- కేటీఆర్, హరీష్‌రావులపై ఎంపీ చామల కిరణ్ విరుచుకుపాటు!
- గాంధీభవన్‌లో విలేకరుల సమావేశం..
- జన్వాడ భూములు, కేసీఆర్ ఫామ్‌హౌస్ భూ ఆక్రమణలపై రచ్చకెక్కిన విమర్శలు..
హైదరాబాద్, ఏపీబీ న్యూస్: గాంధీభవన్ వేదికగా బీఆర్ఎస్ అగ్రనేతలు కేటీఆర్ (KTR), హరీష్ రావు (Harish Rao) లపై భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ కుటుంబానికి చెందిన ఎర్రవల్లి ఫామ్‌హౌస్ పరిధిలోని భూములు, జన్వాడ భూముల ఆక్రమణలపై తామంతా ఎంపీల బృందంగా కలెక్టర్ ఆఫీస్‌లోనే కూర్చొని సమగ్ర విచారణ జరుపుతామని సవాలు విసిరారు.
గురువారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడారు.
ఎర్రవల్లి ఫామ్‌హౌస్ దగ్గర 300 ఎకరాల కబ్జా!
“ఎర్రవల్లి ఫామ్‌హౌస్ వద్ద 295 ఎకరాలకు పైగా భూమి ఉంది. వెంకటాపురం – ఎర్రవల్లి మధ్య దాదాపు 300 ఎకరాల ప్రభుత్వ, అసైన్డ్ భూములు బీఆర్ఎస్ అధినేతల ఆక్రమణలో ఉన్నాయని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. అసలు ఈ ఓవర్లాపింగ్ భూములు మీ ఫామ్‌హౌస్‌లో ఉన్నాయో లేదో కేటీఆర్, హరీష్ రావు జవాబు చెప్పాలి. ఆ భూములను మీరే స్వచ్ఛందంగా పేదలకు పంచుతారా? లేక మేమే స్వాధీనం చేసుకుని పంచాలా?” అని నిలదీశారు.
జన్వాడ భూములు – ఈడీ అటాచ్మెంట్లపై ప్రశ్నల వర్షం!
జన్వాడలోని సత్యం రామలింగరాజు భూములు, జీవో 111 పరిధిలోని ఆస్తులు కేటీఆర్ పేరు మీదకు ఎలా వచ్చాయని చామల కిరణ్ ప్రశ్నించారు.
ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రధాన వ్యాఖ్యలు:
ఈడీ ఆస్తుల బదిలీ: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అటాచ్ చేసిన భూములు కేటీఆర్ పేరుమీదకు ఎలా వచ్చాయో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి.
రూ. 8 లక్షల కోట్ల అప్పులు – కమిషన్లు: బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రూ. 8 లక్షల కోట్ల అప్పులు చేసి, ఎంత శాతం కమిషన్లు నొక్కేశారో కేటీఆర్ చెప్పాలి. తెలంగాణను కుక్కలు చింపిన విస్తరిలా తయారు చేశారు.
ఈటెల రాజేందర్‌కు ఒక న్యాయం.. మీకో న్యాయమా?: హకీంపేట మండలంలోని 130 సర్వే నంబర్లో 85 ఎకరాలు అసైన్డ్ భూములు ఉంటే, గతంలో ఈటెల రాజేందర్‌పై ఒక రకంగా వ్యవహరించిన బీఆర్ఎస్ నేతలు, తమ ఫామ్‌హౌస్ భూముల విషయంలో ఎందుకు నోరు విప్పడం లేదని మండిపడ్డారు.
భూభారతి నిషేధిత జాబితా పై క్లారిటీ!
రాష్ట్రంలో నిషేధిత జాబితా (Prohibited List) లో పడిన భూముల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారని ఎంపీ గుర్తుచేశారు. ఏ ఒక్క సామాన్య రైతు లేదా పౌరుడు నష్టపోకుండా చూడాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని, బీఆర్ఎస్ నాయకులు దరిద్రపు ఆలోచనలతో అసత్య ప్రచారాలు చేయడం మానాలని హితవు చెప్పారు.
యూపీఐ పన్నులపై కాంగ్రెస్ పోరాటం!
కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం డిజిటల్ చెల్లింపులైన యూపీఐ (UPI) పై పన్నులు వేసే ఆలోచన చేయడం దారుణమని, కేవలం అమెరికా ప్రయోజనాల కోసం మోదీ ఈ నిర్ణయం తీసుకుంటున్నారని ఆరోపించారు. యూపీఐ పన్నుల విధింపుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు.