Breaking News: తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై పోలీసుల తోపులాట, సభ వాయిదా..

హైదరాబాద్ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే తీవ్ర ఉద్రిక్తతల మధ్య రణరంగంగా మారాయి. ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలపై నిరసన తెలిపేందుకు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు చేపట్టిన ప్రదర్శనను పోలీసులు అడ్డుకోవడంతో శాసనసభ ప్రాంగణం వద్ద తీవ్ర తోపులాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో పలువురు బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యేలు గాయపడటంతో పాటు, మహిళా ప్రజాప్రతినిధులపై పోలీసులు అమానుషంగా ప్రవర్తించారన్న ఆరోపణలు రాష్ట్ర రాజకీయంలో కార్చిచ్చు రేపాయి.

ఉదయం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు తన్నీరు హరీష్ రావు, జగదీష్ రెడ్డి నాయకత్వంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల టీషర్టులు ధరించి గన్ పార్క్లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించి ప్రొటెస్ట్ చేపట్టారు.

అమరవీరుల స్థూపం నుంచి ర్యాలీగా అసెంబ్లీకి బయలుదేరిన బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అసెంబ్లీ ప్రాంగణం వద్ద నిలిపివేశారు. నల్ల టీషర్టులతో అసెంబ్లీలోకి అనుమతించబోమని పోలీసులు స్పష్టం చేయడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో:

హరీష్ రావు, జగదీష్ రెడ్డిలకు గాయాలు: పోలీసుల నెట్టివేతతో మాజీ మంత్రులు హరీష్ రావు, గుంటకండ్ల జగదీష్ రెడ్డి కిందపడిపోవడంతో స్వల్ప గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన జగదీష్ రెడ్డిని చికిత్స నిమిత్తం నిమ్స్ (NIMS) ఆస్పత్రికి తరలించారు.

మహిళా ఎమ్మెల్యేలపై అమానుషం: మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గొంతు నొక్కి, జుట్టు పట్టుకుని లాగారని, అలాగే సత్యవతి రాథోడ్, సునీతా లక్ష్మారెడ్డిల చీరను పోలీసులు లాగారంటూ తీవ్ర ఆరోపణలు వచ్చాయి. సునీతా లక్ష్మారెడ్డి కంటతడి పెట్టడంతో వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారింది.

ఎమ్మెల్యేల ఆగ్రహం – అరెస్టులు: పోలీసుల వైఖరిపై పాడి కౌశిక్ రెడ్డి, సుధీర్ రెడ్డి, డాక్టర్ సంజయ్ కుమార్ తదితర ఎమ్మెల్యేలు విరుచుకుపడ్డారు. అనంతరం పోలీసులు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను అరెస్ట్ చేసి తెలంగాణ భవన్కు తరలించారు.

పోలీసు అధికారి క్షమాపణలు: మహిళా ఎమ్మెల్యేలతో ప్రవర్తించిన తీరుపై అక్కడే ఉన్న ఓ ఉన్నతాధికారి క్షమాపణలు చెప్పినట్లు సమాచారం.

అసెంబ్లీ వెలుపల చోటుచేసుకున్న ఈ ఉద్రిక్తతల ప్రభావం సభపైనా పడింది. సమావేశాలు ప్రారంభమైన పట్టుమని 10 నిమిషాలు కూడా నడవకుండానే సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్ సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. గంట గడిచినా సభ తిరిగి ప్రారంభం కాకపోవడంతో శాసనసభ వాతావరణం అనిశ్చితిగా మారింది.

తెలంగాణ భవన్లో ప్రథమ చికిత్స అనంతరం మాజీ మంత్రి హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి మీడియాతో మాట్లాడారు.

హరీష్ రావు: “ఇది శాసనసభనా లేక కౌరవ సభనా? రాష్ట్ర హోంమంత్రిగా పనిచేసిన సబితా ఇంద్రారెడ్డి గొంతు నొక్కి దాడి చేశారు. సునీతా లక్ష్మారెడ్డి చీర లాగారు. కేటీఆర్, కోవ లక్ష్మి గనక సమయానికి అడ్డుపడకపోయి ఉంటే సునీతమ్మ ఇనుప చువ్వలపై పడిపోయేది. మహిళలను అవమానించిన పోలీసులను సప్త సముద్రాలు దాటి దాక్కున్నా వదిలిపెట్టం.”

సబితా ఇంద్రారెడ్డి: “సునీతా లక్ష్మారెడ్డికో, నాకో జరిగిన అవమానం కాదు ఇది.. తెలంగాణ మహిళా సమాజానికే జరిగిన అవమానం. కేటీఆర్, హరీష్ రావు మమ్మల్ని రక్షించకపోయి ఉంటే బూటు కాళ్లతో తొక్కి పడేసేవాళ్లు. ప్రశ్నిస్తే గొంతు నొక్కడం ఏంటి? సీఎం రేవంత్ రెడ్డి వెంటనే మహిళలకు క్షమాపణ చెప్పాలి.”

సునీతా లక్ష్మారెడ్డి: “రైతుల, ప్రజల సమస్యలపై ప్రశ్నించడానికి వస్తే పోలీసులు ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తారా? రేవంత్ రెడ్డి పాలనలో మహిళా ప్రజాప్రతినిధులకే రక్షణ లేదు.”

Share
Share