Humanity: మానవత్వం చాటుకున్న దుబ్బాక ఎమ్మెల్యే

దుబ్బాక/మిర్దొడ్డి, ఏపీబీ న్యూస్: ఆపదలో ఉన్న వారికి నేనున్నానంటూ దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి మరోసారి తన ఉదారతను, మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి రక్తం మడుగులో ఉన్న బాధితులను చూసి వెంటనే స్పందించి, తన కాన్వాయ్ను ఆపి వారికి తక్షణ సహాయం అందించి ఆపన్నహస్తం అందించారు.

సమాచారం ప్రకారం.. భూంపల్లి గ్రామం నుంచి బోనాల కొండాపూర్కు వెళ్తున్న ప్రధాన మార్గంలో బోయిని చంద్రయ్య దంపతులు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో వారిద్దరూ తీవ్ర గాయాలతో రోడ్డుపై పడిపోయి విలవిలలాడుతున్నారు.

వెంటనే వాహనం నిలిపివేత: అదే మార్గంలో వెళ్తున్న ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి రోడ్డుపై గాయపడి ఉన్న దంపతులను గమనించిన వెంటనే తన వాహనాన్ని ఆపించారు.

మంచినీళ్లు అందించి ధైర్యం: స్వయంగా క్షతగాత్రుల వద్దకు చేరుకుని, వారికి మంచినీళ్లు తాగించి భయాందోళనకు గురికావద్దని, ప్రాణాలకు ఏమీ కాదని ధైర్యం చెప్పారు.

దగ్గరుండి అంబులెన్స్లోకి: వెంటనే 108 అంబులెన్స్కు సమాచారం అందించి రప్పించారు. అంబులెన్స్ వచ్చిన తర్వాత బాధితులను స్వయంగా తన చేతులతో ఎక్కించి ఆసుపత్రికి పంపించే వరకు అక్కడే ఉండి పర్యవేక్షించారు.

ప్రమాద తీవ్రతను దృష్ట్యా వెంటనే స్థానిక ఆసుపత్రి వైద్యులకు ఫోన్ ద్వారా సమాచారం అందించి, క్షతగాత్రులకు అత్యవసర చికిత్స విభాగంలో తక్షణమే మెరుగైన ఉచిత వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమయస్ఫూర్తితో స్పందించి దంపతుల ప్రాణాలను కాపాడేందుకు కృషి చేసిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వైఖరిపై బాధితుల కుటుంబసభ్యులు, స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ “ప్రభాకరన్న మానవత్వానికి మారుపేరు” అని కొనియాడారు.

Share
Share