- నల్లగొండ వేదికగా కోమటిరెడ్డి బ్రదర్స్ కలయికపై ఉత్కంఠ
- సీఎం రేవంత్ సభకు భారీ ఏర్పాట్లు
- రాజగోపాల్ రాక పై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ
- ఇప్పటి వరకు సీఎం సభలకు దూరంగా ఉన్న రాజగోపాల్
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి నల్లగొండ కేంద్ర బిందువుగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనే భారీ బహిరంగ సభకు జిల్లా యంత్రాంగం, కాంగ్రెస్ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాయి. మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జనసమీకరణ సాగుతోంది. అయితే సభ ఏర్పాట్ల కంటే ఎక్కువగా చర్చనీయాంశమవుతున్న అంశం ఒకటే.. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సభకు వస్తారా? చాలా కాలం తర్వాత అన్నదమ్ములు ఒకే వేదికపై కనిపిస్తారా? అనే ఉత్కంఠ కాంగ్రెస్ శ్రేణులతో పాటు రాజకీయ వర్గాల్లోనూ నెలకొంది.
సీఎం సభలకు దూరంగా రాజగోపాల్..
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నల్లగొండ వేదికగా జరిగిన కీలక ప్రభుత్వ కార్యక్రమాలన్నింటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ప్రభుత్వం తొలి ఏడాది సందర్భంగా నిర్వహించిన ప్రజాపాలన వేడుకలు, సన్నబియ్యం పంపిణీ, రేషన్ కార్డుల పంపిణీ వంటి ప్రధాన కార్యక్రమాలకు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేతృత్వం వహించారు. అధికారిక ఆహ్వానాలు అందినప్పటికీ రాజగోపాల్ మాత్రం ఈ కార్యక్రమాలకు దూరంగానే ఉన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నా.. రాజగోపాల్ మాత్రం హాజరు కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం రేవంత్ తొలి జన్మదిన వేడుకలను కూడా వెంకటరెడ్డి ఘనంగా నిర్వహించినా, ఆ కార్యక్రమానికీ ఆయన దూరంగానే ఉన్నారు.
బ్రహ్మణవెల్లంల వరకే.. సభకు మాత్రం దూరం
2024 డిసెంబరులో నల్లగొండలో జరిగిన ప్రజాపాలన వేడుకల సమయంలో రాజగోపాల్ రెడ్డి వైఖరి మరింత ఆసక్తికరంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి నార్కట్‌పల్లి మండలంలోని బ్రహ్మణవెల్లంల రిజర్వాయర్ వద్ద నీటి విడుదల కార్యక్రమానికి వచ్చినప్పుడు రాజగోపాల్ స్వయంగా స్వాగతం పలికి కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే అక్కడి నుంచి నల్లగొండలో జరిగిన ప్రధాన బహిరంగ సభకు మాత్రం హాజరుకాకుండానే వెళ్లిపోయారు. అప్పట్లో ఈ వ్యవహారం కాంగ్రెస్‌లో పెద్ద చర్చకు దారితీసింది.
హ్యామ్ రోడ్లపై తమ్ముడి వ్యాఖ్యలు.. రాజకీయ దుమారం
రోడ్లు, భవనాల శాఖ మంత్రి వెంకటరెడ్డి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న హ్యామ్ రోడ్ల ప్రాజెక్టుపై అసెంబ్లీలో రాజగోపాల్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. దేశంలో హ్యామ్(HAM) విధానం పూర్తిస్థాయిలో విజయవంతం కాలేదని, ప్రభుత్వం మరోసారి సమగ్రంగా అధ్యయనం చేయాలని ఆయన సూచించారు. అయినప్పటికీ మంత్రి వెంకటరెడ్డి తొలి విడతలో దాదాపు రూ.13 వేల కోట్ల పనులకు టెండర్లు పిలిపించి, రాష్ట్ర రోడ్ల అభివృద్ధికి నల్లగొండనే కేంద్రంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. కనగల్ వద్ద హ్యామ్ రోడ్లకు గుర్తుగా పైలాన్ నిర్మించగా, ఇప్పుడు అదే వేదికపై సీఎం చేతుల మీదుగా పనులు ప్రారంభం కానున్నాయి.
మంత్రి పదవి.. నిధుల వివక్షపై అసంతృప్తి
భువనగిరి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి విజయం సాధిస్తే మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చినా అది నెరవేర లేదన్న అసంతృప్తి రాజగోపాల్ లో ఇప్పటికీ కొనసాగుతుందనే చర్చ ఉంది. మరోవైపు మునుగోడు నియోజకవర్గానికి నిధుల కేటాయింపులో వివక్ష చూపుతున్నారని ఆయన పలుమార్లు బహిరంగంగానే విమర్శించారు. రోడ్లు, ఇతర అభివృద్ధి పనులకు నిధులు అందక కాంట్రాక్టర్లు పనులు నిలిపివేసిన విషయాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పెద్దగా ఫలితం కనిపించలేదనే అభిప్రాయం ఆయన వర్గాల్లో వినిపిస్తోంది.
రాజగోపాల్ వస్తే కొత్త జోష్..
రాజకీయంగా విభేదాలు ఉన్నాయనే ప్రచారం జరిగినా.. కోమటిరెడ్డి బ్రదర్స్‌కు ఉమ్మడి జిల్లాలో ఇప్పటికీ విశేషమైన ప్రజాదరణ ఉంది. నల్లగొండ లో జరిగిన ప్రతీక్ ఫౌండేషన్ క్రికెట్ టోర్నమెంట్ బహుమతి ప్రధానోత్సవానికి రాజగోపాల్ రెడ్డి హాజరవడంతో కాంగ్రెస్ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం కనిపించింది. మంత్రి వెంకటరెడ్డి అందుబాటులో లేకపోవడంతో అన్న తరఫున తమ్ముడు హాజరయ్యారని, ఇద్దరి మధ్య దూరం తగ్గుతోందనే ప్రచారం కూడా జరిగింది. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సభకు రాజగోపాల్ రెడ్డి హాజరైతే.. అది కేవలం ఒక సభకే పరిమితం కాకుండా కాంగ్రెస్‌లో ఐక్యతకు సంకేతంగా మారే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. నల్లగొండ వేదికగా కోమటిరెడ్డి బ్రదర్స్ ఒకే వేదికపై కనిపిస్తారా? అన్న ప్రశ్నకు ఆదివారం సమాధానం దొరకనుంది.