- 28 నుంచే పట్టభద్రుల ఓటర్ల నమోదుకు శ్రీకారం
- రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు కొత్తగా ఓటర్ల జాబితాల తయారీ
- పాత జాబితాలో పేరున్నా మళ్లీ ఫారం-18తో దరఖాస్తు తప్పనిసరి..
- నవంబర్ 6 వరకు గడువు
నల్లగొండ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు కొత్తగా ఓటర్ల జాబితాల తయారీ ప్రక్రియ ఈ నెల 28 నుంచి ప్రారంభం కానుంది. మహబూబ్నగర్–రంగారెడ్డి–హైదరాబాద్, వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గాల్లో 2027 మార్చిలో సాధారణ ఖాళీలు ఏర్పడనున్న నేపథ్యంలో ద్వైవార్షిక ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. దీంతో ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించి ఓటర్ల జాబితాలను డీ-నోవో (కొత్తగా) రూపొందించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం సెప్టెంబర్ 17న షెడ్యూల్ను వెల్లడిస్తూ ప్రెస్నోట్ విడుదల చేసింది.
28న నోటిఫికేషన్ జారీ
ఓటర్ల జాబితాల తయారీ ప్రక్రియలో భాగంగా సెప్టెంబర్ 28న ప్రజా నోటీసు జారీ చేయనున్నారు. రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టర్స్ రూల్స్, 1960లోని రూల్ 31(3) ప్రకారం ఈ నోటీసును విడుదల చేస్తారు. అనంతరం అక్టోబర్ 15న మొదటిసారి, అక్టోబర్ 25న రెండోసారి నోటీసును వార్తాపత్రికల్లో పునఃప్రచురిస్తారు.
సిద్ధమవుతున్న ఓటర్లు
దీంతో రెండు పట్టభద్రుల నియోజకవర్గాల పరిధిలోని అర్హులైన పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పట్టభద్రుల సంఘాలు తమ పరిధిలోని అర్హులైన పట్టభద్రులను పెద్ద సంఖ్యలో నమోదు చేయించే అవకాశం ఉంది.
పాత ఓటర్లకు కూడా తప్పని దరఖాస్తు
ఈసారి ఓటర్ల జాబితాలను పూర్తిగా కొత్తగా రూపొందిస్తున్నందున ఇప్పటికే ఉన్న జాబితాలో పేరున్న పట్టభద్రులు కూడా మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సవరించిన ఫారం-18లో దరఖాస్తు సమర్పించాలి. పాత ఓటర్ల జాబితాలో పేరు ఉన్నదన్న కారణంతో కొత్త జాబితాలో పేరు కొనసాగించబోమని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
ఫారం-18 దరఖాస్తుతో పాటు అర్హతను నిర్ధారించే అవసరమైన పత్రాలు, ధ్రువపత్రాల ధ్రువీకరించిన ప్రతులను సమర్పించాల్సి ఉంటుంది.
నవంబర్ 6 వరకు గడువు
పట్టభద్రుల నియోజకవర్గాల్లో ఓటరుగా నమోదుకు ఫారం-18 దరఖాస్తుల స్వీకరణకు నవంబర్ 6ను చివరి తేదీగా నిర్ణయించారు. అనంతరం నవంబర్ 20 నాటికి ముసాయిదా ఓటర్ల జాబితాల తయారీ, ముద్రణ ప్రక్రియను పూర్తి చేయనున్నారు.
నవంబర్ 25న ముసాయిదా ఓటర్ల జాబితాలను ప్రచురిస్తారు. అదే రోజు నుంచి డిసెంబర్ 10 వరకు జాబితాలపై క్లెయిమ్లు, అభ్యంతరాలను స్వీకరిస్తారు. వచ్చిన అభ్యంతరాలు, క్లెయిమ్లను పరిశీలించి పరిష్కరించడంతోపాటు అనుబంధ జాబితాల తయారీ, ముద్రణ ప్రక్రియను డిసెంబర్ 25 నాటికి పూర్తి చేయాలని షెడ్యూల్లో పేర్కొన్నారు.
డిసెంబర్ 30న తుది జాబితా
అన్ని ప్రక్రియలను పూర్తి చేసిన అనంతరం డిసెంబర్ 30న తుది ఓటర్ల జాబితాను ప్రచురించనున్నారు. ఈ జాబితా ఆధారంగానే 2027 మార్చిలో జరగనున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఎన్నికలకు ఓటర్ల జాబితా సిద్ధం కానుంది.
ఆన్లైన్లోనూ దరఖాస్తు
పట్టభద్రుల ఓటర్లుగా నమోదు కావాలనుకునే వారు తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే సంబంధిత ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు (ఈఆర్ఓలు), అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు (ఏఈఆర్ఓలు), నియమిత అధికారులు, అదనపు నియమిత అధికారులకు అవసరమైన పత్రాలతో ఫారం-18ను ప్రత్యక్షంగా సమర్పించవచ్చు. పోస్టు ద్వారా కూడా సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా నియమిత అధికారికి దరఖాస్తు పంపేందుకు అవకాశం కల్పించారు.
రెండు పట్టభద్రుల నియోజకవర్గాలకు ఓటర్ల జాబితాలను పూర్తిగా కొత్తగా రూపొందించనున్న నేపథ్యంలో ఈ నెల 28న నోటీసు జారీ అయిన వెంటనే నమోదు ప్రక్రియ ఊపందుకోనుంది. ఇప్పటికే ఓటర్లుగా ఉన్నవారు సైతం మళ్లీ ఫారం-18 సమర్పించాల్సి ఉండటంతో రానున్న వారాల్లో ఈ రెండు నియోజకవర్గాల్లో పట్టభద్రుల ఓటర్ల నమోదు కీలకంగా మారనుంది.