- నేర నియంత్రణలో నల్లగొండ నంబర్ వన్
- క్రైమ్ పారామీటర్లలో 8 కీలక అంశాల్లో ఉత్తమ పనితీరు..
- క్లస్టర్–3లో అగ్రస్థానం
- డీజీపీ సీవీ ఆనంద్ చేతుల మీదుగా ఎస్పీకి ప్రశంసాపత్రం..
- సమష్టి కృషికి దక్కిన గౌరవం
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నేర నియంత్రణ.. కేసుల దర్యాప్తు.. నేరస్తులపై నిఘా.. ప్రజలకు మెరుగైన పోలీసింగ్.. ఇలా పోలీసింగ్లో కీలకమైన ప్రతి అంశాన్నీ సమర్థంగా అమలు చేస్తూ నల్లగొండ జిల్లా పోలీస్ శాఖ రాష్ట్రస్థాయిలో సత్తా చాటింది. క్రైమ్ పారామీటర్ల అమలులో 8 కీలక అంశాల్లో అత్యుత్తమ పనితీరు కనబరిచి క్లస్టర్–3లో నల్లగొండ జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. ఈ మేరకు రాష్ట్రస్థాయి సమీక్షలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్కు డీజీపీ సీవీ ఆనంద్ ప్రశంసాపత్రం అందజేశారు.
నాయకత్వానికి నిదర్శనం
జిల్లా పోలీస్ శాఖ సాధించిన ఈ విజయానికి ఎస్పీ శరత్ చంద్ర పవార్ నాయకత్వం ప్రధాన బలంగా నిలిచింది. నేరాల నియంత్రణతో పాటు కేసుల దర్యాప్తు వేగం, పెండింగ్ కేసుల పరిష్కారం, నేరస్తులపై నిరంతర నిఘా, క్షేత్రస్థాయిలో పోలీసింగ్ పర్యవేక్షణపై ఆయన ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఇటీవల కూడా పోలీస్ స్టేషన్ల తనిఖీల సందర్భంగా పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని, దర్యాప్తులో నాణ్యత ప్రమాణాలు పాటించాలని అధికారులను ఆదేశించారు.
కేసుల ఛేదనలో వేగం
ఇటీవలి కాలంలో సంచలనం సృష్టించిన పలు కేసులను నల్లగొండ పోలీసులు వేగంగా ఛేదించడం కూడా శాఖ పనితీరుకు అద్దం పడుతోంది. మిర్యాలగూడలో ముగ్గురు సజీవ దహనమైన ఘటన తొలుత ప్రమాదంగా భావించినప్పటికీ.. సీసీ కెమెరాలు, ఫోరెన్సిక్ ఆధారాలు, సాంకేతిక సమాచారం, రూట్ మ్యాపింగ్ వంటి శాస్త్రీయ ఆధారాలను విశ్లేషించి అది పక్కా హత్యగా పోలీసులు తేల్చారు. నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారు.
అలాగే నల్లగొండలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి హత్య కేసులోనూ పోలీసులు వేగంగా దర్యాప్తు చేపట్టి నలుగురు నిందితులను అరెస్టు చేశారు. కేసులో నగదు, బంగారం, వాహనం, హత్యకు ఉపయోగించిన ఆయుధంతో పాటు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
ఇటీవల ఉపాధ్యాయురాలు రూపారెడ్డి హత్య కేసును కూడా ప్రత్యేక బృందాలు శాస్త్రీయ ఆధారాలతో ఛేదించాయి. ఎస్పీ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు రాత్రింబవళ్లు పనిచేసి నిందితులను గుర్తించాయి.
ప్రజల వద్దకే పోలీసింగ్
నేర నియంత్రణతో పాటు ప్రజలకు పోలీస్ శాఖను మరింత చేరువ చేయడంపైనా ఎస్పీ పవార్ దృష్టి పెట్టారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం ఉండకూడదని, బాధితులకు వేగంగా న్యాయం అందించాలని అధికారులను ఆదేశిస్తున్నారు. ఇటీవల నిర్వహించిన గ్రీవెన్స్ డేలో 36 అర్జీలను స్వీకరించి వాటిపై తక్షణ చర్యలకు ఆదేశాలు జారీ చేశారు.
గ్రామస్థాయిలోనూ పోలీసింగ్ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నారు. నేరాల నియంత్రణలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాల ద్వారా ప్రజలతో నేరుగా మమేకమై అనుమానాస్పద వ్యక్తులు, కార్యకలాపాలపై సమాచారం సేకరించే విధానానికి ప్రాధాన్యం ఇస్తున్నారు.
గణాంకాల్లోనూ మెరుగైన ఫలితాలు
2025లో నల్లగొండ జిల్లాలో మొత్తం నేరాల సంఖ్య 2024తో పోలిస్తే తగ్గింది. 2024లో 8,834 కేసులు నమోదుకాగా.. 2025లో 8,493కు తగ్గినట్లు జిల్లా పోలీస్ శాఖ వెల్లడించింది. నేర నియంత్రణ, మహిళలు–చిన్నారుల రక్షణ, సైబర్ నేరాల నియంత్రణ, ఆస్తి నేరాల కట్టడి, మాదకద్రవ్యాల నియంత్రణ, రోడ్డు భద్రత వంటి అంశాల్లోనూ పురోగతి సాధించినట్లు అప్పట్లో వెల్లడించారు.
సమష్టి కృషికి ప్రశంస
క్లస్టర్–3లో నల్లగొండకు అగ్రస్థానం రావడంతో పోలీస్ శాఖలోని అధికారులు, సిబ్బంది సమష్టి కృషికి గుర్తింపు లభించినట్లైంది. అదనపు ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు, కానిస్టేబుళ్లు.. ఇలా క్షేత్రస్థాయి నుంచి ఉన్నతస్థాయి వరకు అందరి సమన్వయంతోనే ఈ ఫలితం సాధ్యమైందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్రస్థాయి సమీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీస్ యూనిట్లను డీజీపీ సీవీ ఆనంద్ అభినందించారు. నల్లగొండ క్లస్టర్–3లో టాప్ పెర్ఫార్మర్గా నిలవడం.. జిల్లా పోలీసింగ్లో తీసుకొస్తున్న మార్పులకు మరో గుర్తింపుగా నిలిచింది.