Breaking News: తెలంగాణ నీటిని ఏపీకి అమ్ముకుంటున్నారు: జగదీష్ రెడ్డి సంచలన ఆరోపణలు

నల్లగొండ, ఏపీబీ న్యూస్: రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన పూర్తిగా పక్కదారి పట్టిందని, ముఖ్యమంత్రి, మంత్రులు కేవలం భూముల దోపిడీపైనే దృష్టి పెట్టారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ మునిగోడు ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నల్లగొండలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

“రాష్ట్రంలో భూములను దోచుకోవడానికి అడ్డంకిగా మారిందనే నెపంతో ‘ధరణి’ పోర్టల్ను తొలగించి ‘భూభారతి’ తీసుకొచ్చారు. ధరణిలో కేవలం 10 లక్షల ఎకరాలు మాత్రమే నిషేధిత జాబితాలో ఉంటే, భూభారతి ద్వారా రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లోని దాదాపు కోటి ఎకరాలను నిషేధిత జాబితాలో చేర్చారు. చివరికి స్వయంగా మంత్రులు, ఎమ్మెల్యేల భూములను కూడా అందులో పెట్టడం వారి అసమర్థతకు అద్దం పడుతోంది” అని విమర్శించారు.

“భూముల దోపిడీ ధ్యాసలో పడి తెలంగాణ ప్రభుత్వం నీటి హక్కులను విస్మరించింది. శ్రీశైలంలో 120 టీఎంసీలు, సాగర్లో 70 టీఎంసీల నీళ్లే కనిపిస్తున్నాయి. మరి మిగిలిన 200 టీఎంసీల నీళ్లు ఎటు పోయాయో సమాధానం చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు వద్ద గేట్లను తీసేసి, వెలిగొండ ద్వారా యథేచ్ఛగా నీటిని తరలిస్తోంది. తెలంగాణ ప్రభుత్వ అసమర్థతను ఆసరాగా చేసుకుని ఏపీ దోచుకుపోతోంది. భూములను అమ్ముకున్నట్టే తెలంగాణ నీటిని కూడా ఆంధ్రకు అమ్ముకుంటున్నారు” అని ఆరోపించారు.

ఎడమ కాలువ రైతులకు నీటి హామీ: సాగర్లో ఉన్న 70 టీఎంసీల నీటితో ఎడమ కాలువ, వరద కాలువ, AMRP ఆయకట్టుకు మొదటి పంటకు నీళ్లు తక్షణమే విడుదల చేయాలి. 30 టీఎంసీలతో ఒక పంటను సమర్థవంతంగా కాపాడవచ్చు.

వరి నాట్లు వేసుకోండి: ఎడమ కాలువ రైతులు ధైర్యంగా వరి నాట్లు వేసుకోవాలని, నీళ్లు ఇప్పించే బాధ్యత బీఆర్ఎస్ తీసుకుంటుందని హామీ ఇచ్చారు.

కేటీఆర్ పాదయాత్రకు కట్టుబడి ఉన్నాం: రైతుల కోసం కేటీఆర్ ప్రకటించిన పాదయాత్రకు తామంతా కట్టుబడి ఉన్నామని, నీళ్ల కోసం కొట్లాడేందుకు సిద్ధమని స్పష్టం చేశారు.

మంత్రుల నిర్లక్ష్యం: మంత్రి ఉత్తమ్ కల్వకుర్తి లిఫ్ట్ను ఆన్ చేస్తే, కరెంటు బిల్లులు కట్టలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆపేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అలాగే స్థానిక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిధిలోని ఉదయ సముద్రం ప్రాజెక్టు ఎండిపోతున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.

ఏపీ నీటి దోపిడీని తక్షణమే అడ్డుకోవాలని, తెలంగాణ రైతులను కాపాడేందుకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (KRMB) కి కాంగ్రెస్ ప్రభుత్వం లేఖ రాయాలని జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఉదయ సముద్రం, మిషన్ భగీరథ, కన్నెపల్లి పంప్హౌస్ నిర్వహణను పూర్తిగా గాలికొదిలేశారని, కరెంట్ సరఫరాలో తీవ్ర కోతలు విధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ఈ ప్రశ్నలన్నింటినీ నిలదీస్తామనే భయంతోనే తమ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారని ఆరోపించారు.

ఈ ప్రెస్ మీట్లో ఎమ్మెల్సీ ఎం.సి. కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు రేగట్టే మల్లికార్జున రెడ్డి, సింగం రాంమోహన్, నిరంజన్ వలీ, మారగోని గణేష్, రావుల శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Share
Share