు కూడా ఇప్పుడు ప్రజల్లో అనుమానాలకు తావిస్తున్నాయి.
అధికారులపై కూడా ఆరోపణలే!
ప్రైవేటు ఆసుపత్రులపై అధికారులు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తే చాలా సమస్యలను ముందుగానే గుర్తించవచ్చని సీనియర్ డాక్టర్లు సూచిస్తున్నారు. అయితే కొన్ని ఆసుపత్రుల నుంచి అధికారులకు ముడుపులు అందుతున్నాయన్న ఆరోపణలు గతంలో వినిపించాయి. గతంలో అపర్ణ ఆసుపత్రి వ్యవహారంలోనూ కేసును నీరుగార్చేందుకు ప్రయత్నాలు జరిగాయన్న విమర్శలు వచ్చాయని కొందరు గుర్తు చేస్తున్నారు. అయితే ఇలాంటి ఆరోపణలకు ఆధారాలు ఉంటేనే వాటిని అధికారులు విచారించి వాస్తవాలను బయటపెట్టాల్సి ఉంటుంది. తాజాగా ఐకాన్ ఆసుపత్రి వ్యవహారంలోనూ ఎలాంటి ఒత్తిళ్లు, రాజీలు లేకుండా నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. నల్లగొండలోని ప్రతి ప్రైవేటు ఆసుపత్రిపై సమగ్ర తనిఖీలు నిర్వహించాల్సిన అవసరం ఉందని, ఆసుపత్రి అనుమతులు, డాక్టర్ల అర్హతలు, విజిటింగ్ డాక్టర్ల వివరాలు, రేడియాలజీ, ల్యాబొరేటరీల అనుమతులు, ఐసీయూ, అత్యవసర వైద్య సేవలు, ఫీజుల వసూళ్లు, పేషెంట్లకు ఇచ్చే బిల్లులు, రిఫరల్ వ్యవస్థ.. అన్నింటినీ పరిశీలించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.