నాగార్జునసాగర్‌కు కొనసాగుతున్న వరద.. ఆశగా ఎదురుచూస్తున్న రైతులు

నల్గొండ, ఏపీబీ న్యూస్: ఎగువన శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద వస్తుండటంతో నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కూడా వరద నీటి ప్రవాహం క్రమంగా పుంజుకుంటోంది. ఆదివారం సాయంత్రం 6 గంటల సమయానికి లభించిన అధికారిక గణాంకాల ప్రకారం ప్రాజెక్టు నీటిమట్టం 518.30 అడుగులకు చేరుకుంది. ఎగువన శ్రీశైలంలోకి ఒక్కరోజే ఏకంగా 9 టీఎంసీల నీరు వచ్చి చేరడంతో దిగువన ఉన్న నాగార్జునసాగర్ ఆయకట్టు రైతుల చూపులన్నీ ఇప్పుడు సాగర్ నీటిమట్టంపైనే నెలకొన్నాయి.

ప్రస్తుతం నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు 13,435 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదవుతోంది.

  • ప్రస్తుత నీటిమట్టం: 518.30 అడుగులు (పూర్తి స్థాయి నీటిమట్టం: 590 అడుగులు)
  • ప్రస్తుత నీటి నిల్వ: 146.1945 టీఎంసీలు (పూర్తి నిల్వ సామర్థ్యం: 312.0450 టీఎంసీలు)
  • మొత్తం అవుట్ఫ్లో: 900 క్యూసెక్కులు (కేవలం ఎస్ఎల్బీసీ/ఏఎంఆర్పీ కాలువ ద్వారా మాత్రమే విడుదల)
  • గేట్లు & కాలువల పరిస్థితి: కుడి కాలువ (NSJC), ఎడమ కాలువ (NSLBC), ప్రధాన విద్యుత్ కేంద్రం, క్రెస్ట్ గేట్లు మరియు నదికి నీటి విడుదలలు నిలిపివేశారు.

శ్రీశైలం జలాశయం నుంచి ప్రస్తుతం మొత్తం సగటు 60,177 క్యూసెక్కుల నీటిని వివిధ అవసరాలకు విడుదల చేస్తున్నారు.

  • ఏపీ విద్యుత్ కేంద్రం: 26,093 క్యూసెక్కులు
  • తెలంగాణ విద్యుత్ కేంద్రం: 22,419 క్యూసెక్కులు
  • హెచ్ఎన్ఎస్ఎస్ లిఫ్ట్ ఇరిగేషన్: 1,611 క్యూసెక్కులు
  • ఎంజీకేఎల్ఐ: 1,917 క్యూసెక్కులు
  • పీఆర్పీ: 8,000 క్యూసెక్కులు

అవుట్ఫ్లో (900 క్యూసెక్కులు) కంటే ఇన్ఫ్లో (13,435 క్యూసెక్కులు) గణనీయంగా ఎక్కువగా ఉండటంతో జలాశయంలో నీటి నిల్వలు క్రమంగా పెరుగుతున్నాయని నీటిపారుదల శాఖ అధికారులు వెల్లడించారు. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు మరికొన్ని రోజులు కొనసాగితే సాగర్కు వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందనే వార్తలతో రైతాంగంలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.

Share
Share