- ఏఐ, కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్‌పై గ్లోబల్ నిపుణుల మథనం!
- నాలుగు రోజుల పాటు సాగిన ఆరవ అంతర్జాతీయ సదస్సు..
- 200 పరిశోధనా పత్రాల ప్రదర్శన, పాల్గొన్న డిఆర్డిఓ, టాటా స్టీల్, ఐబిఎమ్ గ్లోబల్ దిగ్గజాలు!
హైదరాబాద్, ఏపీబీ న్యూస్: హైదరాబాద్‌లోని ప్రముఖ విద్యాలయం మహీంద్రా యూనివర్సిటీ వేదికగా ఆరవ అంతర్జాతీయ సదస్సు ‘ఎమర్జింగ్ టెక్నిక్స్ ఇన్ కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్’ (ICETCI 2026) అత్యంత వైభవంగా నిర్వహించబడింది. నాలుగు రోజుల పాటు సాగిన ఈ సదస్సులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధకులు, విద్యావేత్తలు, సాంకేతిక రంగానికి చెందిన ప్రముఖులు మరియు పరిశ్రమ నిపుణులు పాల్గొని కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్ (CI), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఆప్టిమైజేషన్, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి అధునాతన సాంకేతికతలపై విస్తృతంగా చర్చించారు.
200 నాణ్యమైన పరిశోధనా పత్రాల ప్రదర్శన
ఈ అంతర్జాతీయ సదస్సులో కఠినమైన సమీక్షా ప్రక్రియ ద్వారా ఎంపిక చేసిన దాదాపు 200 పరిశోధనా పత్రాలను ప్రతినిధులు ప్రదర్శించారు. భారత్, అమెరికా, జపాన్ సహా వివిధ దేశాలకు చెందిన 120కి పైగా సంస్థలు ఇందులో భాగస్వామ్యమయ్యాయి. డిజిటల్ ట్రస్ట్, హెల్త్‌కేర్, బ్రెయిన్–కంప్యూటర్ ఇంటరాక్షన్, ఫేక్ న్యూస్ / తప్పుడు సమాచార వ్యాప్తిని అరికట్టడం వంటి సామాజిక, పారిశ్రామిక సవాళ్లకు ఏఐ ద్వారా పరిష్కారాలను ఈ పరిశోధనలు వివరించాయి.
సదస్సులో పాల్గొన్న అంతర్జాతీయ ప్రముఖులు
ప్రారంభ మరియు వివిధ సాంకేతిక సమావేశాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన దిగ్గజాలు పాల్గొని తమ మార్గదర్శకాన్ని అందించారు:
- డాక్టర్ సతీష్ రెడ్డి: మాజీ చైర్మన్ – DRDO, మాజీ డైరెక్టర్ జనరల్ – మిసైల్స్ అండ్ స్ట్రాటజిక్ సిస్టమ్స్.
- ప్రొఫెసర్ దేవాశిష్ భట్టాచార్జి: మాజీ వైస్ ప్రెసిడెంట్ (రీసెర్చ్, టెక్నాలజీ & న్యూ మెటీరియల్స్) – టాటా స్టీల్ గ్లోబల్.
- డాక్టర్ ఎల్. వెంకట సుబ్రహ్మణ్యం: సీఈఓ – క్యూబిట్ ఫోర్స్ క్వాంటమ్, మాజీ హెడ్ – ఐబిఎమ్ క్వాంటమ్ ఇండియా.
- ప్రొఫెసర్ కళ్యాణ్‌మోయ్ దేబ్: ఎండౌడ్ షెల్బీ డిస్టింగ్విష్డ్ ప్రొఫెసర్ – యూనివర్సిటీ ఆఫ్ అలబామా (USA).
- సైమన్ సీ: గ్లోబల్ హెడ్ – NVIDIA AI టెక్నాలజీ సెంటర్ (సింగపూర్).
- పంకజ్ దయామా: సీనియర్ మేనేజర్ (AI for Industry 4.0) – IBM రీసెర్చ్.
- ప్రదీప్ కుమార్ జిలగం: డైరెక్టర్ (సిస్టమ్స్ ఆర్కిటెక్చర్) – మైక్రాన్ టెక్నాలజీ.
- ప్రొఫెసర్ శాలభ్ భట్నాగర్: ప్రొఫెసర్ (కంప్యూటర్ సైన్స్) – ఐఐఎస్సీ బెంగళూరు (IISc).

దిగ్గజాల కీలక వ్యాఖ్యలు:
ప్రొఫెసర్ దేవాశిష్ భట్టాచార్జి: “కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్ అనేది కేవలం ఒక పరిశోధనా విభాగానికే పరిమితం కాకుండా, ప్రతి రంగంలో ఆవిష్కరణలకు ప్రధాన సాధనంగా మారింది. పరిశోధనకు, భవిష్యత్ సాంకేతికతకు మధ్య ICETCI వారధిగా నిలుస్తోంది.”
డాక్టర్ ఎల్. వెంకట సుబ్రహ్మణ్యం: “రాబోయే తరం AI, క్వాంటమ్ కంప్యూటింగ్, అడ్వాన్స్డ్ కంప్యూటేషనల్ మోడల్స్ సమ్మేళనంతో నడవబోతోంది. భారతీయ పరిశోధనా వ్యవస్థకు ఇటువంటి సదస్సులు ఎంతో బలాన్నిస్తాయి.”
తదుపరి తరం ఆవిష్కర్తలను తీర్చిదిద్దడమే లక్ష్యం
సదస్సు విజయంపై మహీంద్రా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ యజులు మెడూరి స్పందిస్తూ, “పరిశ్రమలు మరియు సమాజం ఎదుర్కొంటున్న సంక్లిష్ట సమస్యలకు కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్ పరిష్కారం చూపుతోంది. అంతరశాఖ (Interdisciplinary) పరిశోధనలను ప్రోత్సహించడం ద్వారా భావి తరాలకు అవసరమైన నైపుణ్యాలను అందించడానికి మహీంద్రా వర్సిటీ కట్టుబడి ఉందన్నారు.” అలాగే ఎకోల్ సెంట్రల్ స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ డీన్ (R&D) డాక్టర్ ఆర్య కుమార్ భట్టాచార్య మాట్లాడుతూ, గణితం, కంప్యూటింగ్, ఇంజినీరింగ్‌ల సమన్వయమే కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్ బలమని పేర్కొన్నారు. సాంకేతిక సమావేశాలతో పాటు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతినిధుల మధ్య నెట్‌వర్కింగ్‌కు, పరస్పర సహకారానికి చక్కటి వేదికగా నిలిచాయి.