Breaking News: శ్రీచైతన్య స్కూల్లో దారుణం.. టెన్త్ విద్యార్థిపై బూట్లతో తొక్కి ర్యాగింగ్..

మేడ్చల్/జవహర్నగర్, ఏపీబీ న్యూస్: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా దమ్మాయిగూడలోని శ్రీచైతన్య హైస్కూల్ హాస్టల్లో అత్యంత దారుణ ఘటన వెలుగు చూసింది. పదో తరగతి చదువుతున్న బాలుడిపై తోటి సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ పేరుతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. కర్రలు, ప్లేట్లతో కొట్టడమే కాకుండా బూట్లతో ముఖంపై తొక్కి రాక్షసానందం పొందారు. స్కూల్ యాజమాన్యం ఈ విషయాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నించడం పట్ల తల్లిదండ్రులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

బాధితుడి కుటుంబసభ్యులు మరియు పోలీసుల కథనం ప్రకారం.. కామారెడ్డి జిల్లాకు చెందిన అభిషేక్ అనే విద్యార్థి దమ్మాయిగూడ శ్రీచైతన్య స్కూల్ హాస్టల్లో ఉంటూ పదో తరగతి చదువుతున్నాడు.

హాస్టల్లో దాడి: రాత్రి సమయంలో హాస్టల్ గదిలోకి ప్రవేశించిన 12 మంది విద్యార్థులు అభిషేక్పై ర్యాగింగ్ నెపంతో దాడి చేశారు. కర్రలు, భోజనం ప్లేట్లతో కొడుతూ, బూట్లతో ముఖంపై తొక్కి దారుణంగా గాయపరిచారు.

యాజమాన్యం కవర్ డ్రైవ్: తీవ్రంగా గాయపడిన విద్యార్థి పరిస్థితి చూసి కంగారుపడిన స్కూల్ యాజమాన్యం.. బాలుడు “మెట్లపై నుంచి కింద పడిపోయాడు” అని తల్లిదండ్రులకు ఫోన్ చేసి అబద్ధం చెప్పారు.

పరిస్థితి విషమం: సమాచారం అందుకున్న తల్లిదండ్రులు వెంటనే హాస్టల్కు వచ్చి కొడుకును ఇంటికి తీసుకెళ్లారు. బాధితుడి పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

నిజం చెప్పిన బాధితుడు: స్పృహలోకి వచ్చిన అభిషేక్, తనపై 12 మంది సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ పేరుతో రాక్షసంగా దాడి చేశారని తల్లిదండ్రులకు చెప్పడంతో అసలు నిజం బయటపడింది.

తన కొడుకుపై హత్యాయత్నానికి ఒడిగట్టిన 12 మంది విద్యార్థులపై, ఘటనను దాచిపెట్టి తమను మోసం చేసిన శ్రీచైతన్య స్కూల్ యాజమాన్యంపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితుడి తల్లిదండ్రులు జవహర్నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ వేగవంతం చేశారు.

Share
Share