- నియోజకవర్గం వ్యాప్తంగా 50 వేల మంది రాక
నల్లగొండ, ఏపీబీ న్యూస్: నల్లగొండలో ఆదివారం నిర్వహించనున్న సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభను విజయవంతం చేయాలని మేయర్ బుర్రి చైతన్య కోరారు. శుక్రవారం నల్లగొండలో మంత్రి క్యాంప్ ఆఫీసులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. నియోజకవర్గ వ్యాప్తంగా జనసమీకరణ చేసేందుకు కనగల్, నల్లగొండ, తిప్పర్తి మండలాల పార్టీ ముఖ్యనాయకులతో సమావేశం నిర్వహించారు.
అనంతరం జరిగిన సమావేశంలో మేయర్ మాట్లాడుతూ.. నియోజకవర్గ వ్యాప్తంగా 50 వేల మందిని తరలివచ్చేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఈ సభలో మహిళా స్వయం సహాయక సంఘాలకు చెక్కులు పంపిణీ చేస్తారని, ఇటీవల మహిళలకు సీఎం రేవంత్ బస్సులు ఇవ్వడం జరిగిందని తెలిపారు. పట్టణంలో, నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధి, నల్లగొండలో తాగునీటి సమస్యను సమూలంగా పరిష్కరించే కార్యక్రమాలకు మంత్రి కోమటిరెడ్డి నడుంబిగించారని, ఆయనకు రిటర్న్ గిఫ్ట్ గా సీఎం సభను విజయవంతం చేయాలని కోరారు. మాజీ జడ్పీటీసీ గుమ్మల మోహన్ రెడ్డి మాట్లాడుతూ సీఎం సభ విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని, కార్యకర్తలు, నాయకులు బాధ్యత వహించి సభను సక్సెస్ చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో మాజీ జడ్పీటీసీ పాశం రాంరెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, అబ్బగోని రమేష్ గౌడ్, పాశం సంపత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.