Breaking News: ‘మాదాపూర్‌లో ఘోరం.. 50 గజాల్లో 7 అంతస్తుల భవనం కుప్పకూలి ఇద్దరు కార్మికులు మృతి

హైదరాబాద్ ప్రతినిధి, ఏపీబీ న్యూస్: రాజధాని హైదరాబాద్ నగరం గుండెకాయ లాంటి మాదాపూర్ ఐటీ కారిడార్ సమీపంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మాదాపూర్ డివిజన్ పరిధిలోని అంజయ్య నగర్లో అక్రమంగా నిర్మించిన ఒక 7 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ దుర్ఘటనలో శిథిలాల కింద చిక్కుకుని ఒక కార్మికుడు ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు కార్మికులు చిక్కుకుపోయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న డీఆర్ఎఫ్ (DRF – Disaster Response Force) బృందాలు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టి శిథిలాల కింద నుంచి ఒకరి మృతదేహాన్ని వెలికితీశారు.

అక్రమ నిర్మాణం: స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బిల్డర్ సాదిక్, యజమాని ఖాజాలు ఎనిమిది, తొమ్మిది నెలల క్రితం కేవలం 50 గజాల చిన్న స్థలంలో నిబంధనలకు విరుద్ధంగా ఏడంతస్తుల భవన నిర్మాణాన్ని ప్రారంభించారు.

మృతుల గుర్తింపు: ప్రమాదంలో మరణించిన ఇద్దరు కార్మికులు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన భవన నిర్మాణ కార్మికులుగా పోలీసులు గుర్తించారు.

కేవలం 50 గజాల స్థలం: అంజయ్య నగర్లో కేవలం 50 గజాల చిన్న స్థలంలో ఎలాంటి నిబంధనలు పాటించకుండా, బేస్మెంట్ బలం లేకుండా ఏకంగా ఏడు అంతస్తుల నిర్మించడం పట్ల స్థానికులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

అధికారుల ఉదాసీనత & అవినీతి: 50 గజాల స్థలంలో ఏడంతస్తుల భవనం నిర్మాణం పూర్తవుతున్నా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) టౌన్ ప్లానింగ్ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది ఏం చేస్తున్నారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. వ్యవస్థలో మూలమూలలా పేరుకుపోయిన కరప్షన్కు ఈ ప్రమాదమే నిదర్శనమని ఆరోపిస్తున్నారు.

స్థానిక ఫిర్యాదులు బుట్టదాఖలు?: చుట్టుపక్కల నివసించే ప్రజలు మరియు స్థానికులు జీహెచ్ఎంసీకి, సంబంధిత పోలీస్ స్టేషన్లకు గతంలో హెచ్చరించినా అధికారులు కంటితుడుపు చర్యలు కూడా తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బాధ్యత ఎవరిది?: నిబంధనలకు విరుద్ధంగా సాగిన ఈ అక్రమ నిర్మాణానికి, ప్రాణ నష్టానికి మున్సిపల్ శాఖ మంత్రి, మున్సిపల్ కమిషనర్, మేయర్ ఏం సమాధానం చెబుతారని బాధితులు, స్థానిక ప్రజలు నిలదీస్తున్నారు.

రూల్స్ అన్నీ పక్కనపెట్టి, లంచాలకు కక్కుర్తి పడి ప్రాణాలతో చెలగాటమాడేందుకు అనుమతించిన లేదా మౌనం వహించిన జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులపై, సంబంధిత బిల్డర్పై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Share
Share