వినాయక నిమజ్జనంలో ఘోర అపశృతి: ఆరుగురు అనాథాశ్రమం విద్యార్థులు దుర్మరణం..

సంగారెడ్డి, ఏపీబీ న్యూస్: వినాయక నిమజ్జన ఉత్సవాల్లో తీవ్ర ఘోర అపశృతి చోటుచేసుకుంది. దేవుడి బొమ్మను నిమజ్జనం చేసేందుకు వెళ్లిన ఆరుగురు విద్యార్థులు ప్రమాదవశాత్తు కుంటలో పడి మునిగిపోయి దుర్మరణం చెందారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం, ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలోని పెద్దకంజర్ల గ్రామ శివారులో బుధవారం ఈ హృదయ విదారక ఘటన వెలుగుచూసింది.

మరణించిన ఆరుగురు విద్యార్థులు పెద్దకంజర్ల సమీపంలోని శిరీష అనాథాశ్రమం (Sireesha Orphanage) లో నివాసముంటున్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. గణేష్ నిమజ్జన కార్యక్రమంలో భాగంగా స్థానిక కుంట వద్దకు వెళ్లిన సమయంలో ఒకరిని కాపాడేందుకు మరొకరు ప్రయత్నించి ప్రమాదవశాత్తు లోతైన కుంటలో పడిపోయినట్లు సమాచారం.

ఈ ప్రమాదంలో ఆరుగురు విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడంతో అనాథాశ్రమంలోనూ, పరిసర ప్రాంతాల్లోనూ తీవ్ర శోకసంద్రం అలుముకుంది.

పోలీసుల దర్యాప్తు: సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను వెలికితీశారు. కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి దిగ్భ్రాంతి: సమాచారం తెలిసిన వెంటనే పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆసుపత్రికి చేరుకుని మృతదేహాలను పరామర్శించారు. విద్యార్థుల మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని, దిగ్భ్రాంతిని వ్యక్తపరిచారు.

సొంత ఖర్చులతో అంబులెన్స్లు: గురువారం ఉదయం 10 గంటల లోపు పోస్టుమార్టం ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. అనంతరం మృతదేహాలను వారి వారి సొంత ఊళ్లకు ఉచితంగా తరలించేందుకు తన సొంత నిధులతో ప్రత్యేక అంబులెన్స్లను ఏర్పాటు చేశారు.

గణనాథుని సాగనంపే వేళ చిన్నారులు ఇలా అనంత లోకాలకు వెళ్లడం పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా అందరినీ తీవ్రంగా కలిచివేసింది.

Share
Share