- నల్గొండ నీళ్లు ఖమ్మం, ఆంధ్రాకు తరలిస్తున్నారని మండిపాటు..
- ఎండిపోతున్న పంట పొలాలను కాపాడాలని బీఆర్ఎస్ డిమాండ్..
నల్గొండ/నకిరేకల్, ఏపీబీ న్యూస్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలు, 420 హామీలను నెరవేర్చలేక తీవ్ర ఫ్రస్ట్రేషన్లో ఉంది అని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పందికొక్కుల్లా ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని సంచలన ఆరోపణలు చేశారు. శుక్రవారం నకిరేకల్‌లోని స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
అధికార మదంతో ప్రజాధనం దోపిడీ..
కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు రెండు టర్మ్‌లు ఓడిపోయినా సరిపోయేంత డబ్బును ఈ కొద్ది నెలల కాలంలోనే సంపాదించామని బహిరంగంగా చెప్పుకుంటున్నారని చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. కేసీఆర్ పాలనలో నిరంతరం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సాగిందని, కానీ ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో అవినీతి తాండవిస్తోందని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలనపై ఎలాంటి గ్రిప్ లేకపోవడంతోనే వ్యవస్థలు నిర్వీర్యమవుతున్నాయని, పాలనను గాడిలో పెట్టడం మానేసి కేసీఆర్, ఆయన కుటుంబంపై రాజకీయ విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు.
నల్గొండ నీళ్లు ఖమ్మం, ఆంధ్రాకు తరలింపు..
నల్గొండ జిల్లా రైతాంగానికి సాగునీటి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందని లింగయ్య ధ్వజమెత్తారు.
చిరుమర్తి లింగయ్య – ప్రధాన విమర్శలు:
సాగునీటి దోపిడీ: AMRP ప్రాజెక్టు ద్వారా నల్గొండ జిల్లాకు రావాల్సిన నీటిని అందించకుండా ఎడమ కాలువ ద్వారా ఖమ్మం జిల్లాకు తరలిస్తున్నారు. ఖమ్మం జిల్లా మంత్రుల ఆదేశాలకు నల్గొండ జిల్లా ఇరిగేషన్ మంత్రి తల ఊపుతున్నారు.
పోతిరెడ్డిపాడు నీటి తరలింపు: పోతిరెడ్డిపాడు ద్వారా ఆంధ్రాకు నీటిని తరలిస్తున్నా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పట్టించుకోవడం లేదు.
ఎండిపోతున్న పొలాలు: మరో 10 నుంచి 15 రోజుల్లో పంట చేతికి వచ్చే సమయంలో సాగునీరు అందక పొలాలు ఎండిపోతున్నా ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది.
దళితులపై వేధింపులు: ఇప్పలగూడెంలో బీఆర్ఎస్ కార్యకర్తలు, వార్డు మెంబర్లు సొంత డబ్బులతో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే, ఎమ్మెల్యే అనుచరులు దాన్ని తొలగించారు. ప్రశ్నించిన దళితులు, బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు బనాయించారు.
పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి!
దళిత నాయకుల ఇళ్ల తలుపులు బద్దలుగొట్టి పోలీస్ స్టేషన్లకు తరలించడం దారుణమని లింగయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల మెప్పు కోసం కాకుండా పోలీసులు చట్టబద్ధంగా, నిష్పక్షపాతంగా తమ విధులను నిర్వహించాలని హితవు పలికారు. వెంటనే AMRP కింద ఉన్న చెరువులు, కుంటలను నీటితో నింపి ఎండిపోతున్న పంట పొలాలను కాపాడాలని డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లాకు సాగునీటి కేటాయింపుల్లో జరుగుతున్న అన్యాయంపై బీఆర్ఎస్ శ్రేణులు రైతుల తరఫున పోరాటం కొనసాగిస్తాయని స్పష్టం చేశారు.