- బాధ్యులపై కఠిన చర్యలు తథ్యం
- అసెంబ్లీ ఎదుట జరిగిన దురదృష్టకర సంఘటనలు..
- సభాపతి కంటతడి పెట్టడంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర వేదన..
- ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా..
హైదరాబాద్ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: శాసనసభ సమావేశాల తొలిరోజు అసెంబ్లీ ప్రాంగణం వేదికగా చోటుచేసుకున్న దురదృష్టకర పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో కలిసి శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ని ఆయన ఛాంబర్లో పరామర్శించారు. సభాపతి పట్ల కొందరు సభ్యులు ప్రవర్తించిన తీరు, చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ ఆయనకు ధైర్యం చెప్పారు.
ప్రజాస్వామ్యం తలదించుకునే ఘటన – సీఎం ఆవేదన
సమావేశాల ప్రారంభం సందర్భంగా అసెంబ్లీ ఆవరణలో సభాపతిని లక్ష్యంగా చేసుకుని కొందరు సభ్యులు అసభ్యకరమైన పదజాలంతో దూషించడమే కాకుండా, విధి నిర్వహణలో ఉన్న అధికారులపై దాడులకు పాల్పడటం తీవ్రంగా కలచివేసిందని సీఎం పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులుగా ఉండి ఈ రకంగా వ్యవహరించడం తెలంగాణ సభ్య సమాజం తలదించుకునేలా ఉందని వ్యాఖ్యానించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు:
“శాసనసభ అత్యున్నత రాజ్యాంగ వేదిక. సభాపతి స్థానంలో ఉన్న వ్యక్తిని వ్యక్తిగతంగా దూషించడం, వారి కుటుంబ సభ్యులను లాగడం ప్రజాస్వామ్యానికి తీవ్ర విఘాతం.”
“ఈ ఘటనపై స్పీకర్ గారు సభా వేదికగా కంటతడి పెట్టుకోవడం నన్ను తీవ్రంగా కలచివేసింది. ప్రభుత్వం స్పీకర్ గారికి పూర్తి అండగా ఉంటుంది.”
“కూలకషంగా విచారణ జరిపి, ఈ అనాగరిక ప్రవర్తనకు ఒడిగట్టిన బాధ్యులపై చట్టపరంగా, శాసనసభా నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం.”
కంటతడి పెట్టిన స్పీకర్.. అండగా నిలిచిన ప్రభుత్వం
అసెంబ్లీ ఎదుట జరిగిన ఈ పరిణామాలను మీడియా, టీవీ ఛానెళ్లు ప్రముఖంగా ప్రసారం చేయడంతో పాటు సభలో స్పీకర్ భావోద్వేగానికి లోనైన దృశ్యాలు చూసి ముఖ్యమంత్రి తీవ్రంగా స్పందించారు. మంగళవారం శాసనసభకు రాగానే సీఎం నేరుగా స్పీకర్ ఛాంబర్కు వెళ్లి ఆయనను పరామర్శించి ఓదార్చారు. సభ గౌరవాన్ని, రాజ్యాంగ వ్యవస్థల ఉనికిని కాపాడటంలో ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడదని, శాసనసభ వేదికగా ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.