APB News Exclusive: నల్లగొండ క్లబ్‌లో మళ్లీ పాత పట్టు!

నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: నల్లగొండ క్లబ్ ఎన్నికల్లో మళ్లీ పాత కార్యవర్గమే ఆధిపత్యం ప్రదర్శించే దిశగా పావులు కదుపుతున్నదన్న చర్చ జరుగుతోంది. ప్రస్తుతం వైస్ చైర్మన్గా ఉన్న వ్యక్తే మరోసారి క్లబ్ పగ్గాలు చేపట్టేందుకు తెరవెనుక ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు సభ్యుల్లో ప్రచారం సాగుతోంది. ఎన్నికల బరిలో నిలిచిన కార్యవర్గ సభ్యుల్లో సుమారు 80 శాతం మంది పాత సభ్యులే ఉండటం, కొత్తవారు కేవలం 20 శాతం వరకే ఉండటంపై పలువురు సభ్యులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన సమయంలో ఈసారి కొత్త సభ్యులకు అవకాశం కల్పిస్తామని వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారం జరిగినట్టు సమాచారం. అయితే నామినేషన్ల దశకు వచ్చేసరికి పరిస్థితి మారిపోయిందని, మళ్లీ పాత సభ్యులకే పెద్దపీట వేసినట్టు కొందరు సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇద్దరు, ముగ్గురు సీనియర్ సభ్యులను తప్పించి వారి స్థానంలో కొత్తవారికి అవకాశం ఇస్తున్నామని చెప్పి, ఆగమేఘాల మీద ప్యానెల్ సభ్యుల పేర్లను ప్రకటించడం కూడా చర్చకు దారితీసింది.

APB News Exclusive: ఎపిసోడ్ –3: నల్లగొండ క్లబ్లో.. ‘బినామీ’ సభ్యులు?

కార్యదర్శి, వైస్ చైర్మన్ వంటి కీలక పదవులకు ఎవరెవరు పోటీ చేయాలనుకుంటున్నారు? సభ్యుల అభిప్రాయం ఏమిటి? అనే అంశాలపై ముందుగా అభిప్రాయాలు సేకరించినప్పటికీ, వాటిని ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా ప్యానెల్లో నిలిచే సభ్యుల పేర్లను ప్రకటించడంపై కొందరు సీనియర్ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది.

మరోవైపు కార్యవర్గ సభ్యుల పేర్లను ముందుగానే ప్రకటించినప్పటికీ, కార్యదర్శి అభ్యర్థి ఎవరన్నది మాత్రం వెంటనే వెల్లడించకపోవడం కూడా అనుమానాలకు తావిస్తోంది. కీలకమైన పదవులకు ఎవరు పోటీ చేస్తారనే విషయంలో స్పష్టత ఇవ్వకుండా ప్యానెల్ను ముందుకు తీసుకెళ్లడం వెనుక ఉద్దేశం ఏమిటన్న ప్రశ్నలు సభ్యుల నుంచి వినిపిస్తున్నాయి. దీంతో మళ్లీ పాతవారి కనుసన్నల్లోనే క్లబ్ కొనసాగించాలన్న ప్రయత్నం జరుగుతోందా అన్న చర్చకు తెరలేచింది.

APB News Exclusive: ఎపిసోడ్ -4: క్లబ్లో కాసుల గలగల.. రెడ్క్రాస్లో రక్తం విల విల!

ఇక ఎన్నికల ప్రచారానికి కేవలం ఒక్కరోజు మాత్రమే గడువు ఉండటం కూడా సభ్యుల్లో చర్చనీయాంశంగా మారింది. సుమారు 800 మంది సభ్యులు ఉన్న క్లబ్లో ఒక్కరోజులోనే ప్రతి సభ్యుడిని వ్యక్తిగతంగా కలసి, తమ ప్యానెల్ గురించి వివరించి, మద్దతు కోరడం ఎంతవరకు సాధ్యమన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇంత తక్కువ వ్యవధిలో ప్రచారాన్ని ముగించాల్సిన అవసరం ఏమిటన్న సందేహాలను కొందరు సభ్యులు వ్యక్తం చేస్తున్నారు.

కొత్తవారికి అవకాశం కల్పిస్తామని చెప్పిన ఎన్నికల ప్రక్రియ చివరకు మళ్లీ పాత సభ్యుల ఆధిపత్యం వైపే సాగుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో నల్లగొండ క్లబ్ సభ్యుల తీర్పుపై ఆసక్తి నెలకొంది. పాత కార్యవర్గానికి మరోసారి అవకాశం దక్కుతుందా? లేక ఈసారి సభ్యులు మార్పు వైపు మొగ్గుచూపుతారా? అన్నది ఎన్నికల ఫలితాల తర్వాతే తేలనుంది.

Share
Share