APB News Exclusive: ఎపిసోడ్ -4: క్లబ్‌లో కాసుల గలగల.. రెడ్‌క్రాస్‌లో రక్తం విల విల!

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నల్లగొండ క్లబ్పై పాలకవర్గ పెద్దలకు ఉన్న ఆసక్తి.. రెడ్క్రాస్ సంస్థ పై కనిపించకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పదవులపై మోజు, ఆయాచిత లబ్ధిని ఆశించే కొందరు వ్యక్తులు ఒకేసారి రెండు కీలక పదవులపై ఏళ్ల తరబడి ఆధిపత్యం ప్రదర్శించడం అనుమానాలకు తావిస్తోంది. ఒకే వ్యక్తి లేదా వర్గం కీలక పదవులను తమ గుప్పిట్లో ఉంచుకోవాలనే ఆరాటం వెనుక అసలు ఉద్దేశం ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గత మూడు రోజులుగా నల్లగొండ క్లబ్లో తెరవెనుక జరుగుతున్న పరిణామాలు, పదవుల కోసం సాగుతున్న మంతనాలు పాలకవర్గ వర్గాల్లోనే కాకుండా పట్టణ ప్రజల్లోనూ చర్చకు దారితీస్తున్నాయి. సామాజిక సేవ లక్ష్యంగా పనిచేయాల్సిన సంస్థల కంటే.. క్లబ్ పదవులపైనే ఎందుకింత ఆసక్తి చూపుతున్నారన్న ప్రశ్న ఇప్పుడు హాట్టాపిక్గా మారింది. పదవులు, అధికారంతో పాటు వాటి ద్వారా లభించే ప్రయోజనాల కోసమే ఈ హడావుడి జరుగుతోందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

నల్లగొండ క్లబ్ వైస్ చైర్మన్ పదవికి ఎందుకింత క్రేజ్ అంటే.. దాని విలువ కోట్లలో ఉంటుందనే సమాధానమే ఠక్కున వినిపిస్తోంది. బార్ అండ్ రెస్టారెంట్, మనోరమ హోటల్ నుంచి వచ్చే అద్దెలు, క్లబ్ సభ్యుల నుంచి నెలనెలా వసూలు చేసే ఫీజులు, ముఖ్యంగా క్లబ్ సభ్యత్వం.. వెరసి క్లబ్ ఇన్కం ఏటా కోట్ల రూపాయల్లో ఉంటుందని చెబుతున్నారు. అయితే ఇందులో ఆదాయ, వ్యయ వివరాలన్నీ కార్యవర్గం గుప్పిట్లోనే ఉంటాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్లబ్ బైలాలోని కొన్ని లొసుగులను అడ్డంపెట్టుకుని జిల్లా కలెక్టర్ సంతకం లేకుండానే పాలకవర్గం నిధులు ఖర్చు చేస్తోందన్న ప్రచారం జరుగుతోంది. ఇటీవల క్లబ్పై నిర్మించిన అదనపు గదుల నిర్మా ణానికి సుమారు రూ.2.50 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. కార్యవర్గం రెండేళ్ల పాలన గడువు ఇటీవలే ముగిసింది. అప్పటి వరకు ఉన్న క్లోజింగ్ బ్యాలెన్స్ను పరిశీలిస్తే కేవలం రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు మాత్రమే ఉన్నట్లు చెబుతున్నారు. ఇన్నేళ్లుగా క్లబ్ ద్వారా సమకూరిన నిధులన్నీ క్లబ్ పిల్లర్లపై అదనంగా నిర్మించిన గదులకే ఖర్చు చేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. టెండర్లు పిలవకుండానే కార్యవర్గం ఏకపక్షంగా పనులు చేపట్టిందనే ఆరోపణలు ఉన్నప్పటికీ.. సభ్యుల్లో చాలామంది దీనిపై నోరుమెదపకపోవడం చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు.. క్లబ్ కార్యవర్గ సభ్యుల్లో వైస్ చైర్మన్తో సహా దాదాపు అందరూ హైదరాబాద్లో స్థిరపడినవారేనన్న వాదన ఉంది. హైదరాబాద్ కేంద్రంగా నివసిస్తూ.. నల్లగొండ క్లబ్ వ్యవహారాల్లో చక్రం తిప్పడం కొన్నేళ్ల నుంచి కొనసాగుతోందన్న విమర్శలు ఉన్నాయి.

ఇదే క్రమంలో క్లబ్ వైస్ చైర్మన్తో పాటు మరికొందరు కమిటీ సభ్యులు రెడ్ క్రాస్లోనూ కీలక పాత్రల్లో ఉండటం గమనార్హం. ముఖ్యంగా క్లబ్ వైస్ చైర్మన్, రెడ్క్రాస్ చైర్మన్ పదవులు ఒకే వ్యక్తి చేతిలో ఉండటం ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. అంతేకాదు.. పలువురు వైద్యులు, సమాజంలో పెద్ద మనుషులుగా గుర్తింపు ఉన్న మరికొందరు వ్యక్తులు రెడ్క్రాస్లో సభ్యులుగా కొనసాగుతుండగా.. అదే సమయంలో క్లబ్ వ్యవహారాల్లోనూ కీలకంగా ఉండటం ఎలా సాధ్యమన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకవైపు క్లబ్ పదవులు.. మరోవైపు రెడ్క్రాస్ బాధ్యతలు.. రెండింటినీ ఒకే వర్గం చుట్టూ కేంద్రీకరించడంలో ఆంతర్యం ఏమిటన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

నల్లగొండ మాజీ మున్సిపల్ చైర్మన్ పుల్లెంల వెంకట నారాయణ గౌడ్ను రెడ్క్రాస్ చైర్మన్ పదవి నుంచి తప్పించిన తర్వాత.. సంస్థలో అధికారికంగా ఎన్నికలు ఎప్పుడు జరిగాయో కూడా బయట ప్రపంచానికి తెలియని పరిస్థితి నెలకొందన్న విమర్శలు ఉన్నాయి. రెండేళ్లకోసారి జరగాల్సిన ఎన్నికలను లోపలే మమ అనిపించి, ఏకగ్రీవ తీర్మానాలతో గత 12 ఏళ్లుగా ఒకే కమిటీ కొనసాగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో రెడ్క్రాస్ సేవా కార్యక్రమాలు క్రమంగా క్షీణించాయన్న విమర్శలు ఉన్నాయి. రక్తదాన శిబిరాలు, ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాలు తగ్గిపోగా.. కొత్త సభ్యత్వాల నమోదు కూడా ఏళ్ల తరబడి నిలిచిపోయింది. రాష్ట్రం లోనే నల్లగొండ జిల్లాలో రెడ్క్రాస్ సభ్యత్వం తక్కువగా ఉండటంపై హైదరాబాద్లో జరిగిన సమావేశంలో రాష్ట్ర గవర్నర్ కమిటీపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. జిల్లా స్థాయిలో రెడ్క్రాస్ అధ్యక్షుడిగా వ్యవహరించాల్సిన జిల్లా కలెక్టర్ కూడా సంస్థ వ్యవహారాలపై గతంలో ఉన్నంతగా దృష్టి పెట్టకపోవడంతో కమిటీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి.

రెడ్క్రాస్లో బ్లడ్ అందుబాటులో ఉన్నప్పుడు ప్రైవేటు ఆ సుపత్రుల్లో రక్తం పేరుతో సాగుతున్న అక్రమ దందాకు కొంతమేర చెక్ పడేదన్న అభిప్రాయం ఉంది. అప్పట్లో రెడ్క్రాస్లో ఒక్కో యూనిట్ రక్తం రూ.500–600కే లభించేదని చెబుతున్నారు. అయితే రెడ్క్రాస్లో కావాలనే రక్తనిల్వలను తగ్గించి, నిల్వలు పెంచడం మానేసినప్పటి నుంచి ప్రైవేటు ఆసుపత్రుల్లో రక్తానికి డిమాండ్ పెరిగిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఒక్కో యూనిట్ రక్తాన్ని రూ.2 వేల వరకు విక్రయిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. నల్లగొండలో రక్తం పేరుతో ప్రైవేటు ఆసుపత్రుల్లో దందా జోరుగా సాగుతోందన్న ఆరోపణల నేపథ్యంలో.. రెడ్క్రాస్లో రక్తనిల్వలు ఎందుకు పెంచడం లేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా రెడ్క్రాస్ కమిటీలో సభ్యులుగా ఉన్న కొందరే కార్పొరేట్ ఆసుపత్రుల యజమానులుగా ఉండటం, వారి ఆసుపత్రుల్లో ఒక్కో యూనిట్ రక్తం రూ.2 వేల వరకు విక్రయిస్తున్నారన్న ఆరోపణలు రావడం మరింత చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు తమ ఆసుపత్రుల్లో రక్తానికి డిమాండ్ ఉండగా.. మరోవైపు రెడ్క్రాస్లో రక్తనిల్వలపై కమిటీ సభ్యులు నోరుమెదపకపోవడం వెనుక ఆంతర్యమేంటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సాధారణంగా 60–70 యూనిట్ల వరకు రక్తనిల్వలు ఉండాల్సిన చోట ప్రస్తుతం 10–15 యూనిట్లకు మించి ఉండటం లేదని తెలుస్తోంది. గ్రామాలు, పట్టణాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహించకపోవడంతో సంస్థ సేవలు నిర్వీర్యమయ్యే పరిస్థితికి చేరుకున్నాయని విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతం రక్తదానం చేసిన వారికి మాత్రమే రీప్లేస్మెంట్ పద్ధతిలో ఒక్కో యూనిట్కు రూ.1,050 చొప్పున రక్తం అందిస్తున్నట్లు సమాచారం.

హైదరాబాద్లో జరిగిన సమావేశంలో గవర్నర్ జోక్యం చేసుకుని సభ్యత్వాలపై ప్రశ్నించడంతో.. నల్లగొండలో రెడ్క్రాస్ సభ్యత్వ నమోదు మళ్లీ ప్రారంభించినట్లు తెలుస్తోంది. అప్పటి వరకు సంస్థలో సుమారు 400 మంది మాత్రమే సభ్యులుగా ఉండగా.. వారిలో చాలామంది సభ్యత్వ గడువు కూడా ముగిసిపోయినట్లు సమాచారం. కొత్త సభ్యులు చేరితే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఏర్పడుతుందనే ఉద్దేశంతోనే సభ్యత్వ నమోదును ఇన్నాళ్లూ నిలిపివేశారన్న ఆరోపణలు ఉన్నాయి. పాత సభ్యుల్లో తమకు అనుకూలంగా ఉన్నవారిని బుజ్జగించి, ఏకగ్రీవ ఆమోదాలతో కమిటీని కొనసాగిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సాధారణ సభ్యత్వ రుసుము రూ.200 కాగా.. దీనికి ఓటు హక్కు ఉంటుంది. క్రియాశీలక సభ్యత్వం రూ .1,000గా ఉండగా.. శాశ్వత సభ్యత్వం కూడా అందుబాటులో ఉన్నట్లు సమాచారం. గవర్నర్ ఆగ్రహం తర్వాత చాలా ఏళ్ల విరామంతో కొత్త సభ్యత్వాల నమోదు చేపట్టడంతో ప్రస్తుతం రెడ్క్రాస్లో సభ్యుల సంఖ్య వెయ్యికి పైగా చేరినట్లు తెలుస్తోంది. క్లబ్, రెడ్క్రాస్ వ్యవహారాల్లో నెలకొన్న పరిస్థితులపై జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా దృష్టి సారించి, నిబంధనల ప్రకారం ఎన్నికలు నిర్వహించి సంస్థల కార్యకలాపాలను గాడిలో పెట్టాలని పట్టణ ప్రజలు, సభ్యులు కోరుతున్నారు.

Share
Share