Breaking News: కోదాడ: సైకిల్ దొంగతనం నుంచి.. కిలాడీ దొంగగా..చివరికి..

కోదాడ/సూర్యాపేట, ఏపీబీ న్యూస్: సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ పరిధిలో గత కొంతకాలంగా తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని వరుస దొంగతనాలకు పాల్పడుతున్న మోస్ట్ వాంటెడ్ దొంగను కోదాడ పట్టణ పోలీసులు మరియు జిల్లా సీసీఎస్ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. సూర్యాపేట జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ కె. నరసింహ, ఐపీఎస్ కేసు వివరాలను వెల్లడించారు.

అరెస్టయిన నిందితుడి వద్ద నుంచి పోలీసులు భారీగా దొంగిలించిన ఆభరణాలు మరియు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు:

  • బంగారం: 37.2 తులాలు
  • వెండి: 470 గ్రాములు
  • నగదు: రూ.3.60 లక్షలు
  • వాహనం & ఫోన్: హోండా అమేజ్ (Honda Amaze) కారు, వివో (VIVO Y31 5G) మొబైల్ ఫోన్

స్వాధీనం చేసుకున్న మొత్తం సొత్తు విలువ సుమారు రూ.60 లక్షలు ఉంటుందని ఎస్పీ తెలిపారు.

అరెస్టయిన నిందితుడు పట్నం శెట్టి రాజు @ రాజీ రెడ్డి (41). హైదరాబాద్లోని జగద్గిరిగుట్ట పాపిరెడ్డినగర్ కాలనీకి చెందిన ఇతను వృత్తిరీత్యా కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో 2009లో ఖమ్మం పోలీస్ స్టేషన్ పరిధిలో సైకిల్ దొంగతనంతో నేర జీవితం ప్రారంభించి జైలుకు వెళ్లాడు. ఆ తర్వాత 2015, 2016ల్లో జగద్గిరిగుట్ట పరిధిలో ఐదు ఇళ్లలో దొంగతనాలు చేసి రిమాండ్కు వెళ్లాడు.

హైదరాబాద్ నుంచి ప్రయాణికులను తన కారులో కోదాడకు తీసుకువచ్చి రాత్రి వేళల్లో ఇక్కడే బస చేసేవాడు.

నకిలీ నంబర్ ప్లేట్: పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు తన కారు ఒరిజినల్ నంబర్ (AP 28 BY 7770) కు బదులుగా నకిలీ నంబర్ ప్లేట్ (TS 07 GC 1612) అమర్చేవాడు.

షూ సాక్స్ & స్క్రూడ్రైవర్: చేతి వేలిముద్రలు పడకుండా గ్లౌజులకు బదులుగా ‘షూ సాక్స్’ ధరించి, స్క్రూడ్రైవర్తో తలుపుల తాళాలు పగలగొట్టేవాడు.

రాత్రి దొంగతనాలు: కారును నిర్మానుష్య ప్రాంతంలో పార్క్ చేసి, కాలినడకన తాళం వేసిన ఇళ్లను గుర్తించి దొంగతనాలకు పాల్పడేవాడు. దొంగిలించిన సొత్తును కరిగించడం, ఫైనాన్స్ సంస్థల్లో కుదవబెట్టడం చేసేవాడు.

కోదాడలో 2021 నుంచి ఇప్పటివరకు 10 దొంగతనాలకు పాల్పడగా, ఒక్క 2026 సంవత్సరంలోనే 7 ఇళ్లలో చేతివాటం ప్రదర్శించాడు.

సూర్యాపేట నుంచి కోదాడ మీదుగా విజయవాడకు దొంగిలించిన బంగారాన్ని విక్రయించేందుకు కారులో బయలుదేరిన నిందితుడు.. హుజూర్ నగర్ ఫ్లైఓవర్ వద్ద పోలీసులు నిర్వహిస్తున్న వాహన తనిఖీలను చూసి భయపడి వెనక్కి తగ్గడానికి యత్నించాడు. అనుమానంతో పోలీసులు వెంటాడి పట్టుకుని వాహన డిక్కీని తనిఖీ చేయగా బంగారం, వెండి, నగదుతో పాటు స్క్రూడ్రైవర్లు, షూ సాక్స్లు లభించాయి. విచారణలో తన నేరాలను అంగీకరించడంతో అతడిని రిమాండ్కు తరలించారు.

“ఇళ్లకు తాళాలు వేసి వెళ్లేవారు విలువైన వస్తువులను ఇంట్లో ఉంచవద్దు. ప్రతి ఇంటికి, కాలనీల్లో సిసిటీవీ కెమెరాలు, అలారం సిస్టమ్లు ఏర్పాటు చేసుకోవాలి. అనుమానితులు కనిపిస్తే వెంటనే డయల్ 112 కు సమాచారం అందించాలి.”

ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ చూపిన కోదాడ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, సీసీఎస్ ఇన్స్పెక్టర్ శివ కుమార్, కోదాడ టౌన్ ఇన్స్పెక్టర్ శివంశంకర్, సిబ్బందిని ఎస్పీ అభినందించి రివార్డులు అందజేశారు.

Share
Share