- బంధుత్వాన్నే మరిచిన దారుణం.. డబ్బు కోసం ఒకే కుటుంబాన్ని ఊచకోత
- యూట్యూబ్లో ప్లాన్.. ఇంట్లోకి చొరబడి నలుగురి హత్య..
- నల్గొండలో నాలుగు హత్యల కేసు..
- బంధువులే హంతకులని తేల్చిన పోలీసులు
- నలుగురు నిందితుల అరెస్ట్, రూ.3 లక్షల నగదు,
- కరిగించిన బంగారం, కారు సహా కీలక ఆధారాలు స్వాధీనం
- అప్పు వివాదం నుంచి నాలుగు హత్యల వరకు.. వీడిని మిస్టరీ
నల్లగొండ, ఏపీబీ న్యూస్: నల్గొండ పట్టణంలోని తెలంగాణ కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని దారుణంగా హత్య చేసిన కేసును పోలీసులు కేవలం మూడు రోజుల్లోనే ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడితో పాటు మొత్తం నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ శుక్రవారం మీడియాకు తెలిపారు. ఈనెల 22న తెలంగాణ కాలనీలోని ఓ ఇంట్లో హసీనా, ఆమె భర్త సుల్తాన్, పిల్లలు మహ్మద్ ముజమిల్, అప్సర మృతదేహాలు కుళ్లిన స్థితిలో లభ్యమవడంతో పోలీసులు ప్రత్యేక దర్యాప్తు చేపట్టారు. డీఎస్పీ కె. శివరాం రెడ్డి ఆధ్వర్యంలో ఏడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాలు, క్లూస్ టీం సహాయంతో దర్యాప్తు నిర్వహించారు.
డబ్బు కోసం హత్యలు..
దర్యాప్తులో హసీనా బంధువులైన సయ్యద్ అస్లాం, అతని భార్య తబస్సుం, స్నేహితుడు మహమ్మద్ సోహైల్, జ్యువెలరీ వ్యాపారి హేమంత్ కుమార్ ఈ నేరంలో పాల్పడినట్లు తేలింది. వ్యక్తిగత కక్షలు, ఆర్థిక ఇబ్బందులు, డబ్బు మరియు బంగారు ఆభరణాలపై ఆశతో కుట్రపూరితంగా ఈ హత్యలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసుల వివరాల ప్రకారం, అప్పుల బాధతో ఉన్న అస్లాం గతంలో హసీనా వద్ద అప్పు తీసుకుని, మరోసారి డబ్బు అడగగా ఆమె నిరాకరించడం, పాత అప్పు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేయడం వల్ల కక్ష పెంచుకున్నాడు. అలాగే ఇంట్లో నగదు, బంగారం ఉందనే సమాచారం తెలుసుకుని హత్యకు పథకం రచించాడు. ఇందుకోసం యూట్యూబ్లో హత్య చేసి ఎలా తప్పించుకోవాలనే వీడియోలు కూడా చూసినట్లు విచారణలో ఒప్పుకున్నాడు.
జూన్ 20న మర్డర్..
జూన్ 20 తెల్లవారుజామున ఇంట్లోకి చొరబడి హసీనా, సుల్తాన్, ముజమ్మిల్లను కత్తితో హత్య చేసిన అస్లాం, తనను గుర్తించే అవకాశం ఉందని భావించి మంచం కింద దాక్కున్న 12 ఏళ్ల అప్సరను కూడా హత్య చేశాడు. అనంతరం ఇంట్లోని ఐదు తులాల బంగారం, నగదు, భూమి, బ్యాంకు పత్రాలను దోచుకుని హైదరాబాద్కు పారిపోయాడు. దోచుకున్న బంగారాన్ని దిల్సుఖ్నగర్లోని ఓ జ్యువెలరీ దుకాణంలో తాకట్టు పెట్టి రూ.5.30 లక్షలు పొందినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి మహీంద్రా మరాజో కారు, రూ.3 లక్షల నగదు, హత్యకు ఉపయోగించిన కత్తి, మూడు సెల్ఫోన్లు, ఐదు తులాల కరిగించిన బంగారు ముద్ద, ల్యాండ్ డాక్యుమెంట్లు, బ్యాంకు పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును వేగంగా ఛేదించిన డీఎస్పీ కె. శివరాం రెడ్డి, సీఐలు, ఎస్సైలు, సీసీఎస్ బృందం సభ్యులను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రత్యేకంగా అభినందించి రివార్డులు ప్రకటించారు.