APB News Exclusive: మునుగోడులో ‘రాజా సర్కార్’..!

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: రాజకీయాల్లో సంచలనాత్మక నిర్ణయాలు, అనూహ్య వ్యాఖ్యలతో ఎప్పటికప్పుడు చర్చనీయాంశంగా నిలిచే ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి తన ప్రత్యేక కార్యశైలితో మునుగోడులో హాట్టాపిక్గా మారారు. ఒకవైపు ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేస్తూనే, మరోవైపు నియోజకవర్గ అభివృద్ధి అంశాల్లో ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవడం ప్రస్తుత చర్చకు దారితీసింది. “ఎప్పుడు ఏ అంశంపై ఎలా స్పందిస్తారు?” అనే ఆసక్తి రాజకీయ వర్గాలతో పాటు సాధారణ ప్రజల్లోనూ కనిపిస్తుంటుంది.

సాధారణంగా ఎమ్మెల్యేలు జిల్లా స్థాయి సమీక్ష సమావేశాల్లో పాల్గొని సమస్యలను ప్రస్తావించడం వరకు పరిమితమవుతుంటారు. కానీ రాజగోపాల్ మాత్రం మునుగోడు క్యాంపు ఆఫీసునే పరిపాలనా కమాండ్ సెంటర్గా మలుచుకున్నారనే అభిప్రాయం స్థానికంగా వ్యక్తమవుతోంది. ప్రతి రెండు మూడు నెలలకు శాఖల వారీగా సమీక్షలు నిర్వహించడం, జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులను ఒకే వేదికపైకి రప్పించి సమస్యల పరిష్కార దిశగా కార్యచరణ రూపొందిస్తున్నారు. సమీక్ష జరుగుతున్న సమయంలోనే సంబంధిత శాఖల కమిషనర్లు, సీఎండీలు, ఉన్నతాధికారులకు నేరుగా ఫోన్ చేసి సమస్యలను వివరించడం, పనుల పురోగతిపై సమాచారం తీసుకోవడం, అవసరమైతే గడువులు విధించడం జరుగుతోంది. సమావేశ మందిరంలోనే ఫోన్ స్పీకర్ ఆన్ చేసి ఉన్నతాధికారులతో మాట్లాడటం, వెంటనే ఆదేశాలు ఇవ్వడం ఆయన పనితీరుకు నిదర్శనంగా నిలుస్తోంది.

నల్లగొండ జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నప్పటికీ, తనకు మంత్రి పదవి లేకున్నా నియోజకవర్గ సమస్యలను కేవలం జిల్లా అధికారులకే పరిమితం చేయకుండా రాష్ట్రస్థాయి అధికారులతోనూ నేరుగా చర్చించడం ద్వారా సీనియర్ నేతగా తనదైన గుర్తింపును రాజగోపాల్ సంపాదించుకున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. విద్యుత్, రహదారులు, మున్సిపల్ అభివృద్ధి, దేవాదాయ భూములు, గృహ పథకాలు వంటి అంశాల్లో నేరుగా ఉన్నతాధికారులతో సమన్వయం కొనసాగించడం ఇందుకు ఉదాహరణగా చూపుతున్నారు.

Komatireddy Rajagopal Reddy
మునుగోడు మ్మెల్యే కోమటిరెడ్డి జగోపాల్ రెడ్డి

ఉమ్మడి జిల్లాలో సీఎం రేవంత్ పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్న నియోజకవర్గాల్లో పర్యటించినప్పటికీ మునుగోడులో మాత్రం ఇప్పటివరకు అడుగుపెట్టలేదు. రాష్ట్ర మంత్రివర్గంలో కీలక స్థానంలో ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి అదే కుటుంబానికి చెందిన నేత అయినప్పటికీ మునుగోడు లో ఆయన పర్యటించలేదు. సీనియర్ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి కూడా మునుగోడు అభివృద్ధి అంశాలను బహిరంగ సభల్లో గానీ, సమీక్ష సమావేశాల్లో గానీ పెద్దగా ప్రస్తావించలేదనే చెప్పాలి. అయితే ఈ పరిస్థితుల్లోనూ నియోజకవర్గ అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్లడంలో ఎమ్మెల్యే రాజగోపాల్ తనదైన శైలిని కొనసాగిస్తున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం టెండర్ల ప్రక్రియ వేగవంతం కావడానికి మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి సహకారం తీసుకుని ఒత్తిడి తెచ్చిండని, అలాగే మంత్రి కోమటిరెడ్డి సహకారంతో హ్యామ్ రోడ్లకు భారీ నిధులు కేటాయింపులు జరిగాయని చెబుతున్నారు. పట్టణాభివృద్ధి, విద్య శాఖలు ముఖ్యమంత్రి వద్దే ఉన్నప్పటికీ ఆయా శాఖల నుంచి అవసరమైన పనులను రాబట్టుకోవడంలో రాజగోపాల్ రాజకీయ చతురతను ప్రదర్శిస్తున్నారనే అభిప్రాయం కాంగ్రెస్ నాయకుల్లో వ్యక్తమవుతోంది.

అయితే మునుగోడు ప్రజల్లో మరో అభిప్రాయం కూడా వినిపిస్తోంది. ముఖ్యమంత్రి, మంత్రులు మునుగోడులో పర్యటిస్తే మరిన్ని అభివృద్ధి పనులు, అదనపు నిధులు, కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉంటుందని కాంగ్రెస్ కేడర్తో పాటు ప్రజలు భావిస్తున్నారు.  బీఆర్ఎస్ హయాంలో రాజగోపాల్ రెడ్డి ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ మునుగోడు పర్యటనకు రాలేదని, పెద్దగా నిధుల కేటాయింపులు జరగలేదని కాంగ్రెస్ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. రాజీనామా అనంతరం జరిగిన ఉపఎన్నికల సమయంలోనే వందల కోట్ల రూపాయల పనులకు ఆమోదాలు లభించిన సంగతిని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో ముఖ్యమంత్రి మునుగోడులో పర్యటిస్తే నియోజకవర్గానికి మరింత ప్రయోజనం చేకూరుతుందనే అభిప్రాయం పార్టీ శ్రేణులు, ప్రజల్లో బలంగా వినిపిస్తోంది.

గత రెండున్నరేళ్లుగా ఇదే విధానాన్ని కొనసాగిస్తున్న రాజగోపాల్ రెడ్డి వైఖరిపై అధికార వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కొందరు అధికారులు సమస్యలు వేగంగా పరిష్కారమవుతున్నాయని అభిప్రాయపడుతుండగా, మరికొందరు తరచూ జరిగే సమీక్షలు, ప్రత్యక్ష జోక్యం ఒత్తిడిని పెంచుతున్నాయని అంటున్నారు. అయితే ప్రజల దృష్టిలో మాత్రం “సమస్య చెప్పితే వెంటనే స్పందించే ఎమ్మెల్యే” అనే ఇమేజ్ ఆయనకు బలపడుతోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఉదయం గ్రామాల్లో పర్యటనలు, మధ్యాహ్నం శాఖల సమీక్షలు, సాయంత్రం ఉన్నతాధికారులతో ఫోన్ కాల్స్, రాత్రికి పనుల పురోగతిపై ఫాలోఅప్. ఈ మొత్తం వ్యవస్థను తన చుట్టూ నడిపిస్తున్న తీరు మునుగోడులో “రాజా సర్కార్” అనే చర్చకు ప్రధాన కారణంగా మారిందని స్థానిక రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

Share
Share